స్క్రిప్ట్ తో రండి.. సినిమాతో వెళ్ళండి.. రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్!

సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ పెద్దలను సీఎం కోరారు.;

Update: 2025-12-09 13:09 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా సినీ ప్రముఖులతో ఒక కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీలో కొత్త అవకాశాలపై చర్చించడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశం. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు పాల్గొన్నారు. అలాగే జెనీలియా, అక్కినేని అమల వంటి నటీమణులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమకు ఒక భారీ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను గ్లోబల్ సినిమా హబ్ గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీనికి ఇండస్ట్రీ సహకారం కావాలని కోరారు.

ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' గురించి సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడ ఇప్పటికే స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని వివరించారు. ఈ యూనివర్సిటీ ద్వారా సినిమా రంగానికి అవసరమైన మానవ వనరులను తయారు చేసుకోవచ్చని సూచించారు.

సినిమాకు సంబంధించిన 24 క్రాఫ్ట్స్ లో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని ఇండస్ట్రీ పెద్దలను సీఎం కోరారు. దీనివల్ల లోకల్ టాలెంట్ కు ఉపాధి దొరకడమే కాకుండా, పరిశ్రమకు నైపుణ్యం కలిగిన టెక్నీషియన్స్ దొరుకుతారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లక్ష్యం కూడా ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.

ఇక ఫ్యూచర్ సిటీలో కొత్త స్టూడియోలను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. భూమి కేటాయింపులు, అనుమతుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. "కేవలం ఒక స్క్రిప్ట్ పట్టుకుని వస్తే చాలు.. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ పూర్తి చేసుకుని సినిమా ప్రింట్ తో బయటకు వెళ్ళేలా సదుపాయాలు ఉండాలి" అని సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ ను బయటపెట్టారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ సినీ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఫ్యూచర్ సిటీని సినిమా సిటీగా మార్చడానికి ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగులు ఇండస్ట్రీకి ఎంతవరకు మేలు చేస్తాయో, నిర్మాతలు ఈ ఆఫర్ ను ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.




Tags:    

Similar News