సూపర్‌స్టార్ పనైపోయిందంటూ.. ఎందుకు ఈ దుష్ప్రచారం?
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.;
బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కెరీర్ ముగిసిపోయిందంటూ ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముఖ్యంగా `సికందర్` సినిమా తర్వాత సల్మాన్ పని అయిపోయిందని.. కొత్త నిర్మాతలు ఎవరూ ఆయనతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదని నహతా అన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి నకిలీ వీడియోలను సృష్టించడం సర్వసాధారణమైపోయింది. ఈ క్రమంలోనే సల్మాన్‌పై వస్తున్న ఆ వీడియో కూడా ఏఐ సృష్టించిన నకిలీది అయ్యే అవకాశం ఉందని.. దీనిపై కోమల్ నహతా స్వయంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
సల్మాన్ ఖాన్ వంటి అగ్ర హీరో విషయంలో ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలను నమ్మడం కష్టమే. కెరీర్‌లో కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడనంత మాత్రాన ఒక లెజెండరీ నటుడి పని అయిపోయిందని అనడం ఏమాత్రం భావ్యం కాదు. చిత్ర పరిశ్రమలో ఓనమాలు కూడా దిద్దని కొత్త హీరోలు ఒక్క హిట్ కొడితేనే నిర్మాతలు అడ్వాన్సులతో వారి చుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది దశాబ్దాల కాలంగా ఎన్నో ఇండస్ట్రీ హిట్లను.. వందల కోట్ల వసూళ్లను సాధించిన ఒక అగ్ర హీరో విషయంలో ఇలాంటి దుష్ప్రచారం చేయడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సల్మాన్ ఇమేజ్ .. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ ముందు చిన్నపాటి పరాజయాలు పెద్ద లెక్కలోకి రావు. నాలుగేళ్లుగా ఆశించిన విజయాలు లేని మాట వాస్తవం. కానీ దానికి ఒక కొత్త పరిష్కారాన్ని ఆలోచించే మార్గం ఉంది.
బాక్సాఫీస్ సమీకరణాలకు తగ్గట్టు పరిష్కార మార్గాలు అనేకం ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నిర్మాతలు సినిమా బడ్జెట్‌లను తగ్గించమని కోరవచ్చు లేదా శాటిలైట్ - డిజిటల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పక్కా ప్లానింగ్‌తో సినిమాలు చేయవచ్చు. సల్మాన్ ఖాన్ కూడా భారీ పారితోషికం ఆశించకుండా సినిమా లాభాల్లో వాటా తీసుకునే `ప్రాఫిట్ షేరింగ్` విధానాన్ని అనుసరిస్తే అది నిర్మాతలకు ఎంతో ఊరటనిస్తుంది. ఇలాంటి వ్యూహాత్మక మార్పులతో అగ్ర హీరోలు ఎప్పుడూ సేఫ్ జోన్‌లో ఉండటమే కాకుండా.. పరిశ్రమకు కూడా అండగా నిలబడగలరు.
సల్మాన్ ఖాన్ తన కెరీర్‌లో అత్యున్నత దశను దాటి ఉండవచ్చు.. కానీ ఆయన కెరీర్ ముగిసిందని చెప్పడం అతిశయోక్తే అవుతుంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం `మాతృభూమి`తో తిరిగి ఫామ్‌లోకి రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాపై సల్మాన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. ఏదైనా ఒక బలమైన కమ్‌బ్యాక్ మూవీ పడితే విమర్శకుల నోళ్లు మూయించడం సల్మాన్ వంటి హీరోలకు పెద్ద కష్టమేమీ కాదు.
బాలీవుడ్ కమర్షియల్ మార్కెట్ నిలకడగా ఉండాలంటే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాలు విజయవంతం కావడం చాలా ముఖ్యం. అందుకే ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆయన తిరిగి పుంజుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి. సల్మాన్ తన పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలంటే తదుపరి చిత్రాలు కచ్చితంగా ఘనవిజయం సాధించాల్సి ఉంటుంది. సల్మాన్ తన తర్వాతి ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ మ్యాజిక్ క్రియేట్ చేస్తారోనని ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.