యంగ్ డైరెక్ట‌ర్ల‌ను వ‌ద‌లని కమల్.. మరో టాలెంట్ కు అండ!

అంతే కాదు, పెద్ద హీరోతో సినిమా చేయలేకపోయినా డైరెక్ట‌ర్ ని పూర్తిగా పక్కన పెట్టకుండా అతనితో కలిసి కథను మరింత మెరుగుపరచే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.

Update: 2026-06-22 22:30 GMT

తమిళ సినీ పరిశ్రమలో కొత్త టాలెంట్ ను గుర్తించి వారికి అవకాశాలు కల్పించే నటుల్లో క‌మ‌ల్ హాస‌న్ పేరు ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. నటుడిగానే కాదు, నిర్మాతగా కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు తరచుగా చర్చనీయాంశమవుతుంటాయి. తాజాగా ఒక యంగ్ డైరెక్ట‌ర్ కి ఆయన ఇస్తున్న మద్దతు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చకు దారి తీసింది. సాధారణంగా ఒక పెద్ద స్టార్ కోసం రెడీ చేసిన కథ ఆ ప్రాజెక్టులో ముందుకు వెళ్లకపోతే, ఆ కథతో పాటూ డైరెక్ట‌ర్ అవకాశాలు కూడా తగ్గిపోతాయని భావిస్తారు. కానీ కమల్ విధానం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఒక ప్రాజెక్టు రూపంలో ఊహించిన కల నెరవేరకపోయినా, ఆ డైరెక్ట‌ర్ ఆలోచనలో విలువ ఉంటే దానిని వదిలేయకూడదన్న దృక్పథాన్ని ఆయన మరోసారి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా యంగ్ డైరెక్ట‌ర్ శిబి చ‌క్ర‌వ‌ర్తి పేరు ఈ నేపథ్యంలో వినిపిస్తోంది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శిబి.. క‌మ‌ల్ హాస‌న్ బ్యాన‌ర్ లో ర‌జినీ న‌టించ‌నున్న సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని అంతా అనుకున్నారు కానీ క‌మ‌ల్ కు న‌చ్చిన క‌థ ర‌జినీకి న‌చ్చ‌డంతో ఆ ప్రాజెక్టు వేరే డైరెక్ట‌ర్ తో మొద‌లైంది. అయితే శిబి చెప్పిన ఆ కథ అందరికీ వెంటనే కనెక్ట్ కాకపోయినా, కమల్ మాత్రం ఆ క‌థ‌లో ప్రత్యేకతను గుర్తించినట్లు తెలుస్తోంది. కమల్ కెరీర్‌ను పరిశీలిస్తే ఆయనకు ఎప్పుడూ కొత్త ఆలోచనలు, ప్రయోగాత్మక కథలు, సాంప్రదాయ ఫార్ములాలకు భిన్నమైన కథనాలపై ఆసక్తి ఎక్కువ. అందుకే ఒక కథలో కమర్షియల్ అంశాల కంటే కొత్తదనం, పాత్రల లోతు లేదా కథ చెప్పే విధానంలో ప్రత్యేకత కనిపిస్తే దానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో శిబి రెడీ చేసిన కథ కూడా అలాంటి కోవలోనే ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అంతే కాదు, పెద్ద హీరోతో సినిమా చేయలేకపోయినా డైరెక్ట‌ర్ ని పూర్తిగా పక్కన పెట్టకుండా అతనితో కలిసి కథను మరింత మెరుగుపరచే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది కమల్ నిర్మాణ సంస్థ యంగ్ టాలెంట్ పట్ల చూపిస్తున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకే సినిమా ఫలితాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునే బదులు, దర్శకుడి దీర్ఘకాల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇవ్వడ‌మ‌నేది ఇప్పుడు అరుదుగా క‌నిపిస్తున్న అంశం.

ఇటీవలి కాలంలో కోలీవుడ్ లో అనేక మంది కొత్త డైరెక్ట‌ర్లు ఎదిగిన నేపథ్యంలో, వారికి అండగా నిలిచిన ప్రముఖ బ్యానర్ల పాత్ర కూడా కీలకంగా మారింది. ఆ లిస్ట్ లో కమల్ సంస్థ పేరు మరింత బలంగా వినిపిస్తోంది. కొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, యంగ్ డైరెక్ట‌ర్ల‌కు అవ‌కాశాలివ్వ‌డం, వారి కథలను అభివృద్ధి చేసే అవకాశాలు కల్పించడం వంటి అంశాలు చూస్తుంటే, ఇది కేవలం సినిమా నిర్మాణ సంస్థగానే కాకుండా కొత్త టాలెంట్ కు వేదికగా కూడా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News