'సత్య'ని మించే ఎమోషన్.. 'ధురంధర్' ని మించే స్కేల్తో సంచలన ద్వయం!
భారతీయ సినీ యవనికపై తనదైన ముద్ర వేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ తరం ఎమోషనల్ కథనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మోహిత్ సూరి కలిసి ఓ సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.
భారతీయ సినీ యవనికపై తనదైన ముద్ర వేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ తరం ఎమోషనల్ కథనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మోహిత్ సూరి కలిసి ఓ సంచలన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో వర్మ దిట్ట కాగా.. ప్రేమికుల హృదయాలను పిండేసే భావోద్వేగాలను పండించడంలో మోహిత్ సూరి సిద్ధహస్తుడు. అలాంటి ఇద్దరు దిగ్గజాలు కలిసి తీసుకొస్తున్న తాజా చిత్రం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త సంచలనానికి తెరలేపనుంది.
ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్ గోపాల్ వర్మ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, మోహిత్ సూరి దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నారు. 1990ల కాలంలో ముంబై అండర్‌వరల్డ్‌ను ఊపేసిన దావూద్ ఇబ్రహీం మరియు చోటా రాజన్ ల మధ్య ఏర్పడిన విడిపోవడం (స్ప్లిట్) ఆధారంగా సినిమా తెరకెక్కనుంది. సౌత్య అనే వ్యక్తి ప్రమేయం వల్ల వీరిద్దరి మధ్య మొదలైన వైరం, ఆ తర్వాత భారత నిఘా సంస్థలు (ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు) జరిపిన ఆపరేషన్లు, 1993 నాటి బాంబు పేలుళ్ల అనంతర పరిణామాలను సినిమాలో ప్రధాన కథాంశంగా చూపించబోతున్నారు.
ఈ ప్రాజెక్ట్ స్కేల్ - ఎమోషన్ గురించి వర్మ సోషల్ మీడియాలో ఆసక్తికర వివరాలను పంచుకున్నారు. ఈ సినిమా స్కేల్ పరంగా చూస్తే `ధురంధర్` కంటే చాలా పెద్దదిగా ఉంటుందని.. అలాగే ఆత్మ (ఎమోషన్) పరంగా చూస్తే తన ఆల్‌టైమ్ క్లాసిక్ `సత్య` కంటే కూడా చాలా బలంగా.. మూలాల్లోకి వెళ్లి ఉంటుందని వర్మ ప్రకటించారు. హాలీవుడ్ ప్రముఖ దర్శకులు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా `జాస్` సినిమా తీస్తే లేదా స్టీవెన్ స్పీల్‌బర్గ్ `ది గాడ్‌ఫాదర్` తీస్తే ఎంతటి అద్భుతం జరుగుతుందో? మోహిత్ సూరితో తన కాంబినేషన్ కూడా సరిగ్గా అలాగే ఉంటుందని వర్మ పోలిక చేయడం విశేషం.
ఇంతటి తీవ్రమైన క్రైమ్ నేపథ్యం ఉన్న కథకు మోహిత్ సూరి పర్ఫెక్ట్ ఛాయిస్ అని వర్మ కొనియాడారు. గ్యాంగ్‌స్టర్ కథలతో పాటు హృదయానికి హత్తుకునే అద్భుతమైన ఎమోషనల్ మ్యూజిక్, అల్ట్రా-రియలిస్టిక్ యాక్షన్ సన్నివేశాలను జోడించడంలో మోహిత్ సూరి శైలి ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. కఠినమైన గ్యాంగ్‌స్టర్ కథకు మోహిత్ మార్కు ప్రేమ, భావోద్వేగాలు తోడవ్వడం వల్ల చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.
మోహిత్ సూరికి ఈ ప్రాజెక్ట్ ఓ నిజమైన క్షణంగా మారనుంది. చిన్నతనంలో రామ్ గోపాల్ వర్మ తీసిన `సత్య`, `కంపెనీ` వంటి చిత్రాలను చూసి స్ఫూర్తి పొంది దర్శకుడిగా మారిన మోహిత్ ఇప్పుడు ఆరాధించే వర్మ రాసిన కథకే దర్శకత్వం వహించడం విశేషం. ఇటీవల `సయ్యారా` చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా 570 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్ కొట్టిన మోహిత్ సూరి గ్యాంగ్‌స్టర్ డ్రామాతో విజయపరంపరను కొనసాగించాలని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ `పోలీస్ కంపెనీ`,`పోలీస్ స్టేషన్ మే భూత్`, `సిండికేట్` వంటి ఆసక్తికర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. వరుస చిత్రాల మధ్య మోహిత్ సూరితో వర్మ చేతులు కలపడం బాలీవుడ్‌తో పాటు సౌత్ సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రియలిస్టిక్ క్రైమ్ ఎలిమెంట్స్ - హై-వోల్టేజ్ ఎమోషన్స్ కలయికగా రాబోతున్న ఈ మెగా గ్యాంగ్‌స్టర్ డ్రామా వెండితెరపై ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.