ఫిట్‌నెస్ పాఠాలతో గృహిణులను అలెర్ట్ చేస్తున్న టాప్-5 నటీమణులు
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటుందని బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి రెగ్యులర్ గా చెబుతుంటారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లంతా సంతోషంగా ఉంటుందని బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి రెగ్యులర్ గా చెబుతుంటారు. ప్రతి మహిళ తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలి. కచ్చితంగా యోగా, ప్రాణాయామం చేయాలి. ఫిజికల్ ఫిట్‌నెస్‌తో పాటు మెంటల్ ఫిట్‌నెస్ కూడా చాలా ముఖ్యం. వయసు పెరగకుండా ఆపడం మన చేతుల్లో లేదు కానీ క్రమశిక్షణతో కూడిన లైఫ్ స్టైల్ వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండొచ్చు అని తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. సమయం దొరకని గృహిణుల కోసం శిల్పా శెట్టి తన శిల్పాశెట్టి యాప్.. యూట్యూబ్ ఛానల్ ద్వారా సులువైన యోగాసనాలు, డైట్ ప్లాన్స్‌ను అందిస్తూ లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
బాలీవుడ్‌లో ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే మరో నటి మలైకా అరోరా. వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్న మలైకా సోషల్ మీడియా వేదికగా నిత్యం యోగా, మెడిటేషన్ ప్రాధాన్యతను వివరిస్తుంటారు. గృహిణులు ఇంట్లోనే ఉంటూ సులభంగా చేసుకోగలిగే `యోగా ఫర్ బిగినర్స్` క్లాసులను ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. తన `సర్వ యోగ` అకాడమీ ద్వారా మహిళల్లో మానసిక ప్రశాంతతను, శారీరక దృఢత్వాన్ని పెంచేందుకు ప్రత్యేకమైన యోగా సిరీస్‌లను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి తెచ్చి ఎందరికో మార్గదర్శిగా మారారు.
సౌత్ - నార్త్ సినిమాల్లో రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ కేవలం జిమ్ వర్కౌట్స్‌కే పరిమితం కాకుండా యోగా - మెడిటేషన్ ద్వారా మైండ్-బాడీ బ్యాలెన్స్ ఎలా సాధించాలో చెప్తుంటారు. రకుల్ తన సోషల్ మీడియా ఖాతాలలో `F45` ఫిట్‌నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడిపే మహిళలు, గృహిణుల కోసం పది నుండి పదిహేను నిమిషాల పాటు చేసుకోగలిగే క్విక్ వర్కౌట్స్.. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ (ప్రాణాయామం) వంటి వీడియోలను షేర్ చేస్తూ వారిలో హెల్త్ అవేర్‌నెస్ పెంచుతున్నారు.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ తన అల్ట్రా-ఫిట్ బాడీతో యూత్‌కు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్‌తో పాటు యోగాను తన దినచర్యలో భాగంగా చేసుకున్న దిశా.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా హోమ్ వర్కౌట్ టిప్స్ ఇస్తుంటారు. ఎటువంటి ఎక్విప్‌మెంట్ లేకుండా... ఇంట్లో ఉండే ఖాళీ స్థలంలోనే మహిళలు తమ ఫ్లెక్సిబిలిటీని ఎలా పెంచుకోవచ్చో.. బరువును ఎలా నియంత్రించుకోవచ్చో తన వీడియోల ద్వారా ప్రాక్టికల్‌గా చూపిస్తూ మిలియన్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.
వీరితో పాటు బాలీవుడ్ సీనియర్ నటి లారా దత్తా `లారా దత్తా మూవీస్` యూట్యూబ్ ఛానల్ ద్వారా గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా `ప్రీ-నేటల్ యోగా`.. మెడిటేషన్ క్లాసులను ఉచితంగా అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ సమంత కూడా ఈ మధ్యకాలంలో ఈషా ఫౌండేషన్ అలయెన్స్ తో మెడిటేషన్, యోగా లైఫ్ స్టైల్‌ను ప్రమోట్ చేస్తూ గృహిణులకు, వర్కింగ్ ఉమెన్స్‌కు ఆన్‌లైన్ ద్వారా డిజిటల్ ఫిట్‌నెస్ పాఠాలను నేర్పిస్తున్నారు. ఈ సెలబ్రిటీలంతా తమ ఆన్‌లైన్ క్లాసుల ద్వారా మహిళల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతున్నారు.