వివాహంతో రొమాన్స్ కు బ్రేక్ ప‌డాల్సిందే!

పెళ్లి తర్వాత దంపతుల మధ్య ప్రేమ? రొమాన్స్? ఎలా మారుతుందనే అంశంపై ఫ‌రాఖాన్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Update: 2026-06-27 07:20 GMT

బాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ ముక్కుసూటి త‌త్వం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. విష‌యం సిరియ‌స్ అయినా? సిల్లీ అయినా? హాస్యంగా మాట్లాడటంలో దిట్ట. ఇటీవల ఫ‌రాఖాన్ సీనియర్ నటుడు శేఖర్ సుమన్ నిర్వహిస్తున్న పాపులర్ టాక్ షో `శేఖర్ టోనైట్లో` అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ‌రాఖాన్ వైవాహిక జీవితం, భర్త శిరీష్ కుందర్‌తో ఉన్న 22 ఏళ్ల బంధం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెళ్లి తర్వాత దంపతుల మధ్య ప్రేమ? రొమాన్స్? ఎలా మారుతుందనే అంశంపై ఫ‌రాఖాన్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఈ చర్చకు కారణం శిరీష్ కుందర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సరికొత్త లుక్ ఫొటోలే. గతంలో కాస్త బొద్దుగా, సాధారణంగా కనిపించిన శిరీష్.. ఊహించని రీతిలో ఫిట్‌నెస్ సాధించి, సరికొత్త హెయిర్‌స్టైల్, శిల్పం లాంటి జా-లైన్‌తో స్లిమ్‌గా నెటిజన్ల ముందుకొచ్చారు. ఈ మేకోవర్ చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆయన వయస్సు సగానికి పైగా తగ్గిపోయి కుర్రాడిలా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు ప‌డ్డాయి. భర్త సాధించిన ఈ సంచలన మార్పుపై ఫరా ఖాన్ తనదైన శైలిలో జోకులు పేల్చారు.

ప్రస్తుతం తన భర్త, కుమారుడు జార్ ఇద్దరూ ఒకే ఎత్తులో ఉన్నారు. `శిరీష్ చాలా యంగ్‌గా మారిపోయాడు. ఒక్కోసారి రాత్రి వేళ బెడ్‌రూమ్‌లోకి ఎవరు? వచ్చారో కూడా గుర్తుపట్టలేనంత గందరగోళం ఏర్పడుతుందన్నారు. తనను వచ్చి హగ్ చేసుకున్నప్పుడే అతడు భర్త కాదని, కొడుకని అర్థమవుతుందని నవ్వుతూ వ్యాఖ్యానించారు ఫ‌రాఖాన్. సెలబ్రిటీ భార్యగా భర్త లుక్‌పై ఆమె చేసిన సరదా వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అలాగే వైవాహిక బంధాలపై ఫరా పరిణతి చెందిన విశ్లేషణ చేశారు. పెళ్లయిన ఇన్నేళ్ల తర్వాత రొమాన్స్ అనేది నిజంగానే తగ్గిపోతుందా? అని అడిగిన ప్రశ్నకు ఆమె అవుననే సమాధానం ఇచ్చారు. డేటింగ్ రోజుల్లో ఒకరినొకరు ఎలాగైనా దక్కించుకోవాలనే తపనతో రొమాన్స్ పీక్స్‌లో ఉంటుందని కానీ పెళ్లయ్యాక దాని ప్రాధాన్యత మారి పోతుందని అంగీకరించారు. ఒకే వ్యక్తితో దశాబ్దాల పాటు కలిసి ప్రయాణించినప్పుడు ఆకర్షణ స్థానంలో బాధ్యత, పరస్పర గౌరవం చోటు చేసుకుంటాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం తన జీవితంలో శిరీష్ పాత్ర రొమాంటిక్ భాగస్వామి కంటే అద్భుతమైన తండ్రిగా, కుటుంబానికి వెన్నుముకగా ఎంతో విలువైనదని ఫరా కొనియాడారు. వారి ముగ్గురు పిల్లల ఉన్నత చదువుల కోసం, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అడ్మిషన్ల ప్రక్రియలో శిరీష్ అందించిన గైడెన్స్ అమోఘమని స్పష్టం చేశారు. ఆయన నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటారని ప్రస్తుతం స్క్రిప్ట్ రైటింగ్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై కూడా పరిశోధనలు చేస్తున్నారన్నారు.

2004లో `మై హూ నా` సినిమా సెట్స్ లో మొదలైన ఫ‌రాఖాన్-శిరీష్ పరిచయం పెళ్లిగా మారింది. నేటికీ విజయవంతంగా సాగుతుండటం వెనుక ఉన్న రహస్యాన్ని తాజా ఇంటర్వ్యూ స్పష్టం చేసింది. సినిమా రంగంలో నిలకడ లేని బంధాల మధ్య, పరస్పర వ్యక్తిత్వాల భేదాలను గౌరవిస్తూ ముందుకు సాగడమే సుదీర్ఘ ప్రయాణానికి కార‌ణ‌మని తెలుస్తోంది. సినిమా స్క్రీన్ లవ్ స్టోరీల్లా కాకుండా నిజ జీవితంలో భాగస్వామ్యానికి ఉండే అసలు సిసలైన అర్థాన్ని ఫరా ఖాన్ మాటలు ప్రతిబింబిస్తున్నాయి.

Tags:    

Similar News