టాప్ స్టోరి: ఒక పెద్ద ఘటన తర్వాత వీళ్లకు ఛాన్సుల్లేవ్!
పరిశ్రమలో ఎంతగానో రాణించి ఆ తర్వాత అనుకోని వివాదాలు లేదా చట్టపరమైన కేసుల్లో చిక్కుకుని అవకాశాలు కోల్పోయిన నటీమణులు ఎందరో ఉన్నారు.
సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ జిగ్ జాగ్- నిరంతర అవకాశాల నిధి మాత్రమే కాదు... ఈ పరిశ్రమ అత్యంత సున్నితమైనది కూడా. ఇక్కడ ఒక్క పెద్ద తప్పు లేదా వివాదం ఆర్టిస్టుల కెరీర్‌ను రాత్రికి రాత్రే తలకిందులు చేయగలదు. పరిశ్రమలో ఎంతగానో రాణించి ఆ తర్వాత అనుకోని వివాదాలు లేదా చట్టపరమైన కేసుల్లో చిక్కుకుని అవకాశాలు కోల్పోయిన నటీమణులు ఎందరో ఉన్నారు.
గ్లామర్ ప్రపంచంలో తారలుగా వెలిగిపోవాలని ఎందరో ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే ఒక్కసారిగా చట్టపరమైన వివాదాల్లోనో లేదా ఇండస్ట్రీ పెద్దలను ఎదిరించో వార్తల్లో నిలిస్తే... ఆ తర్వాత ఇండస్ట్రీ వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తుందనేది చేదు నిజం. ఎంతగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ... సరికొత్త ఫోటోషూట్లతో హోయలు పోయినా... మేకర్స్ మాత్రం అటు వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. ఒక్క పెద్ద తప్పు లేదా వివాదంతో కెరీర్‌ను అంధకారంలోకి నెట్టేసుకున్న కొందరు నటీమణుల పరిస్థితి చూస్తుంటే `పరిశ్రమ తీరు ఇంతేనా?` అనే ప్రశ్న తలెత్తక మానదు.
మన పొరుగున ఉన్న శాండల్వుడ్ లో కొన్నేళ్ల క్రితం డ్రగ్స్ కేసులో ఇద్దరు కథానాయికలు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ ఒక్క ఘటన సదరు నటీమణుల కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం గడిపిన నటి సంజన గర్లానీకి ఆ తర్వాత నుంచి పరిశ్రమలో ఆశించిన స్థాయిలో అవకాశాలు లభించలేదు. సంజన బిగ్ బాస్ సహా బుల్లితెర షోలతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక ఇదే కేసులో చిక్కుకున్న మరో నటి రాగిణి ద్వివేది పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సినిమా ఛాన్సులు పూర్తిగా తగ్గిపోవడంతో ప్రస్తుతం ఈ నటి మళ్లీ మోడలింగ్, సరికొత్త ఫోటోషూట్లతో దూకుడు పెంచి ఎలాగైనా లైమ్‌లైట్‌లోకి రావాలని ప్రయత్నిస్తోంది.
మరోవైపు ఇండస్ట్రీలోని చీకటి కోణాలపై, కాస్టింగ్ కౌచ్‌పై ధైర్యంగా గళమెత్తిన నటీమణులను కూడా చిత్ర పరిశ్రమ దూరం పెట్టింది. మాలీవుడ్‌లో (మలయాళ పరిశ్రమ) ఉండే అరాచకాలను, కాస్టింగ్ కౌచ్‌ను బహిరంగంగా ఎండగట్టిన జాతీయ అవార్డు గ్రహీత పార్వతి తిరువోతుకు ఆ తర్వాత అవకాశాలు పూర్తిగా తగ్గాయి. పార్వతి స్వయంగా బహిరంగ ఇంటర్వ్యూలలో తనకు జరుగుతున్న అన్యాయాన్ని పూస గుచ్చారు. అలాగే టాలీవుడ్‌లో పబ్లిగ్గా కాస్టింగ్ కౌచ్ గురించి, ఇండస్ట్రీలో కొందరి నైజం గురించి మాట్లాడిన నటి మాధవీలతకు ఆ తర్వాత పరిశ్రమలో అవకాశాల తలుపులు మూసుకుపోయాయి.
ఇలాంటి సంచలన వివాదాల జాబితాలో నటి శ్రీరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ముందు శ్రీరెడ్డి నగ్న ధర్నా ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తీవ్ర నిర్ణయం తర్వాత తనకు టాలీవుడ్‌లో పూర్తిగా అవకాశాలు గల్లంతయ్యాయి. ఇక బాలీవుడ్‌లో `మీటూ` ఉద్యమానికి తెరతీసి, సీనియర్ నటుడు నానా పటేకర్ పై వేధింపుల ఆరోపణలు చేసిన తనూశ్రీ దత్తాను, అలాగే కోలీవుడ్‌లో ప్రముఖ లిరిసిస్ట్ వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్ చిన్మయి శ్రీపాదను కూడా ఇండస్ట్రీ దాదాపు `లైట్` తీసుకుంది.
పలు నేరారోపణలు... తీవ్రమైన క్రైమ్ కేసుల్లో ఇరుక్కున్న నటీనటుల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయి జైలు జీవితం అనుభవించిన నటి రన్యా రావు... ఆ గొడవ నుంచి నెమ్మదిగా బయటకు వచ్చినా మళ్లీ కెరీర్‌ను నిర్మించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. అటు బాలీవుడ్‌లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి.. ఆపై డ్రగ్స్ కేసుతో ముడిపడి జైలుకు వెళ్లిన రియా చక్రవర్తికి కూడా పరిశ్రమలో అవకాశాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే ఇండస్ట్రీలో సక్సెస్‌తో పాటు క్లీన్ ఇమేజ్ కూడా ఎంత ముఖ్యమో నేటితరం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.