కేవ‌లం ప్రియురాలు అయినందుకు ఎంత‌టి అన్యాయం!

అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కోల్పోయిన వెయ్యి రోజుల త‌ర్వాత‌.. రియాకు క్లీన్ చిట్ వ‌చ్చింది. సుశాంత్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు, ఆర్థిక దుర్వినియోగం చేసిన‌ట్టు ఆధారాలు ఎక్క‌డా క‌నుగొన‌లేదు.;

Update: 2025-10-29 22:30 GMT

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణానంత‌రం పోలీసులు, ఏజెన్సీల‌ విచార‌ణలో అత‌డి ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి విధివంచిత‌గా మారింది. పోలీసులు అరెస్ట్ చేసాక‌, జైలు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు, త‌న‌ను నిర‌ప‌రాధి అని నిరూపించుకునేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఆమె, ఆమె సోద‌రుడు షోయ‌క్, ఆమె త‌ల్లిదండ్రులు స‌మాజం నుంచి తీవ్ర‌మైన ట్రోలింగ్ ని ఎదుర్కొన్నారు. తీవ్ర‌మైన ద్వేషాన్ని కూడా ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.

ముఖ్యంగా మీడియా పుంఖానుపుంఖాలుగా క‌థ‌నాలు వండి వార్చింది. యూట్యూబ్ చానెళ్లు, సోష‌ల్ మీడియాల‌లో గంట‌కో స్టోరీ చొప్పున వేసుకున్నాయి. రియా చ‌క్ర‌వ‌ర్తిని బ‌ద‌నాం చేయ‌డ‌మే ధ్యేయంగా ఎలాంటి శ‌త్రుత్వం లేని మీడియాలు కూడా దారుణంగా రియా విష‌యంలో శ‌త్రుత్వం, ద్వేషం చూపించాయి. రియా ఆ సమ‌యంలో ఒంట‌రిగా మారింది. కెరీర్ అవ‌కాశాల‌ను కూడా కోల్పోయింది.

ఒకే ఒక్క త‌ప్పుడు ఆరోప‌ణ త‌న జీవితాన్ని నాశ‌నం చేసింది. ఇటీవ‌ల సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన నేప‌థ్యంలో రియా ఎంత‌గా అన్యాయానికి గురైందో ప్ర‌జ‌లు నెమ్మ‌దిగా అర్థం చేసుకుంటున్నారు. కాలాన్ని రివైండ్ చేసి ఆ ప‌రిస్థితి త‌మ‌కు వ‌స్తే ఏమ‌వుతుందో? కోర్టులు, న్యాయ‌స్థానాలు లేక‌పోతే సామాన్యుడి ప‌రిస్థితి ఏమిటో! అంటూ ఆందోళన‌తో కూడుకున్న‌ ఆవేద‌న వ్య‌క్త‌మైంది.

కొన్ని టీవీ చానెళ్లు రియా చ‌క్ర‌వ‌ర్తిపై ఎంతగా ద్వేషాన్ని ప్ర‌ద‌ర్శించాయి అంటే.... ఐదు సంవత్సరాల తర్వాత లైవ్ టెలివిజన్‌లో విషపూరిత మంత్రగత్తె అంటూ క‌థ‌నాలు వేసాయి. ఎక్స్ ఖాతాలో అనామ‌కులు కూడా త‌మ అభిప్రాయాలు విశ్లేష‌ణ‌లు వేసారు. రాత్రికి రాత్రే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన‌ అనామక X యోధుల కార‌ణంగా రియాకు జ‌రిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. ప్ర‌తి ఒక్క‌రూ రియాను దూషించిన‌వారే. త‌ప్పంతా రియా చక్ర‌వ‌ర్తి చేసింది అని నిర్ధారించారు. ఒక ప్ర‌ముఖ చానెల్ న్యూస్ రీడ‌ర్ రియా చ‌క్ర‌వ‌ర్తి బ్లాక్ మ్యాజిక్ కి పాల్ప‌డింద‌ని క‌థ‌నం వేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను కోల్పోయిన వెయ్యి రోజుల త‌ర్వాత‌.. రియాకు క్లీన్ చిట్ వ‌చ్చింది. సుశాంత్ ను ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు, ఆర్థిక దుర్వినియోగం చేసిన‌ట్టు ఆధారాలు ఎక్క‌డా క‌నుగొన‌లేదు. అత‌డికి మెడిసిన్ డోస్ మోతాదును మించి ఇచ్చింద‌న్నది కూడా ఆరోప‌ణ‌లు మాత్ర‌మేన‌ని వైద్యులు ధృవీక‌రించారు.

నిజానికి ఇది సామాజిక దుర్భ‌ల‌త‌. మ‌ర‌ణించిన సుశాంత్ సింగ్ ను స్వీయ‌నిర్మిత స్టార్ గా, అండ‌దండలు లేని ఔట్ సైడ‌ర్ గా ప్ర‌శంస‌లు కురిపించిన మీడియా, రియా చ‌క్ర‌వ‌ర్తి త‌ర‌పున ఒక్క విష‌యాన్ని కూడా హైలైట్ చేయ‌లేదు. నిజానికి రియా కూడా ఔట్ సైడ‌ర్.. ఎలాంటి అండ‌దండ‌లు లేకుండానే స్టార్ వ‌ర‌ల్డ్ లో ఎదిగేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ త‌న‌కు బాస‌ట‌గా నిలిచేందుకు మీడియాలు కానీ, స‌మాజం కానీ లేనే లేవు. ఇప్పుడు క్లీన్ చిట్ వ‌చ్చాక కూడా రియా చ‌క్ర‌వ‌ర్తికి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించిన‌ వారే లేరు. ముఖ్యంగా తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి కొంద‌రు రియా చ‌క్ర‌వ‌ర్తికి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. అలాంటి వాళ్లంతా కేవ‌లం నోటి దుర‌ద‌గా మాత్ర‌మే అన్నార‌ని అర్థం చేసుకోవాలి.

ఈ కేసుల వ‌ల్ల రియా చ‌క్ర‌వ‌ర్తికి, ఆమె కుటుంబానికి జ‌రిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. ఈ స‌మ‌యంలో రియా ఏం కోల్పోయిందో .. దానిని తిరిగి సాధించుకునేందుకు ఎలాంటి స‌హాయ స‌హ‌కారాలు కావాలో ప‌రిశ్ర‌మ‌లే స‌ముచితంగా ఆలోచిస్తే బావుంటుంది.

పోలీసుల నుండి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వరకు ప్రతి ఒక్కరూ దురదృష్టవశాత్తూ రియా చ‌క్ర‌వ‌ర్తికి వ్య‌తిరేకంగా క‌వ‌రేజీని ఇవ్వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. రాజ్‌పుత్ మరణాన్ని సంచలనాత్మకంగా మార్చడంలో దర్యాప్తుపై దాని ప్రతికూల ప్రభావాన్ని చూపినందుకు రిపబ్లిక్ టీవీ .. టైమ్స్ నౌ పాత్రను బాంబే హైకోర్టు ప్రత్యేకంగా విమర్శించింది.

ఇక సోష‌ల్ మీడియాలు, యూట్యూబ్ చానెళ్లు అయితే దారుణాతి దారుణ‌మైన వ్యాఖ్య‌ల‌తో రియాపై ద్వేషాన్ని ప్ర‌ద‌ర్శించాయి. అస‌లు తాను ఎలాంటి నేరం చేయ‌లేదు. కేవ‌లం అత‌డికి ప్రియురాలు అయినంత మాత్రాన‌, ఇలా ఇంత ర‌చ్చ చేయ‌డం ఎంత‌టి అన్యాయం?

Tags:    

Similar News