విశ్వంభర.. ఆ ఆప్షన్ ఎందుకు తీసుకోకూడదు?

రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాను మామూలుగా కొత్త చిత్రం అనాలి. కానీ కొన్ని సినిమాలను మాత్రం అలా అనబుద్ధి కాదు. అవి ఎప్పుడో మొదలై, ఎప్పుడో కానీ పూర్తి కావు.

Update: 2026-09-14 23:30 GMT

రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాను మామూలుగా కొత్త చిత్రం అనాలి. కానీ కొన్ని సినిమాలను మాత్రం అలా అనబుద్ధి కాదు. అవి ఎప్పుడో మొదలై, ఎప్పుడో కానీ పూర్తి కావు. విడుదల విపరీతంగా ఆలస్యం అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ‘అంజి’ తర్వాత అంతగా ఆలస్యం అయిన చిత్రం.. విశ్వంభరనే. దాదాపు నాలుగేళ్ల ముందు ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పటికీ విడుదలకు నోచు కోలేదు. ఇదిగో అదిగో అంటూనే 2027 చివరికి వచ్చేశారు.

ఇప్పుడేమో 2027 సంక్రాంతికి రిలీజ్ అంటూ కొత్త కబురు వినిపిస్తోంది. కానీ ఆ పండక్కి ఆల్రెడీ చిరు మరో చిత్రం ‘కాకా’ షెడ్యూల్ అయి ఉంది. టార్గెట్ ప్రకారం చకచకా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి హైప్ ఉంది. 2027 సంక్రాంతికి రిలీజై బ్లాక్ బస్టర్ అవుతుందనే అంచనాలు ఈ చిత్రంపై ఉన్నాయి.

కానీ ఈ చిత్రాన్ని ‘విశ్వంభర’ కోసం వాయిదా వేయించే ప్రయత్నం జరుగుతున్నట్లుగా ఓ ప్రచారం నడుస్తోంది. కానీ మంచి హైప్ తెచ్చుకుని, షెడ్యూల్ ప్రకారం నడుస్తున్న సినిమాను.. ఏళ్లకు ఏళ్లు వాయిదా పడ్డ చిత్రం కోసం ఖాళీ చేయించడం కరెక్టా అన్నది ప్రశ్న. ఫ్యామిలీ టచ్ ఉన్న సినిమాలా కనిపిస్తున్న ‘కాకా’కు సంక్రాంతి అడ్వాంటేజ్ అయినట్లు.. ‘విశ్వంభర’ లాంటి ఫాంటసీ మూవీకి అవుతుందా అనే సందేహం కలుగుతోంది. ఎలాగూ ఇంత ఆలస్యం అయింది.. ఇంకొంచెం లేటైతే ఏంటి అన్న వాదనా వినిపిస్తోంది.

అసలు డిసెంబరు 3న ‘ఫౌజి’ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ డేట్‌ను ‘విశ్వంభర’ ఎందుకు తీసుకోకూడదన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. చిరు సినిమా వస్తుందంటే.. ఆ వీకెండ్‌కు షెడ్యూల్ అయిన వృషకర్మ, లెగసీ లాంటి చిత్రాలను కూడా పక్కకు తప్పించొచ్చు. ఒకవేళ ఆ టైంకి సినిమాను రెడీ చేసే అవకాశముంటే మేకర్స్ దాని మీద గట్టిగా ఆలోచించడం మంచిది. అంతే తప్ప ‘కాకా’ను సంక్రాంతి రేసు నుంచి తప్పించడమన్నది మంచి ఆలోచన కాకపోవచ్చు. డిసెంబరు తొలి వారంలో కుదరదంటే ఇక వేసవికి ఆరంభానికి ఈ సినిమాను షెడ్యూల్ చేసుకోవడం బెటర్.

Tags:    

Similar News