ట్రెండీ స్టోరి: సోషల్ మీడియా ఆదాయంలో రియల్ 'తలైవి'
ఇన్‌స్టాగ్రమ్‌లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. అత్యంత వేగంగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో `లేడీ సూపర్‌స్టార్`గా వెలుగొందుతున్న అగ్ర కథానాయిక నయనతార క్రేజ్ వెండితెరపైనే కాదు, డిజిటల్ మార్కెట్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇన్‌స్టాగ్రమ్‌లోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చినా.. అత్యంత వేగంగా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను సంపాదించుకుని సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రమ్‌లో నయన్‌ను దాదాపు 1 కోటి 4లక్షల మంది (10.4 మిలియన్ల)కి పైగా అభిమానులు అనుసరిస్తున్నారు. నయనతారకు ఉన్న ఈ అపారమైన ఫాలోయింగ్ - బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు క్యూ కడుతున్నాయనే టాక్ ఉంది.
ఇన్ స్టా పోస్ట్‌ల పారితోషికం - డిజిటల్ ప్యాకేజీల జోరు
బ్రాండ్స్ మార్కెటింగ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం... నయనతార ఇన్‌స్టాగ్రమ్‌లో ఒక్కో పెయిడ్ యాడ్ పోస్ట్ లేదా రీల్ కోసం రూ. 20 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇక ఏడాది కాలపరిమితి గల కార్పొరేట్ బ్రాండ్ కాంట్రాక్టుల కోసం ఆమె రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల మధ్య భారీ ప్యాకేజీని కుదుర్చుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ప్యాకేజీ కేవలం ఇన్‌స్టాగ్రమ్‌కే పరిమితం కాకుండా.. కంపెనీ ఒప్పందాన్ని బట్టి ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో డిజిటల్ ప్రచారంతో కూడిన పూర్తి ప్యాకేజీగా లేదా కొన్ని పెద్ద బ్రాండ్లకు అదనపు ఛార్జీలతో కూడిన ఒప్పందంగా సాగుతోందని ఇండస్ట్రీ టాక్.
సినిమా సినిమాకూ రికార్డు స్థాయి రెమ్యునరేషన్
ప్రస్తుతం భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఈ సీనియర్ నటి ఒక్కో సినిమాకు రూ. 10 కోట్ల నుండి రూ. 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ తన స్టార్ పవర్ ని, స్టామినాను నిరూపించుకుంటున్నారు. నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలైనా...కమర్షియల్ సినిమాలైనా నయన్ డేట్స్ కోసం నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో `లేడీ సూపర్‌స్టార్`గా నీరాజనాలు అందుకుంటున్న నయనతార సుమారు రూ. 200 కోట్లకు (దాదాపు 25 మిలియన్ డాలర్లు) పైగా నికర ఆస్తి విలువతో ఒక భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించారు. భారతీయ సినిమా రంగంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఒకరైన ఈ నటి కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు. ఒక్కో వాణిజ్య ప్రకటన లేదా యాడ్ కోసం ఆమె ఏకంగా రూ. 5 కోట్ల వరకు డిమాండ్ చేయడం విశేషం. దీనికి తోడు తన సొంత నిర్మాణ సంస్థ 'రౌడీ పిక్చర్స్ లో సినిమాల నిర్మాణం ద్వారా ఆర్జిస్తూ, ఇతర వ్యాపార పెట్టుబడుల ద్వారా తన ఆదాయ వనరులను మరింత విస్తరిస్తూ.. నయనతార కేవలం ఒక అగ్ర నటిగానే కాకుండా టాలెంటెడ్ బిజినెస్ ఉమన్‌గా కూడా దూసుకుపోతున్నారు.
2026లో క్రేజీ ప్రాజెక్టులతో డైరీ ఫుల్:
నయనతార ప్రస్తుతం వైవిధ్యమైన చిత్రాలతో బిజీగా ఉన్నారు. తలైవి నయన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న `రక్కాయి` చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా .. `మన్నంగట్టి సిన్స్ 1960` ..`హాయ్` చిత్రాలు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్నాయి. వీటితో పాటు సూపర్ హిట్ డివైన్ కామెడీ సీక్వెల్ `మూకుత్తి అమ్మన్ 2` ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రిలీజ్ చిత్రాలతో పాటు.. ఈ ఏడాదిలో మరికొన్ని భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులపై నయనతార సంతకాలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే వీటి గురించి అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.