కూతురి కోసం ప్రపంచాన్నే ఎదుర్కొనే తండ్రి కథ

తమిళ ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా ది లెజెండ్.;

Update: 2026-03-05 07:55 GMT

తమిళ ప్రముఖ వ్యాపారవేత్త అరుళ్ శరవణన్ హీరోగా తెరంగేట్రం చేసిన సినిమా ది లెజెండ్. ఆ సినిమాతోనే ఆయనకు లెజెండ్ శరవణన్ అనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే ఇమేజ్‌ను మరింత బలపరచడానికి ఆయన మరో భారీ యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లీడర్ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ తాజాగా రిలీజై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. టైటిల్ గ్లింప్స్‌తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా టీజర్, కథపై మరింత ఆస‌క్తిని పెంచుతోంది.

పేరుకు లీడర్ అయినప్పటికీ ఇది పూర్తిగా రాజకీయ నేపథ్యంలోని కథ కాదని టీజర్ చూస్తే స్పష్టమవుతోంది. తండ్రీ- కూతుళ్ల అనుబంధం చుట్టూ తిరిగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. నా కూతురుతో పాటే నేనుండాలి. దాని కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తా అనే ఎమోష‌న‌ల్ డైలాగ్‌తో ప్రారంభ‌మైన టీజ‌ర్, ఆ ఒక్క డైలాగ్‌నే కథలోని ఎమోష‌న్ కు బలమైన సూచనగా నిలుస్తోంది.

కూతురి కోసం తండ్రి ప‌డే పోరాటం

టీజర్ ముందుకు సాగేకొద్దీ కథలోని ప్రధాన సంఘర్షణ కొంచెం కొంచెంగా బయటపడుతుంది. తన కూతురి కోసం ఒక తండ్రి పడే పోరాటం, ఆమె జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కుటుంబాన్ని కాపాడేందుకు హీరో చేసే త్యాగాలను టీజర్‌లో చూపించారు. ఆ క్రమంలో హీరో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రావడం, జైలులో కూతురి జ్ఞాపకాలతో బాధపడే సీన్స్, ఎమోష‌న్‌ను మరింత పెంచుతున్నాయి. చివరికి తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? ఆ జ‌ర్నీలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు? అన్న అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచేలా టీజర్‌లో మిస్టరీగా ఉంచారు.

ఉత్కంఠ క‌లిగిస్తున్న టీజ‌ర్

యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ ఎలిమెంట్స్, సస్పెన్స్‌తో కూడిన విజువల్స్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారీ స్కేల్‌లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్ మేకింగ్ సినిమా స్థాయిని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు మంచి ఉత్కంఠను జోడించింది. సినిమాటోగ్రఫీ కూడా విజువల్‌గా గ్రాండ్‌గా కనిపిస్తోంది. ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన గతంలో రూపొందించిన యాక్షన్ సినిమాల్లాగానే ఈ సినిమాను కూడా మాస్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించినట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది.

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను లెజెండ్ శరవణన్ స్పోర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మొత్త‌మ్మీ లీడర్ మూవీ టీజర్ చూస్తే యాక్షన్, ఎమోషన్, సస్పెన్స్ కలబోసిన మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ టీజర్ తర్వాత సినిమా విడుదలపై మరింత ఆసక్తి పెరిగిందనడంలో సందేహం లేదు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



Tags:    

Similar News