ప్రజా సమస్యలపై శ్రద్ధ చూపండి.. కళాకారులపై కాదు!

ఉత్తరాఖండ్‌లోని న్యూ టెహ్రీ పట్టణంలో జరిగిన `సిద్ధ్‌పీఠ్ మా కుంజపురి టూరిజం అండ్ డెవలప్‌మెంట్ ఫెయిర్` వేడుకలో దాలేర్ మెహందీ ప్రదర్శన ఇస్తుండగా ఈ వివాదం చెలరేగింది.

Update: 2026-10-23 02:30 GMT

ఉత్తరాఖండ్‌లో ప్రముఖ గాయకుడు దాలేర్ మెహందీ ఎదుర్కొన్న అవమానకర ఘటనపై ఆయన సోదరుడు, సింగర్ మికా సింగ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరాఖండ్ మంత్రి సుబోధ్ ఉనియాల్ బహిరంగ వేదికపై దాలేర్ మెహందీని అనుచితంగా నిలదీయడాన్ని తీవ్రంగా ఖండించారు. కళాకారులకు ఎల్లప్పుడూ సముచిత గౌరవం దక్కాలని.. మంత్రి వెంటనే తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని మికా సింగ్ డిమాండ్ చేశారు.

ఉత్తరాఖండ్‌లోని న్యూ టెహ్రీ పట్టణంలో జరిగిన `సిద్ధ్‌పీఠ్ మా కుంజపురి టూరిజం అండ్ డెవలప్‌మెంట్ ఫెయిర్` వేడుకలో దాలేర్ మెహందీ ప్రదర్శన ఇస్తుండగా ఈ వివాదం చెలరేగింది. మంత్రి సుబోధ్ ఉనియాల్ అకస్మాత్తుగా స్టేజ్ పైకి దూసుకొచ్చి ఆయన మద్యం తాగి ఉన్నారా? అంటూ నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం రేపాయి. సీనియర్ గాయకుడిని అందరి ముందూ అలా ప్రశ్నించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ ఘటనపై మికా సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించి మంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. నిజానికి ఆ కార్యక్రమం రద్దు కాకుండా దాలేర్ మెహందీ కాపాడారని.. మంత్రి అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలని మికా పేర్కొన్నారు. ముందుగా ఈవెంట్ కోసం సింగర్ సునంద శర్మను బుక్ చేసుకున్నా? ఆమె అనారోగ్యం పాలవడంతో ఒక్క రోజు ముందే దాలేర్ మెహందీని సంప్రదించారని వెల్లడించారు.

తాను అనారోగ్యంతో ఉన్నా? బాధ్యతగా భావించి దాలేర్ మెహందీ ఆ కార్యక్రమానికి హాజరై ప్రదర్శన ఇచ్చారని మికా స్పష్టం చేశారు. అలాంటి సీనియర్ కళాకారుడిని స్టేజ్‌పై అందరి సమక్షంలో మద్యం మత్తులో ఉన్నారంటూ నిరాధార ఆరోపణలు చేయడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులు ఇలాంటి అవమానాలకు గురికాకుండా తగిన గౌరవం ఇవ్వాల‌ని హితవు పలికారు.

మంత్రి తప్పును అంగీకరించి దాలేర్ మెహందీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని మికా డిమాండ్ చేశారు. ప్రజా సేవలో ఎన్నో ముఖ్యమైన బాధ్యతలు ఉంటాయని..ఒక కళాకారుడిని ప్రశ్నించడానికి చూపిన శ్రద్ధను ప్రజా సమస్యల పరిష్కారంపై పెట్టాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, అభిమానులు దాలేర్ మెహందీకి మద్దతుగా నిలుస్తున్నారని కానీ మంత్రికి మాత్రం ఎవరూ మద్దతుగా రాలేదంటేనే ఆయన చేసిన తప్పు ఏంటో అర్థమవుతోందని మికా ఎద్దేవా చేశారు.

ఈ వివాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి జోక్యం చేసుకుని తగిన విచారణ జరపాలని మికా సింగ్ కోరారు. తాము ఉత్తరాఖండ్‌ను.. అక్కడి ప్రజలను ఎంతో ప్రేమిస్తామని అయితే రాష్ట్రంలో కళాకారులకు మాత్రం కచ్చితంగా తగిన గౌరవ మర్యాదలు దక్కాలని విజ్ఞప్తి చేశారు. కళాకారుల పట్ల ప్రజాప్రతినిధులు మరింత సున్నితంగా వ్యవహరించాలనే డిమాండ్ బాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.

Tags:    

Similar News