రాజకీయాల్లోకి నటీమణులను లాగడం అసభ్యకరం: మంచు విష్ణు ఆవేదన

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.;

Update: 2026-03-17 17:48 GMT

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరో విజయ్ సొంత పార్టీ పెట్టిన తర్వాత.. ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వస్తున్న విమర్శలు కలకలం రేపుతున్నాయి. విజయ్ భార్యతో విడాకుల వ్యవహారం .. ప్రముఖ నటి త్రిషతో ఆయనకు సంబంధం ఉందంటూ వస్తున్న పుకార్లపై ఇప్పటికే సీనియర్ నటి ఖుష్బూ సుందర్ స్పందించి, త్రిష ఎంతో డిగ్నిఫైడ్ అని.. ఇలాంటి అసత్య ప్రచారాలు సరికాదని మద్దతుగా నిలిచారు.

ఈ నేపథ్యంలో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, రాజకీయ కథనాల్లోకి నటీమణులను లాగడం అత్యంత అసభ్యకరమైన చర్య అని అభివర్ణించారు. కేవలం తమిళనాడులోనే కాకుండా.. ఎక్కడైనా సరే రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలను వాడుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. నటీనటులు అంటే కేవలం తెరపై కనిపించే బొమ్మలు మాత్రమే కాదని.. వారికి కూడా భావోద్వేగాలు, గౌరవం ఉంటాయని గుర్తు చేశారు.

నటీనటులకు తెర వెనుక కూడా ఒక ప్రైవేట్ జీవితం ఉంటుందని.. వారిని కేవలం రాజకీయంగా దెబ్బలు తినే వస్తువుల్లా భావించకూడదని విష్ణు ఘాటుగా వ్యాఖ్యానించారు. నటీనటులకు కూడా కుటుంబాలు ఉంటాయని.. సమాజంలో వారికి ఒక హోదా ఉంటుందని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వారి ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించడం నాగరికత అనిపించుకోదని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ప్రజా చర్చలు లేదా రాజకీయ విమర్శలు అనేవి ప్రాథమిక గౌరవానికి భంగం కలిగించేలా ఉండకూడదని.. ముఖ్యంగా మహిళల విష‌యంలో ప్రవర్తించే తీరులో సంయమనం పాటించాలని విష్ణు సూచించారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే అయినా అవి మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా లేదా వారిని వార్తా శీర్షికల కోసం బలిపశువులను చేసేలా ఉండకూడదని ఆయన హితవు పలికారు.

భారతీయ సంస్కృతిలో మహిళలను ఎప్పుడూ ఒక శక్తిగా, గౌరవించదగిన స్థానంలో చూస్తామని మంచు విష్ణు గుర్తు చేశారు. అటువంటి సంస్కృతి ఉన్న దేశంలో కేవలం రాజకీయాల కోసం మహిళలను అవమానాలకు పరిమితం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ``మనం మరింత మెరుగ్గా ప్రవర్తిద్దాం`` అంటూ సమాజానికి , రాజకీయ వర్గాలకు ఆయన ఒక పిలుపునిచ్చారు.

Tags:    

Similar News