పాతికేళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు...!
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆయన నటించిన సికిందర్ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.;
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ పరంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఇటీవల ఆయన నటించిన సికిందర్ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సల్మాన్ ఖాన్ చాలా నమ్మకం పెట్టుకుని చేసిన సినిమాలు మినిమం ఆడటం లేదు. ఇలాంటి సమయంలో సల్మాన్ ఖాన్ సినిమాల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా సల్మాన్ ఖాన్ కొత్త సినిమాల విషయంలో ఫోకస్ పెట్టాడని తెలుస్తోంది. ఇంతకు ముందు ఏడాదికి రెండు సినిమాలు వచ్చే విధంగా ప్లాన్ చేసుకున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు మాత్రం ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు మంచి సినిమాతో రావాలని ఎదురు చూస్తున్నాడని ఆయన సన్నిహితులు, ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
సల్మాన్ ఖాన్‌తో ఫర్హాన్ అక్తర్ మూవీ
గతంలో ఎప్పుడూ చేయని దర్శకులతో సల్మాన్ ఖాన్ సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ గతంలో ఎప్పుడూ చేయని జోనర్‌లో సినిమాలు చేయాలని కూడా భావిస్తున్నాడట. అందుకే కొత్త దర్శకుల వద్ద కథలు వింటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే సల్మాన్ ఖాన్ ఇటీవల స్టార్ ఫిల్మ్ మేకర్ కమ్ యాక్టర్ ఫర్హాన్ అక్తర్ తో కలిసి వర్క్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. పాతిక ఏళ్ల క్రితం ఫర్హాన్ అక్తర్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో సల్మాన్ ఖాన్‌తో సినిమాను చేయాలని ఫర్హాన్ ప్రయత్నాలు చేశాడు. ఒక భారీ వార్ డ్రామా మూవీని సల్మాన్ ఖాన్‌తో తీసేందుకు కథ రెడీ చేసుకున్నాడు. అంతే కాకుండా ఆ సినిమాలో మరికొందరు ప్రముఖ స్టార్స్ ను నటింపజేయాలి అనుకున్నాడట. కానీ సల్మాన్ ఖాన్ రెండు మూడు ఏళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉండటం వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు.
హృతిక్ రోషన్ తో లక్ష్య
2001లో సల్మాన్ ఖాన్‌తో సినిమా కాకుండా అమీర్ ఖాన్‌తో దిల్ చహ్‌తాహై సినిమాతో ఫర్హాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ వెంటనే లక్ష్య సినిమాతో వచ్చాడు. అది వార్ నేపథ్యంలో అయినప్పటికీ సల్మాన్ ఖాన్‌తో చేయాలి అనుకున్న కథ కాదని స్వయంగా ఫర్హాన్ చెప్పుకొచ్చాడు. లక్ష్య సినిమాను హృతిక్ రోషన్‌తో చేసిన ఫర్హాన్ ఆ తర్వాత ఎప్పుడూ సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేయలేదు. ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవని చాలా మంది అనుకుంటారు. కానీ ఇద్దరూ బాగానే ఉంటారని, కానీ కథ సెట్ కాకపోవడం వల్ల, టైమ్ కుదరక పోవడం వల్ల సినిమాలు వీరి కాంబోలో రావడం లేదు అంటూ కొందరు మాట్లాడుతున్నారు. మొత్తానికి సల్మాన్ ఖాన్, ఫర్హాన్ అక్తర్ కాంబో మూవీ పాతికేళ్ల వరకు రాకుండా అలాగే ఉండి పోయింది.
బాలీవుడ్ నుంచి లక్ష్య 2
ఫర్హాన్ అక్తర్ మరోసారి తన పాతిక ఏళ్ల నాటి వార్ డ్రామా స్టోరీని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఆర్మీ, వార్ నేపథ్యంలో చాలా సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, దర్శకుడు, హీరోలకు మంచి పేరును తెచ్చి పెడుతున్నాయి. అందుకే ఈ సమయంలో సల్మాన్ ఖాన్‌తో గతంలో అనుకున్న ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తే బాగుంటుందని ఫర్హాన్ అక్తర్ భావిస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇప్పటి వరకు బాలీవుడ్ సర్కిల్స్ నుంచి పుకార్లే తప్ప అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.
లక్ష్య 2 టైటిల్‌తో ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది బలంగా వినిపిస్తున్న పుకారు. సల్మాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఫర్హాన్ అక్తర్‌తో సినిమా చేయడం వల్ల ఖచ్చితంగా కెరీర్ కు ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఫర్హాన్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారం జరుగుతున్న ఈ సినిమా ఎప్పటికి పట్టాలెక్కేనో చూడాలి.