రెహమాన్ వద్దకి 'పెద్ది' ఫస్ట్ హాఫ్..!
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.;
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రూపొందుతోంది అనేందుకు సాక్ష్యంగా ఇప్పటికే విడుదలైన పాట, టీజర్ నిలిచాయి. రామ్ చరణ్ గత చిత్రం ఫలితం ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. అందుకే పెద్ది విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. అంతే కాకుండా పెద్ది సినిమా విడుదల విషయంలోనూ మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నారు అనేది టాక్. సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని తాజాగా సినిమా మొదటి సగం యొక్క ఎడిటింగ్ వర్షన్ సైతం పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తి చేసి సంతృప్తి చెందిన తర్వాతే దర్శకుడు బుచ్చిబాబు సెకండ్ హాఫ్ యొక్క ఎడిటింగ్ వర్క్ ను మొదలు పెట్టించాడని ఆయన సన్నిహితులు, యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఏఆర్ రెహమాన్ సంగీతం...
బుచ్చిబాబు గత చిత్రం ఉప్పెన భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పైగా సుకుమార్ శిష్యుడు కావడంతో బుచ్చి బాబు మేకింగ్ పై మెగా ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు .అందుకు తగ్గట్లుగానే సినిమా ఉంటుంది అని మేకర్స్ బలంగా చెబుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాలను చాలా అందించిన రెహమాన్ సంగీతం కచ్చితంగా పెద్దికి సైతం ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. అన్నట్లుగానే సినిమా నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్ సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది. ఈమధ్య కాలంలో ఆ స్థాయి విజయాన్ని, వ్యూస్ ను దక్కించుకున్న పాట మరేది లేదు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు, అన్ని వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.
పెద్ది ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పూర్తి..
సినిమా మొదటి సగం ఎడిటింగ్ సైతం పూర్తి చేసిన బుచ్చిబాబు ఇటీవలే ఆ భాగంను రెహమాన్ కి పంపించాడని, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను రెహమాన్ ప్రారంభించబోతున్నాడు అంటూ యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. రెహమాన్ కాస్త స్లోగా వర్క్ చేస్తాడని, ఆయన నుంచి బెస్ట్ ఔట్ పుట్ రాబట్టుకోవాలి అంటే కాస్త ఎక్కువ సమయం ఆయనకు ఇవ్వాలి అంటారు. అందుకే బుచ్చిబాబు మొదటి హాఫ్ ఎడిటింగ్ సైతం పూర్తి చేసి ముందే ఇవ్వడం వల్ల విడుదల సమయం వరకు రెహమాన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే సెకండ్ హాఫ్ సైతం ఫైనల్ ఎడిట్ చేసి ఇస్తే రెహమాన్ దానికి సైతం తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి సినిమా షూటింగ్ కాస్త స్లో అయినప్పటికీ చివరి దశ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విషయంలో మాత్రం రాజీ లేకుండా చాలా స్పీడ్‌గా నడుస్తున్నట్లుగా తాజా పరిస్థితులు చూస్తే అర్థం అవుతుంది.
రామ్ చరణ్, జాన్వీ కపూర్‌ల పెద్ది..
'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరుకు చెందిన ఒక క్రీడాకారుడి పాత్రలో కనిపించబోతున్నాడు. క్రికెట్ తో పాటు చాలా ఆటలను రామ్ చరణ్ ఈ సినిమాలో ఆడుతాడని చెబుతున్నాడు. కూలీ పని చేసుకుంటూ ఆటలు ఆడుతూ పై స్థాయికి వెళ్లే పాత్రలో చరణ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పల్లెటూరు అమ్మాయి పాత్రలో జాన్వీ కపూర్ ను చూడబోతున్నాం. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీ చాలా బాగుందంటూ ఇప్పటికే చికిరి సాంగ్ ను చూస్తే అనిపిస్తుంది. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రను పోలి పెద్ది పాత్ర ఉంది. ఇక సమంత పాత్రను పోలి జాన్వీ కపూర్ పాత్ర ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జాన్వీ కపూర్ కి ఈ సారి తన అందం చూపించడంతో పాటు, నటన ప్రతిభ చూపించే అవకాశం కూడా దక్కింది అనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. టాలీవుడ్ లో జాన్వీ కపూర్ పెద్దితో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.