ట్రెండీ టాక్: రామబాణం దురంధర్‌ని తాకగలదా?
భారతీయ చలనచిత్ర రంగాన్ని ఇటు బిజినెస్ పరంగా.. అటు వసూళ్ల పరంగా షేక్ చేసిన గ్లోబల్ ఫ్రాంచైజీ `దురంధర్`.
భారతీయ చలనచిత్ర రంగాన్ని ఇటు బిజినెస్ పరంగా.. అటు వసూళ్ల పరంగా షేక్ చేసిన గ్లోబల్ ఫ్రాంచైజీ `దురంధర్`. మొదటి భాగం విడుదలయ్యేప్పుడు అంత హైప్, అంత పెద్ద రేంజు బిజినెస్ లేదు కానీ.. దురంధర్ సక్సెసై 1000 కోట్లు కొల్లగట్టాక దురంధర్ 2 పై భారీ బిజినెస్ సాగింది. ముఖ్యంగా సెన్సేషనల్ హిట్ సాధించిన `దురంధర్ 2` చిత్రాన్ని జియో స్టూడియోస్ -బి62 సంస్థలు నార్త్ థియేట్రికల్ హక్కులను ఎవరికీ అమ్మకుండా సొంతంగా విడుదల చేయగా, కేవలం ఉత్తరాది నుంచే ఏకంగా రూ. 1,000 కోట్ల నెట్ వసూళ్లను సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1848 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం నెలకొల్పిన రికార్డులను ఇప్పుడు బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `రామాయణం-1` అధిగమించాలని చూస్తోంది. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ చిత్రంపై ఉన్న నమ్మకంతో ఏకంగా ఆలిండియా థియేట్రికల్ హక్కుల కోసం రూ. 500 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఇతర భారీ చిత్రాల బిజినెస్‌తో పోలిస్తే ఈ రేంజ్ చాలా ఎక్కువని చెప్పాలి. ఉదాహరణకు షారూఖ్ ఖాన్ నటిస్తున్న `కింగ్` సినిమా ఆలిండియా థియేట్రికల్ హక్కులను పెన్ మరుధూర్ సంస్థ రూ. 250 కోట్లకు సొంతం చేసుకుంది. అలాగే కన్నడ స్టార్ యష్ నటిస్తున్న `టాక్సిక్` చిత్రానికి సంబంధించి ఆంధ్రా, తెలంగాణకు 110 రేంజులో, ఓవర్సీస్ హక్కుల డీల్ రూ. 100 కోట్లకు పైగానే పూర్తయింది. నార్త్ హక్కులను అనీల్ తడానీ విడుదల చేస్తుండటంతో అక్కడ కూడా రూ. 150 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ వీటన్నింటినీ మించి `రామాయణం` పార్ట్ 1 థియేట్రికల్ హక్కుల కోసమే ఏకంగా రూ. 400 నుండి రూ. 500 కోట్ల రేంజ్ ఆశిస్తుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
నిజానికి మొదట్లో ఈ సినిమా బడ్జెట్ రూ. 1000 కోట్లు అని తెలుగు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే వెంటనే స్పందించిన నమిత్ మల్హోత్రా టీమ్.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ఏకంగా రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంటే ఒక్కో భాగానికి సగటున రూ. 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఈ భారీ నిర్మాణ వ్యయానికి తగ్గట్టుగానే థియేట్రికల్ హక్కులతో పాటు నాన్-థియేట్రికల్ (డిజిటల్, శాటిలైట్) బిజినెస్‌ను కూడా డబుల్, ట్రిపుల్ రేంజులో డిమాండ్ చేస్తూ మేకర్స్ రేట్లను కొండెక్కించేస్తున్నారు.
వరల్డ్ క్లాస్ విజువల్స్, హాలీవుడ్ సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని నిర్మాతలు చెబుతున్నా.. ఈ స్థాయి రేట్లను చూసి స్థానిక బయ్యర్లు - పంపిణీదారులు కాస్త కంగారు పడుతున్నట్లు సమాచారం. ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. రామాయణం చిత్రానికి ఉత్తరాది (హిందీ బెల్ట్) వరకూ రూ. 250 కోట్ల రేంజ్ పలికినా వర్కవుట్ అవుతుంది కానీ.. దక్షిణాది మార్కెట్‌కు వచ్చేసరికి హక్కుల ధర రూ. 150 కోట్లు దాటితే బయ్యర్లు చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ మార్కెట్ల పరిమితులను బట్టి ఈ ధరలు కాస్త రిస్కీగా మారే ప్రమాదం ఉందంటున్నారు.
అయితే వరల్డ్ క్లాస్ విజువల్స్ అందించేందుకు భారీ ఖర్చు చేస్తున్నామని చెబుతున్న ఈ ప్రతిష్టాత్మక `రామాయణం` హక్కులను దక్కించుకోవడానికి బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలైన పెన్ స్టూడియోస్ కానీ, అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిలిమ్స్ గట్టిగా పోటీపడుతున్నట్లు టాక్. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పౌరాణిక దృశ్యకావ్యం `రామాయణం-1` ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో అత్యంత భారీగా విడుదల కానుంది. కేవలం భారతీయ ప్రాంతీయ భాషల్లోనే కాకుండా.. అంతర్జాతీయ వేదికలపై హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తున్నారు. రామబాణం ముల్లోకాలను అల్లాడించగలదు కానీ దురంధర్ రికార్డులను అధిగమిస్తుందా అనేది వేచి చూడాలి.