శంకరాభరణం తొలి హీరో క్రిష్ణంరాజు...కానీ ?
1979 ప్రాంతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన కళా తపస్వి కె విశ్వనాధ్ వారి కళాఖండం శంకరాభరణం మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్ళింది.;
1979 ప్రాంతంలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టిన కళా తపస్వి కె విశ్వనాధ్ వారి కళాఖండం శంకరాభరణం మూవీ తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్ళింది. ఈ మూవీ రిలీజ్ అయి అర్ధ శతాబ్దానికి చేరువ అవుతున్నా ఆ ఫ్లేవర్ అయితే పోలేదు. ఈ రోజుకీ శంకరాభరణం గురించి అంతా మాట్లాడుకుంటారు. ఈ మూవీని ఒక తపస్సులా భావించి విశ్వనాధ్ తీశారు. ఆ సినిమా తరువాతనే ఆయనకు కళా తపస్వి అన్న పేరు కూడా వచ్చింది.
రెబెల్ స్టార్ తో :
ఈ మూవీ విషయంలో చాలా ఆసక్తికరమైన విషయాలు తెర వెనక జరిగాయి. ఈ మూవీని తీయాలని అనుకున్నపుడు అప్పటి టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన రెబెల్ స్టార్ కృష్ణం రాజుని మొదట అప్రోచ్ అయ్యారుట. హీరో పాత్ర ఉదాత్తమైనది. పాటలు హీరోయిన్ అన్నవి లేవు. సంగీత ప్రదానమైన చిత్రం. దాంతో ఈ మూవీ చేసే సమయానికి రెబెల్ స్టార్ గా క్రిష్ణం రాజు ఇండస్ట్రీలో వీర విహారం చేస్తున్నారు. కటకటాల రుద్రయ్య మూవీ ఆయన రెబెల్ స్టార్ ఇమేజ్ ని ఓవర్ నైట్ ఎక్కడితో తీసుకెళ్ళింది. ఆ సమయంలో ఈ మూవీలో హీరో అంటే ఆయన సున్నితంగా నో చెప్పారని చెబుతారు.
చాలా మంది అనుకున్నా :
ఇక ఈ మూవీ విషయంలో చాలా మందిని చాయిస్ గా పెట్టుకున్నా ఎక్కడా సెట్ కావడం లేదు. ఈ మూవీకి హీరో పాత్ర చాలా కీలకం. పైగా కధ కూడా ఆయన చుట్టే తిరుగుతుంది. పైగా నడి వయసు దాటిన పాత్రగా ఉండాలి. దాంతో ఈ మూవీకి అన్నీ రెడీ అయినా హీరో ఎంపిక ఒక చాలెంజ్ గా మారింది అని చెబుతారు. అయితే అదే సమయంలో రారా క్రిష్ణయ్య అని ఒక మూవీ వచ్చింది. అందులో పెద్దాయన పాత్రలో జేవీ సోమయాజులు తొలిసారిగా వెండి తెర మీద కనిపించారు. ఆ మూవీకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ బాలు మ్యూజిక్ డైరెక్టర్. దాంతో ఆయన ఈ మూవీలో జేవీ సోమయాజులుని చూసి విశ్వనాధ్ కి చెప్పడంతో ఆయన దృష్టిలో సోమయాజులు పడ్డారు.
ఓకే అనుకుని :
ఇక జేవీ సోమయాజులుని చూసిన విశ్వనాధ్ కి తాను స్వయంగా రాసిన శంకరాభరణం కధకు ఆయనే అసలైన హీరో అని భావించారుట. ఆ వెంటనే ఓకే చేశారు. అలా ఈ మూవీలో జేవీ సోమయాజులు హీరో అయ్యారు. అంతే కాదు ఆయన ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించినా ఆయన టోటల్ కెరీర్ లో శంకరాభరణం ల్యాండ్ మార్క్ లా నిలిచిపోయింది. ఇక జేవీ సోమయాజులు ఎవరో కాదు అప్పటికే టాలీవుడ్ లో నటుడుగా స్థిరపడిన జేవీ రమణమూర్తికి స్వయాన అన్న గారు. ఆయనకు విశేష నాటకానుభవం ఉంది. అందుకే ఆయన శంకరాభరణం లో శంకరశాస్త్రి పాత్రలో జీవించేశారు అని చెప్పాలి.
టాప్ స్టార్స్ తో మొదలెట్టి :
ఇక విశ్వనాధ్ సినీ జీవితం గురించి చూస్తే తమాషాగా ఉంటుంది. ఆయన అక్కినేని నాగేశ్వరారావు హీరో ఆత్మ గౌరవం మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత మహా నటుడు ఎన్టీఆర్ తో వరసగా నాలుగు సూపర్ డూపర్ హిట్ మూవీస్ తీశారు. ఇక క్రిష్ణతో కూడా సినిమాలు తీసిన విశ్వనాధ్ 70 దశకం వచ్చేసరికి హీరో శోభన్ బాబుతోనే ఎక్కువ సినిమాలు తీశారు. వీరిద్దరికీ హిట్ జోడీ అని ఆ రోజుల్లో పేరు ఉండేది. అయితే సిరి సిరి మువ్వ తరువాత విశ్వనాధ్ పంధా మార్చేశారు సంగీతం నాట్యం ఇలా కళా ప్రదానమైన వస్తువును కధనంగా తీసుకుని సినిమాలు తీశారు.అవన్నీ హిట్ కావడమే కాదు విశ్వనాధ్ కి శాశ్వతమైన కీర్తిని తెచ్చిపెట్టారు. 1930 ఫిబ్రవరి 19న క్రిష్ణా జిల్లాలో పుట్టిన విశ్వనాధ్ 2022 ఫిబ్రవరి 2న ఈ లోకాన్ని వీడిపోయారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు పద్మశ్రీ. ఇరవై దాకా నంది అవార్డులు ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న విశ్వనాధ్ తెలుగు సినిమాకు ఒక అద్భుతం. ఒక మేలిమి ముత్యమని చెప్పాల్సిందే.