నటనకే పరిమితం కాదు.. నిర్మాణ రంగంలో హీరోయిన్ల కొత్త ట్రెండ్
సినీ రంగంలో నటిగా గుర్తింపు పొందిన చాలా మంది హీరోయిన్‌లు ఇప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు.;
సినీ రంగంలో నటిగా గుర్తింపు పొందిన చాలా మంది హీరోయిన్‌లు ఇప్పుడు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. కేవలం యాక్టింగ్ కు మాత్రమే పరిమితం కాకుండా, నిర్మాతలుగా మరియు దర్శకులుగా మారుతూ తమ క్రియేటివిటీ, టాలెంట్ ను విస్తరించుకుంటున్నారు. రీసెంట్ కాలంలో ప్రముఖ హీరోయిన్లు సినిమాల నిర్మాణం, కథల ఎంపిక, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇవ్వడం లాంటి విషయాల్లో చురుకుగా పాల్గొనడం ఆసక్తికర పరిణామంగా మారింది.
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా నిలిచిన సమంత రూత్ ప్రభు ఇప్పటికే నిర్మాతగా మారారు. ఆమె నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లలో మా ఇంటి బంగారం వంటి సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ శుభం అనే ప్రాజెక్ట్‌తో నిర్మాతగా మారి, మొదటి సినిమాతోనే సక్సెస్ ను అందుకున్న విషయం తెలిసిందే. సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన నయనతార కూడా నిర్మాతగా తన ప్రభావాన్ని చూపుతున్నారు. ఆమె మరియు తన భర్త విఘ్నేష్ శివన్ కలిసి స్థాపించిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ ద్వారా పలు సినిమాలను నిర్మిస్తున్నారు నయనతార.
కోలీవుడ్ ప్రముఖ నటి జ్యోతిక కూడా సినీ నిర్మాణ రంగంలో సక్సెస్‌ఫుల్ గా కొనసాగుతున్నారు. ఆమె నిర్మించిన 36 వాయధినిలే లాంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిత్య మీనన్ కూడా నిర్మాతగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కేయూరి అనే బ్యానర్ ను మొదలుపెట్టిన నిత్యా, ఆ బ్యానర్ లో కొత్త కథలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా సత్తా చాటిన ఛార్మీ కౌర్ ఇప్పుడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి పూరీ కనెక్ట్స్ అనే బ్యానర్ ను స్థాపించి, అందులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి సక్సెస్ ను అందుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నిహారిక కొణిదెల ఒక మనసుతో మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా, దాని కంటే ముందు నుంచే ఆమెకు పింక్ ఎలిఫెంట్స్ అనే బ్యానర్ ఉంది. రీసెంట్ గా ఆ బ్యానర్ లో కమిటీ కుర్రాళ్లు అనే సినిమా తీసి సూపర్ హిట్ ను అందుకున్న నిహారిక, ఇప్పుడు రాకాస అనే ప్రాజెక్టును చేస్తున్నారు.
అమలాపాల్, నజ్రియా నాజిమ్, మంచు లక్ష్మి లాంటి వాళ్లు కూడా ఇప్పటికే నిర్మాతలుగా మారి కొత్త కథలకు ప్రోత్సాహం అందిస్తుండగా, ఇప్పుడు వారి దారిలోనే శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అదే దారిలో వెళ్తున్నారు. అయితే ఆమె కేవలం నిర్మాతగానే కాకుండా డైరెక్టర్ గా కూడా మారి ఎస్. సరస్వతి అనే సినిమాను తెరకెక్కించారు. మార్చి 6న ఆ సినిమా రిలీజ్ కానుంది.
మొత్తంగా చూస్తే, దక్షిణ భారత సినీ పరిశ్రమలో హీరోయిన్‌లు కేవలం తెరపైనే కాకుండా తెర వెనుక కూడా కీలక పాత్ర పోషించడం ప్రారంభించారు. నటనతో పాటు నిర్మాణం, దర్శకత్వం వంటి విభాగాల్లో అడుగుపెట్టడం ద్వారా వారు పరిశ్రమలో తమ ప్రభావాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఇది మహిళలకు కొత్త అవకాశాలు సృష్టించే దిశగా ఒక సానుకూల మార్పుగా సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.