సంపాదించ‌డంలో ఈ భామ టెక్నిక్ మ‌తి పోగొడుతోంది!

సినిమా రంగంలో ఒక నటికి వరుస విజయాలు ఉంటేనే అవకాశాలు వస్తాయని.. పారితోషికం పెరుగుతుందని అందరూ భావిస్తారు;

Update: 2026-03-17 17:30 GMT

సినిమా రంగంలో ఒక నటికి వరుస విజయాలు ఉంటేనే అవకాశాలు వస్తాయని.. పారితోషికం పెరుగుతుందని అందరూ భావిస్తారు. కానీ టాలీవుడ్‌లో ప్రస్తుతం అందుకు భిన్న‌మైన‌ చర్చ నడుస్తోంది. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఒక స్టార్ బ్యూటీ వరుస ఆఫర్లు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వరుసగా పరాజయాలు పలకరిస్తున్నా ఈ బ్యూటీ క్రేజ్ మాత్రం తగ్గకపోవడం విశేషం. ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్ర పడినా.. అది తన కెరీర్‌పై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం చూసి ఇండస్ట్రీ వర్గాలు బాప్ రే అనకుండా ఉండలేకపోతున్నాయి.

సాధారణంగా ఒక సినిమా ఫ్లాప్ అయితేనే నిర్మాతలు సదరు హీరోయిన్‌ను పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈ భామ విషయంలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. ఒక భారీ ఫ్లాప్ తర్వాత కూడా ఈ బ్యూటీ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. అయితే ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమవుతోంది అని ఆరా తీస్తే.. ఈ న‌టి మెయింటైన్ చేసే రిలేషన్‌షిప్స్, మంచి స్నేహాలే కారణమని తెలుస్తోంది. ఇతరులతో సత్సంబంధాలను కొనసాగించడంలో తన అనుభవాన్ని రంగరిస్తూ.. తనకున్న పరిచయాలతో ఆఫర్లను చేజిక్కించుకుంటోందట.

ఇటీవల ఈ బ్యూటీ ఒక భారీ బడ్జెట్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఏకంగా 2.4 కోట్ల రూపాయల భారీ పారితోషికాన్ని అందుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా సరైన సక్సెస్ లేకపోయినా.. ఒక స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ రావడమే కాకుండా.. ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కడం నిజంగా విశేషం. ఇంతటి భారీ ఆఫర్ కెరీర్‌కు ప్ల‌స్ అవ్వ‌డ‌మే గాకుండా.. ఇంత పోటీలోను స‌ద‌రు కుర్ర బ్యూటీకి ఉన్న‌ డిమాండ్‌ను మరోసారి చాటి చెప్పింది.

నిజానికి స్టార్ హీరోల స‌ర‌స‌న‌ నటించే అవకాశం వస్తే చాలా మంది హీరోయిన్లు తమ క్రేజ్ కోసం పారితోషికం తగ్గించుకోవడానికి సిద్ధపడతారు. కానీ ఈ భామ మాత్రం తనకున్న పట్టుతో నిర్మాతలు అడిగినంత ఇచ్చేలా ఒప్పించగలిగిందట. పూర్తిగా గ్రౌండ్ టు ఎర్త్ ఉండటం.. సెట్స్ లో అందరితో సరదాగా ఉంటూ మంచి స్నేహాలు పెంచుకోవడం ఈ న‌టికి ప్లస్ పాయింట్ అయ్యింది. కేవలం నటన మాత్రమే కాదు.. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవసరమైన టెక్నిక్స్ ఈ బ్యూటీకి బాగా తెలుసని అర్థమవుతోంది.

సినిమా పరిశ్రమలో కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. ఇతరులతో సత్సంబంధాలు కలిగి ఉండటం కూడా చాలా కీలకమని ఈ హీరోయిన్ నిరూపిస్తోంది. ఫ్లాపుల్లో ఉన్నా కూడా కోట్లాది రూపాయ‌లు ఎలా ఆర్జించవచ్చో ఈమెను చూసి ఇతర కథానాయికలు కూడా నేర్చుకోవాల్సిందే. ఏదేమైనా వరుస పరాజయాల మధ్య కూడా భారీ రెమ్యూనరేషన్‌తో దూసుకుపోతున్న ఈ భామ టెక్నిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News