ఒక 'యానిమ‌ల్' శ్రీ‌రాముడిగా న‌టిస్తే త‌ప్పు కాదు.. అల‌నాటి సీత‌మ్మ స‌పోర్ట్!

నితీష్ తివారి దృశ్యకావ్యం 'రామాయణం' ప్రకటన వచ్చినప్పటి నుంచీ బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఎంపికపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆన్‌లైన్ డిబేట్లు వేడెక్కుతూనే ఉన్నాయి.

Update: 2026-08-02 09:02 GMT

నితీష్ తివారి దృశ్యకావ్యం `రామాయణం` ప్రకటన వచ్చినప్పటి నుంచీ బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ ఎంపికపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆన్‌లైన్ డిబేట్లు వేడెక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా `యానిమల్` వంటి వయోలెంట్ సినిమాలో నటించిన రణ్‌బీర్, శాంతమూర్తి అయిన శ్రీరాముడి పవిత్రమైన పాత్రకు సెట్ కాడంటూ నెటిజన్లు, విమర్శకులు విరుచుకుపడ్డారు. లుక్ పరంగానే కాకుండా అత‌డి వ్యక్తిగత ప్రవర్తనను వేలెత్తి చూపుతూ కొందరు నెగెటివిటీని ప్రచారం చేస్తుండగా.. ఈ పాత్ర ఆఫర్ వ‌చ్చినప్పుడు తన అర్హతపై తనకే సందేహం కలిగిందని.. కానీ ఈ బాధ్యతను పూర్తి నిజాయితీతో నిర్వ‌హిస్తానని రణ్‌బీర్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పరిశ్రమకు చెందిన ప్రముఖులు- కోస్టార్లు అత‌డికి అండగా నిలుస్తున్నారు.

రణ్‌బీర్ కపూర్‌కి లభించిన అత్యంత భారీ మద్దతు రామానంద్ సాగర్ ఐకానిక్ `రామాయణ్` సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా నుండి ద‌క్కింది. ఒక నటుడికి వైవిధ్యమైన పాత్రలు పోషించే స్వేచ్ఛ ఉండాలని సమర్థిస్తూ బర్ఫీ, యానిమల్ చేసిన నటుడు శ్రీరాముడి పాత్రను కూడా పోషించగలడు. అత‌డొక నటుడు.. మేమేం ఆకాశం నుండి ఊడిపడలేదు! అని దీపికా వ్యాఖ్యానించారు. నటుడిగా ఇటువంటి వైవిధ్యమైన పాత్రలు లభించడం రణ్‌బీర్ అదృష్టమని సీనియ‌ర్ న‌టి కొనియాడారు. రణ్‌బీర్ లోని నటుడిని కేవలం ఒక నెగెటివ్ పాత్రతో అంచనా వేయకూడదని నాటి సీత‌మ్మ‌ స్పష్టమైన సందేశమిచ్చారు.

అలాగే ఈ చిత్రంలో శ్రీరాముడి తల్లి కౌసల్యా దేవి పాత్రలో నటిస్తున్న సీనియర్ నటి ఇందిరా కృష్ణన్ కూడా రణ్‌బీర్‌కు గట్టి మద్దతుగా నిలిచారు. శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ తప్ప మరొకరిని అసలు ఊహించుకోలేమని.. `యానిమల్` తర్వాత అత‌డు చూపించబోయే ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ చూసి ప్రేక్షకులు క‌చ్చితంగా ఆశ్చర్యపోతారని ధీమా వ్యక్తం చేశారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్ర కోసమే జన్మించాడని ఈ న‌టి ప్రశంసల వర్షం కురిపించారు. తోటి నటీనటుల నుండి వస్తున్న ఈ విధమైన మద్దతు రణ్‌బీర్ నటనపై చిత్రబృందానికి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

మరోవైపు `యానిమల్` చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా `రామాయణం` ట్రైలర్ - రణ్‌బీర్ మేకోవర్‌పై ప్రశంసలు కురిపించారు. ``ఇది రామ్ యుగం ఆరంభం.. అధర్మంపై ధర్మం ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనడానికి ఇది ఒక శాశ్వత జ్ఞప్తి`` అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. శాంతం, గంభీరం కలగలిపిన శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ స్క్రీన్ ప్రెజెన్స్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ పాత్రల డిజైనింగ్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయని కొనియాడారు. ర‌ణ్ వీర్ - య‌ష్ ఫ్యాన్స్ దీనిపై విశ్లేషిస్తున్నారు. యష్ రావణుడిగా పర్ఫెక్ట్ సెట్ అయ్యారని.. రణ్‌బీర్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలరని ఫ్యాన్స్ రూపొందించిన స్వైపింగ్ వీడియోలపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. ర‌ణ‌బీర్ పై విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఎంతో ధైర్యంగా నితీష్ తివారీ అత‌డిని న‌మ్మి సినిమాని తెర‌కెక్కించ‌డంపైనా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. సెలబ్రిటీల బాసటతో రణ్‌బీర్ వర్సెస్ విమర్శకుల ఆన్‌లైన్ వార్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది.

Tags:    

Similar News