కంటెంట్ బట్టే రివ్యూలు కదా.. మరి నందిని ఎందుకలా?
ఆమె చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా విజయంలో రివ్యూల రోల్, ప్రేక్షకుల రెస్పాన్స్, సోషల్ మీడియా ఎఫెక్ట్ గురించి మళ్లీ చర్చ తెరపైకి వచ్చింది.
రివ్యూలా? సోషల్ మీడియా పోస్టులా? ఒక సినిమా సక్సెస్ కు అసలు ఎక్కువ ప్రభావం ఏవి చూపిస్తాయి? అనే ప్రశ్నపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా మా ఇంటి బంగారం సక్సెస్ మీట్ లో దర్శకురాలు నందిని రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆమె చేసిన కామెంట్స్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సినిమా విజయంలో రివ్యూల రోల్, ప్రేక్షకుల రెస్పాన్స్, సోషల్ మీడియా ఎఫెక్ట్ గురించి మళ్లీ చర్చ తెరపైకి వచ్చింది.
సాధారణంగా ఏ సినిమా విడుదలైనా ముందుగా ప్రేక్షకుల దృష్టి రివ్యూలపైనే ఉంటుంది. మీడియా సంస్థలు, సినీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయాలను వెల్లడిస్తారు. అదే సమయంలో తొలి షో చూసిన ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలను పంచుకుంటారు. ఆ రెండు అంశాలు సినిమా ఓపెనింగ్స్ అంచనాలను ప్రభావితం చేస్తాయి. అయితే చివరికి ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్లేది మాత్రం సినిమా కంటెంట్ అనే అభిప్రాయం ఎప్పుడూ వినిపిస్తోంది.
సినిమాలో కథ, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, క్యాస్టింగ్ యాక్టింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. అదే విషయం రివ్యూల్లో కనిపిస్తుంది. ప్రేక్షకుల సోషల్ మీడియా పోస్టుల్లో అదే ఉంటుంది. మరోవైపు సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే విమర్శలు కూడా అదే స్థాయిలో వస్తాయి. అందుకే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే నెగిటివ్ ప్రచారం కూడా ఎక్కువ కాలం ప్రభావం చూపలేదు.
ఇలాంటి సమయంలో మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ మీట్ లో నందిని రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. వైజాగ్ లో జరిగిన ఆ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. సినిమా సక్సెస్ కు రివ్యూల కంటే ప్రజలు సోషల్ మీడియాలో చేసిన పాజిటివ్ పోస్టులే ఎక్కువ కారణమయ్యాయని చెప్పడం వైరల్ గా మారింది. ఆ కామెంట్స్ తర్వాత సోషల్ మీడియాలో భిన్నమైన రెస్పాన్స్ కనిపిస్తోంది.
కొందరు నందిని రెడ్డి ఉద్దేశం రివ్యూలను తక్కువ చేసి చెప్పడం కాదని, ప్రేక్షకుల మౌత్ పబ్లిసిటీని ప్రశంసించడమేనని అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా సాధారణ ప్రేక్షకులు చేసిన ప్రచారం సినిమాకు మరింత చేరువ చేసిందనే యాంగిల్ లో ఆమె మాట్లాడి ఉండొచ్చని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం సోషల్ మీడియా పోస్టులు అయినా, మీడియా రివ్యూలు అయినా చివరికి రెండింటికీ ఆధారం సినిమా కంటెంట్ నే కదా అని అంటున్నారు.
సినిమా బాగుంటే ప్రేక్షకులు కూడా ప్రశంసిస్తారు, రివ్యూల్లో మంచి మార్కులు వస్తాయి. కంటెంట్ వీక్ గా ఉంటే సోషల్ మీడియాలో విమర్శలే ఎక్కువగా కనిపిస్తాయని గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు రివ్యూలను, ప్రేక్షకుల పోస్టులు వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం ఆ అంశంపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా విడుదలైన తొలి రోజు రివ్యూలు, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తి పెంచవచ్చు. కానీ ఒక సినిమాను నిజమైన విజయంగా నిలబెట్టేది మాత్రం ప్రేక్షకులు థియేటర్ కు మళ్లీ మళ్లీ రావడానికి కారణమయ్యేది కంటెంట్ మాత్రమే.