నందులు- ఎన్టీఆర్ జాతీయ అవార్డు మ‌ళ్లీ ఇస్తున్నందుకు థాంక్స్‌

ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. నందులు ఇచ్చే క్ర‌మంలోనే ఎన్టీఆర్ నేషనల్ అవార్డును పునరుద్ధరించాలని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

Update: 2026-10-04 03:50 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను పునరుద్ధరించడంపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు, నిర్మాతల మండలి సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కాస్త ఆలస్యంగానైనా ముఖ్యమంత్రికి .. ప్రభుత్వానికి నిర్మాతల మండలి తరఫున సి. కల్యాణ్, ప్రసన్న కుమార్ తదితరులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2017 నుంచి నంది అవార్డులు నిలిచిపోగా.. ఇప్పుడు ప్రభుత్వం తిరిగి వీటిని ప్రారంభించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంపై టాలీవుడ్‌లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ.. నందులు ఇచ్చే క్ర‌మంలోనే ఎన్టీఆర్ నేషనల్ అవార్డును పునరుద్ధరించాలని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ముఖ్యంగా బంగారు, వెండి నందితో పాటు కాంస్య నంది కూడా ఉండాలని నిర్మాతల మండలి ప్రభుత్వాన్ని కోరగా, ప్రభుత్వం అదనపు నందుల ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున ప్రభుత్వానికి అన్ని విషయాలను వివరిస్తున్నామని.. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వానికి సినీ పరిశ్రమపై ఉన్న అభిమానం స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ పునరుద్ధరణ ప్రక్రియలో సహకరించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, భరత్ భూషణ్, విశ్వనాథన్ తదితరులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 2012 నుంచి 2016 వ‌ర‌కూ ఆగిపోయిన నందుల‌ను ప్ర‌క‌టించారు. 2017 నుంచి అసలు నంది పురస్కారాలు నిలిచిపోయాయి. ఇప్పుడు నంది అవార్డుల దరఖాస్తుల కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయ‌డం హ‌ర్ష‌ణీయం. అయితే బంగారు, వెండి నందులతో పాటు కాంస్య నంది - రెండు కన్సోలేషన్ బహుమతులు ఉండాలని తాము ప్రతిపాదించామని.. దీనికి సంబంధించి త్వరలోనే జీవో కూడా రానుందని తెలిపారు. ముఖ్యంగా 2025 ఏడాదికి సంబంధించి అన్ని రకాల నందులను అందించాలని కోరినట్లు చెప్పారు. ఈ సందర్భంగా మంచి పనులు చేయాలనే తపన ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి -ప్రభుత్వ పెద్దలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గత కొంతకాలంగా నంది అవార్డుల ప్రక్రియ నిలిచిపోవడం వల్ల కళాకారులు, సాంకేతిక నిపుణులకు తగిన గుర్తింపు లభించలేదని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల టాలీవుడ్‌లో మళ్లీ కొత్త ఉత్సాహం సంతరించుకుందని.. చిన్న చిత్రాలలోని ప్రతిభావంతులు కూడా వెలుగులోకి వస్తారని పేర్కొన్నారు. పరిశ్రమలోని చిన్న, పెద్ద సినిమాలను గౌరవించే ఈ సంప్రదాయం మళ్లీ కొనసాగడం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు దక్కిన గొప్ప గౌరవమని ప్రశంసించారు.

నంది అవార్డుల పునరుద్ధరణ వల్ల భవిష్యత్‌లో మరింత పోటీతత్వం పెరిగి.. అత్యుత్తమ సినిమాలు రావడానికి గొప్ప ప్రేరణ లభిస్తుందని సినీ పెద్దలు ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమ- ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలకు ఈ నిర్ణయం ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని తెలిపారు. భవిష్యత్‌లో కూడా తెలుగు సినిమా అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ఇలాంటి మరిన్ని సహకారాలను అందిస్తుందని నమ్ముతున్నట్లు వారు వెల్లడించారు.

Tags:    

Similar News