టాలీవుడ్‌లో కొత్త బిజినెస్ మోడల్.. ఆర్యతో స్టార్ట్?

అందుకు తాజా ఉదాహరణగా ఒకప్పుడు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఆర్య సినిమాలోని హీరో పాత్రను కొత్త రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం నిలుస్తోంది.

Update: 2026-06-27 08:21 GMT

యానిమేషన్ సినిమాలంటే ఒకప్పుడు పిల్ల‌ల వినోదానికే పరిమితమనే అభిప్రాయం ఉండేది. కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే హాలీవుడ్‌లో సూపర్ హీరోలు, కామిక్ పాత్రలు, గేమింగ్ క్యారెక్టర్లు యానిమేషన్ రూపంలో కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు తాజా ఉదాహరణగా ఒకప్పుడు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ఆర్య సినిమాలోని హీరో పాత్రను కొత్త రూపంలో తీసుకురావాలనే ప్రయత్నం నిలుస్తోంది.

అయితే ఈ ప్ర‌యోగంలో భాగంగా పూర్తి సినిమాను మళ్లీ తెరకెక్కించకుండా ఆడియ‌న్స్ మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఒకే ఒక్క పాత్రను తీసుకుని సరికొత్త కథను రూపొందించే ఆలోచన ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక సినిమా స‌క్సెస్ కంటే అందులోని పాత్రలకు లభించిన ఆదరణను ప్రత్యేకంగా ఉపయోగించుకోవచ్చని ఈ ప్రాజెక్ట్ సూచిస్తోంది. ఆడియ‌న్స్ ఇప్పటికీ గుర్తుంచుకునే ఐకానిక్ క్యారెక్టర్లకు కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా వాటి లైఫ్ ను మరింత పొడిగించే ప్రయత్నంగా సినీ వర్గాలు దీనిని చూస్తున్నాయి.

ఈ ప్రయోగం వెనుక నిర్మాత దిల్ రాజు ఆలోచన కూడా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కథలు, కొత్త డైరెక్ట‌ర్ల‌తో ముందుకు సాగే ఆయన, ఇప్పుడు క్లాసిక్‌గా నిలిచిన ఒక పాత్రను యానిమేషన్ రూపంలో కొత్త తరానికి పరిచయం చేయాలని భావించడం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవ‌చ్చు. నేటి పిల్లలు, యూత్ ఆడియ‌న్స్ యానిమేటెడ్ కంటెంట్‌ను ఎక్కువగా ఆదరిస్తున్న తరుణంలో, పాత తరం అభిమానుల నోస్టాల్జియాతో పాటు కొత్త ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్ట్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇక డైరెక్ట‌ర్ సుకుమార్ కూడా ఈ పాత్ర రూపకల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టడం ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. ఒకప్పుడు ఆయన సృష్టించిన పాత్రను ఈ యానిమేషన్ ప్రపంచానికి అనుగుణంగా మళ్లీ డిజైన్ చేయడం ద్వారా క్యారెక్టర్‌లోని ప్రత్యేకతను మరింత బలంగా ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇది కేవలం యానిమేషన్ సినిమా కాకుండా, ఒక ఐకానిక్ పాత్రకు కొత్త జీవం పోసే ప్రయత్నంగా మారుతోంది.

కాగా ఈ ప్రాజెక్ట్ స‌క్సెస్ అయితే టాలీవుడ్‌లో కొత్త బిజినెస్ మోడల్‌కు కూడా నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. హిట్ సినిమాలను రీమేక్ చేయడం లేదా సీక్వెల్స్ తెరకెక్కించడం కంటే, వాటిలోని గుర్తుండిపోయే క్యారెక్ట‌ర్ల‌ను విడిగా యానిమేషన్ ఫ్రాంచైజీలుగా డెవ‌ల‌ప్ చేసే దిశగా నిర్మాతలు ఆలోచించే అవకాశం ఉంది. ఒక క్యారెక్ట‌ర్ ను దేశీయ మార్కెట్‌కే కాకుండా అంతర్జాతీయ ప్రేక్షకులకు కూడా చేరువ చేయగలిగితే, తెలుగు సినిమా నుంచి గ్లోబల్ క్యారెక్టర్ యూనివర్స్‌లు పుట్టుకొచ్చే అవకాశాన్ని కూడా ఈ ప్రయోగం సూచిస్తోంది. అందుకే ఆర్య యానిమేషన్ ప్రాజెక్ట్ కేవలం మరో సినిమాలా కాకుండా, టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆధారిత ఫ్రాంచైజీలకు, యానిమేషన్ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నంగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News