బాలీవుడ్‌కు సందీప్ మేనియా పట్టుకుందా?
`అర్జున్‌రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ. ఈ మూవీతో సినిమా మేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్ వంటి పలు అంశాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.;
`అర్జున్‌రెడ్డి` సినిమాతో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ. ఈ మూవీతో సినిమా మేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్ వంటి పలు అంశాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇదే మూవీని హిందీలో `కబీర్‌సింగ్` పేరుతో షాహీద్ కపూర్‌తో రీమేక్ చేసి అక్కడా సంచలనం సృష్టించారు. అప్పటి వరకు షాహీద్‌కున్న మార్కెట్ చాలా తక్కువ. ఈ సినిమాతో అతని మార్కెట్ రికార్డు స్థాయికి పెరిగింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.370 కోట్లుకు పైనే రాబట్టి షాహీద్ సినిమాల్లో రికార్డు సృష్టించింది.
ఇదే ఊపుతో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగ చేసిన యాక్షన్ డ్రామా `యానిమల్`. ఇది కూడా స్టోరీ టెల్లింగ్, హీరో క్యారెక్టర్ పరంగా బాలీవుడ్ సినిమాలలో పెను సంచలనం సృష్టించి సమూల మార్పులకు నాంది పలికింది. ఇప్పుడు బాలీవుడ్ సందీప్‌రెడ్డి వంగా మానియాని ఫాలో అవుతోందే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దానికి కారణం రణ్‌వీర్ సింగ్ `ధురంధర్`. సినిమా మేకింగ్‌లో ఇది కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రన్ టైమ్‌తో పాటు హీరో క్యారెక్టరైజేషన్, కథను నడిపించిన విధానం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇప్పుడు ఇదే పంథాని అనుసరిస్తూ బాలీవుడ్‌లో మరో సినిమా రాబోతోంది. అదే `ఓ రోమియో`. షాహీద్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. త్రిప్తి దిమ్రీ హీరోయిన్. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో సాజిద్ నదియావాలా ఈ మూవీని నిర్మిస్తున్నారు. `కబీర్‌సింగ్`తరువాత షాహీద్ కపూర్ ఒక్కటంటే ఒక్క హిట్‌ని అందుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులని ఎదుర్కోవడంతో మళ్లీ సందీప్ వంగ ఫార్ములానే ఫాలో కావాలనుకున్నాడో ఏమో కానీ `ఓ రోమియో`తో అదే ప్రయోగానికి సిద్ధమయ్యాడు.
శుక్రవారం రిలీజ్ చేసిన `ఓ రోమియో` ఫస్ట్ లుక్ దీనికి అద్దంపడుతోంది. ఒళ్లంతా రక్తంతో నిండిపోయి వైల్డ్‌గా అరుస్తున్న షాహీద్ లుక్ చూసిన వారంతా `ఓ రోమియో` ఫస్ట్ లుక్ రక్తసిక్తం అని కామెంట్‌లు చేస్తున్నారు. అలియాభట్ అయితే ఈ సినిమా కోసం ఎదురు చూడలేకపోతున్నానని కామెంట్ చేసింది. రా అండ్ రస్టిక్ లుక్‌లో షాహీద్ నటిస్తున్న ఈ మూవీ స్వాతంత్రానంతరం మారుతున్న ముంబాయి నగరం నేపథ్యంలో సాగుతుందట. అండర్ వరల్డ్ కార్యకలాపాలు ఆ రోజుల్లో ఎలా రాజ్యమేలాయి? ..ఎలాంటి సంఘనటలకు కారణమయ్యాయి? అనే కోణంలో ఈ కథ సాగుతుందట.
ఇందులో సప్నా దీదీ అనే గ్యాంగ్‌స్టర్‌ని ప్రేమించే వ్యక్తిగా షాహీద్ కపూర్ నటిస్తున్నాడు. ఈ పాత్రలో త్రిప్తి దిమ్రీ నటిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో నానా పటేకర్, రణ్‌దీప్ హుడా, శక్తి కపూర్, స్పెషల్ నంబర్‌లో తమన్నా.. కీలక అతిథి పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. రెగ్యులర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌కు పూర్తి భిన్నంగా సరికొత్త ఫార్మాట్‌లో ఈ మూవీని రూపొందిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.