రౌడీ జ‌నార్థ‌న ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కు బిగ్ ప్లాన్‌?

ఇందులో `రౌడీ జ‌నార్థ‌న‌`పై ఇప్ప‌టికే మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది.;

Update: 2026-04-14 13:30 GMT

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా ప్ర‌స్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌లో న‌టిస్తున్నారు. రెండు కూడా భారీ స్థాయిలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లే. ర‌వి కిర‌ణ్ కోలా డైరెక్ష‌న్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న `రౌడీ జ‌నార్థ‌న‌` ఒక‌టి కాగా మ‌రొక‌టి రాహుల్ సంక్రీత్య‌న్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామా `ర‌ణ‌బాలి` మ‌రొక‌టి. ఈ రెండు సినిమాలు దేని క‌దే ప్ర‌త్యేక‌మైన క‌థ‌ల నేప‌థ్యంలో రూపొందుతున్నాయి.

ఇందులో `రౌడీ జ‌నార్థ‌న‌`పై ఇప్ప‌టికే మంచి బ‌జ్ క్రియేట్ అయింది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ఊర మాస్ క్యారెక్ట‌ర్‌లో న‌టిస్తున్న మూవీ ఇది కావ‌డంతో దీనిపై రౌడీ ఫ్యాన్స్ భారీ ఆశ‌లే పెట్టుకున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా 80వ ద‌శ‌కం నేప‌థ్యంలో సాగుతుంది. ఈస్ట్ గోదావ‌రి యాస‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ చెప్పే డైలాగ్‌లు ఈ చిత్రానికి హైలైట్‌గా నిల‌వ‌నున్నాయి.

అంతే కాకుండా విజ‌య్ గెట‌ప్‌, రౌడీగా త‌ను చేసే హంగామా మ‌రో హైలైట్‌గా నిలుస్తుంద‌ని గ్లింప్స్‌తో ఓ క్లారిటీ వ‌చ్చేసింది. `బండెడు అన్నం తిన కుండెడు ర‌క్తం తాడే రాచ్చ‌సుడి త‌ర‌హా క్యారెక్ట‌ర్‌లో రౌడీ జ‌నార్థ‌న‌గా విజ‌య్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌ర్‌ని ద‌ర్శ‌కుడు ర‌వి కిర‌ణ్ కోలా డిజైన్ చేసిన తీరు ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంద‌ని టీమ్ విశ్వాసంతో ఉంది. ఇదిలా ఉంటే ఇటీవ‌ల విజ‌య్, ర‌ష్మిక‌ల వివాహం కార‌ణంగా షూటింగ్‌కి కాస్త బ్రేక్ ఇచ్చిన టీమ్ మ‌ళ్లీ మొద‌లు పెట్టింది.

ఈ మూవీ కోసం భారీ ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ని ద‌ర్శ‌కుడు ర‌వికిర‌ణ్ కోలా ప్లాన్ చేశార‌ట‌. దీని కోసం ప్ర‌త్యేకంగా భారీ సెట్‌ని సిద్ధం చేయిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జోరుగా జ‌రుగుతోంది. దీని త‌రువాత ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌ని భారీ స్థాయిలో ప్లాన్ చేశార‌ట‌. ఇందు కోసం భారీ సెట్‌ని రెడీ చేసి అందులో షూట్ చేయ‌బోతున్నార‌ని, ఇది సినిమాకు వ‌న్ ఆఫ్ ది హైలైట్‌గా నిలుస్తుంద‌ని ఇన్ సైడ్ టాక్‌.

80వ ద‌శ‌కంలో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌నని, ఓ క్యారెక్ట‌ర్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. చాలా కాలంగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ మూవీ కోసం క‌ఠోరంగా శ్ర‌మిస్తున్నార‌ట‌. ఏ చిన్న విష‌యాన్ని కూడా నిర్ల‌క్ష్యం చేయ‌కుండా పూర్తి ప‌ర్‌ఫెక్ష‌న్‌తో వ‌ర్క్ చేస్తున్నార‌ని, సినిమా సీన్స్ చూస్తుంటే బ్లాక్ బ‌స్ట‌ర్ వైబ్స్ క‌నిపిస్తున్నాయ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Tags:    

Similar News