సంక్రాంతికి రవితేజ దాగుడు మూతలు.. న్యూ కాంబో ఫిక్స్
రవితేజ ‘ఇరుముడి’ జోష్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. సినిమా మంచి రన్‌లో ఉండటంతో ఇండస్ట్రీ నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి.
రవితేజ ‘ఇరుముడి’ జోష్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు. సినిమా మంచి రన్‌లో ఉండటంతో ఇండస్ట్రీ నుంచి కూడా అభినందనలు వస్తున్నాయి. ఇప్పుడు నిర్మాత దిల్ రాజు, శిరీష్ కూడా రవితేజను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఈ మీటింగ్ అక్కడితో ఆగలేదు. చాలా రోజులుగా వినిపిస్తున్న రవితేజ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చేశారు.
రవితేజతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఇది బ్యానర్‌లో 64వ చిత్రం. హసిత్ గోలి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘దాగుడు మూతలు దండాకోర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 2027 జనవరి 14న సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు కూడా ప్రకటించారు. అంటే ‘ఇరుముడి’ తర్వాత రవితేజ మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేసే సినిమాతో రావడానికి సిద్ధమవుతున్నాడు.
హసిత్ గోలి పేరు ఇక్కడ మరో ప్లస్. ‘రాజ రాజ చోర’తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత ‘స్వాగ్’తో కూడా తన రైటింగ్ స్టైల్ వేరుగా ఉంటుందని చూపించాడు. కామెడీని నేరుగా జోక్స్‌లా కాకుండా పాత్రల నుంచే తీసుకురావడం అతని సినిమాల్లో కనిపిస్తుంది. అలాంటి దర్శకుడికి రవితేజ టైమింగ్ దొరికితే కాంబినేషన్ కాస్త కొత్తగానే ఉంటుంది. ఇద్దరూ కలిసి ఏ జోన్‌లోకి వెళ్తారన్నది చూడాలి.
రవితేజకు దిల్ రాజు బ్యానర్ కొత్త కాదు. గతంలో ‘భద్ర’, ‘రాజా ది గ్రేట్’ లాంటి సినిమాలు ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. ముఖ్యంగా ‘రాజా ది గ్రేట్’ రవితేజ కెరీర్‌లో ఒక మంచి బౌన్స్ బ్యాక్‌గా నిలిచింది. ఇప్పుడు ‘ఇరుముడి’తో మళ్లీ మంచి ఫేజ్‌లోకి వచ్చిన సమయంలో అదే బ్యానర్‌తో మరో సినిమా లాక్ కావడం మంచి టైమింగ్.
ఈ ప్రాజెక్ట్ గురించి గత కొంతకాలంగా రవితేజ హసిత్ గోలి కాంబినేషన్ అంటూ టాక్ ఉంది. శ్రీ విష్ణు కూడా సినిమాలో ఉండొచ్చనే ప్రచారం వచ్చింది. కానీ ప్రస్తుతం మేకర్స్ ప్రకటించినది మాత్రం రవితేజ, హసిత్ గోలి, దిల్ రాజు శిరీష్ కాంబినేషన్ వరకే. మిగతా కాస్ట్ గురించి తర్వాత క్లారిటీ రావాల్సి ఉంది.
రవితేజ ఇప్పుడు చేస్తున్న సినిమాల స్పీడ్ చూస్తే గ్యాప్ తీసుకునే ఆలోచనలో లేడని చెప్పొచ్చు. ఒక హిట్ వచ్చిన వెంటనే అదే రూట్‌లో మరో మాస్ సినిమా చేయకుండా, హసిత్ గోలి లాంటి రైటింగ్ బేస్డ్ దర్శకుడితో వెళ్లడం మాత్రం మంచి ఛాయిస్. పైగా సంక్రాంతి డేట్ కూడా ముందే లాక్ చేశారు. ఇక నెక్స్ట్ మరిన్ని అప్డేట్స్ రావాల్సి ఉంది.