సెట్లో ఉన్న టాలీవుడ్ సినిమాల బడ్జెట్లపై దురంధర్ ఎఫెక్ట్
టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న చిత్రాల బడ్జెట్లు పెరగడానికి కారణం ఏమిటి? ఆర్జీవీ చెబుతున్న `దురంధర్` ఎఫెక్ట్ నిజంగానే టాలీవుడ్‌ను వణికిస్తోందా? దీనిపై ఒక ప్రత్యేక విశ్లేషణ ఇలా ఉంది.;
టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న చిత్రాల బడ్జెట్లు పెరగడానికి కారణం ఏమిటి? ఆర్జీవీ చెబుతున్న `దురంధర్` ఎఫెక్ట్ నిజంగానే టాలీవుడ్‌ను వణికిస్తోందా? దీనిపై ఒక ప్రత్యేక విశ్లేషణ ఇలా ఉంది.
టాలీవుడ్ లో బడ్జెట్ల పెంపు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఈ క్రమంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని లేపాయి. ఇటీవల సంచలన విజయం సాధించిన `దురంధర్` సినిమా ప్రభావం వల్ల సెట్స్‌పై ఉన్న తెలుగు చిత్రాల నిర్మాతలు, దర్శకులు తమ కథాకథనాలను మార్చుకుంటున్నారని, రీషూట్లు చేయాల్సి వస్తోందని.. దీనివల్ల బడ్జెట్లు అమాంతం పెరుగుతున్నాయని వర్మ పేర్కొన్నారు. ఈ మార్పును దురంధర్ ఇన్ఫెక్షన్ గా ప్రజలు భావించాలనేది వర్మ మాట.
రామ్‌గోపాల్ వర్మ విశ్లేషణ ప్రకారం.. `దురంధర్` వంటి కొత్త తరహా మేకింగ్ చూశాక.. పాత మూస ఫార్ములాతో తీస్తున్న తెలుగు సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేవని మేకర్స్‌లో భయం పట్టుకుంది. అందుకే ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిన చిత్రాలను కూడా రీ-షూట్ చేయడం, భారీ హంగులు అద్దడం వల్ల అదనపు ఖర్చు భారంగా మారుతోంది. అయితే వర్మ తన `సత్య` సినిమా మేకింగ్ తో `దురంధర్` మేకింగ్ ని పోలుస్తూ.. తనదైన బ్రాండ్ శైలిని ప్రమోట్ చేసుకోవడానికే ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా? అనే సందేహం కలగక మానదు.
వాస్తవానికి టాలీవుడ్ సినిమాల రేంజు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులు భారతీయ సినిమా సరిహద్దులను చెరిపివేసి గ్లోబల్ మార్కెట్‌ను కొల్లగొడుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగులో ఇంకా తెలివితక్కువ పాత మూస సినిమాలు తీస్తున్నారని వర్మ విమర్శించడం విడ్డూరంగా ఉంది. నవతరం దర్శకులు తమ యూనిక్ స్క్రీన్ ప్లేలతో అద్భుతాలు సృష్టిస్తుంటే వర్మ మాత్రం ఇంకా పాత కాలపు విశ్లేషణలకే పరిమితమయ్యారని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
నిజానికి ఆర్జీవీ, మణిరత్నం, లింగుస్వామి వంటి సీనియర్ దర్శకులు ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా మారలేక `ఔట్ డేటెడ్` అయిపోయారనేది చేదు నిజం. రాజమౌళి లాంటి వారు టెక్నాలజీని, ఎమోషన్‌ను జతచేసి ప్రపంచాన్ని ఆకర్షిస్తుంటే ఆర్జీవీ మాత్రం లోకల్ మార్కెట్ కంటే దిగువకు పడిపోయారు. తన సినిమాలు క్వాలిటీ కోల్పోయినా ఇతరుల సినిమాలపై విశ్లేషణలు చేయడం వర్మకు అలవాటుగా మారిందని, ఆయన చెప్పే `దురంధర్` ప్రభావం కంటే ఆయన సినిమాలు ఆడకపోవడమే పెద్ద సమస్యని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక సినిమా విజయం సాధించినప్పుడు దాని స్ఫూర్తితో మార్పులు జరగడం సహజం. కానీ కేవలం ఒక్క సినిమా వల్లే ఇండస్ట్రీ అంతా భయపడి బడ్జెట్లు పెంచేస్తోందనడం అతిశయోక్తిగానే కనిపిస్తుంది. ఆర్జీవీ తన కెరీర్ పతన దశలో ఉండి కూడా.. ఇంకా తనను తాను ఒక `ట్రెండ్ సెట్టర్`గా భావించుకుంటూ పక్కవారిని తక్కువ చేసి మాట్లాడటం ఆయనకే నష్టం చేకూరుస్తోందనేది ఒక విశ్లేషణ. రాజమౌళి వంటి దర్శకులను మెచ్చుకుంటూనే తన సమకాలికులు ఎందుకు వెనుకబడ్డారో ఆయన గ్రహించలేకపోవడం ఆశ్చర్యకరం.
ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు పెరగడానికి కారణం కేవలం ఒక `దురంధర్` సినిమా మాత్రమే కాదు. పెరుగుతున్న మార్కెట్ వ్యాప్తి... సాంకేతిక అవసరాలు.. పాన్ ఇండియా రేంజ్ విజువలైజేషన్ దీనికి ప్రధాన కారణాలు. ఆర్జీవీ తన మేథోతనాన్ని కేవలం విమర్శలకే పరిమితం చేయకుండా.. మళ్ళీ శివ, సత్య లాంటి క్వాలిటీ సినిమాలు తీసి తన సత్తా నిరూపించుకుంటేనే ఆయన మాటలకు విలువ ఉంటుంది. లేదంటే ఈ విమర్శలు కేవలం `పబ్లిసిటీ స్టంట్స్`గానే మిగిలిపోతాయనేది ఒక విశ్లేషణ. తాను తలపెట్టిన `సర్కార్ 4` చిత్రంతో అన్ని సందేహాలను పటాపంచలు చేయాలని కూడా అభిమానులు బలంగా కోరుతున్నారు. సర్కార్ 4లో ఆర్జీవీలోని కసి-పట్టుదల- నిజాయితీ- నిబద్ధత, దురంధర నీతి కనిపిస్తాయని కూడా ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.