నైజాం మార్కెట్.. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది?

టాలీవుడ్ బాక్సాఫీస్ కు కీలకంగా భావించే నైజాం మార్కెట్ ఫ్యూచర్ పై ప్రస్తుతం చర్చలు జోరుగా సాగుతున్నాయి.;

Update: 2026-03-14 12:30 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ కు కీలకంగా భావించే నైజాం మార్కెట్ ఫ్యూచర్ పై ప్రస్తుతం చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఒకప్పుడు అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టే ప్రాంతంగా పేరున్న ఆ మార్కెట్‌ లో ఇటీవల ఏర్పడిన పరిణామాలు సినిమా వ్యాపారంపై ప్రభావం చూపించాయి. ముఖ్యంగా టికెట్ ధరల పెంపు అంశం చుట్టూ జరిగిన పరిణామాలు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన కలిగించాయి.

సాధారణంగా భారీ సినిమాల రిలీజ్ సమయంలో టికెట్ ధరలు పెంచుకునేందుకు నిర్మాతలు ప్రభుత్వానికి అనుమతి కోరుతుంటారు. అయితే కొన్నిసార్లు ప్రభుత్వం ఆలస్యంగా అనుమతి ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో అనుమతులపై వివాదాలు తలెత్తడం వల్ల విడుదల సమయంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో టికెట్ ధరల పెంపుపై కోర్టుల్లో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.

అప్పుడు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ధరల పెంపు కోసం చివరి నిమిషంలో చేసే అభ్యర్థనలను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వాలంటే కోర్టు అనుమతి అవసరమని తెలిపింది. దీంతో పెద్ద సినిమాల విడుదల సమయంలో ధరలు పెంచుకునే అవకాశాలు తగ్గిపోతాయని భావించి, నైజాం మార్కెట్ భవిష్యత్‌ పై సందేహాలు వ్యక్తమయ్యాయి.

నైజాం ప్రాంతం టాలీవుడ్‌ కు అత్యంత కీలకమైన మార్కెట్‌ గా గుర్తింపు పొందగా.. భారీ బడ్జెట్ సినిమాల వసూళ్లలో ఆ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఇక్కడ టికెట్ ధరలు పెరగకపోతే సినిమాల మొత్తం కలెక్షన్లపై ప్రభావం పడుతుందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే తాజాగా ఆ వ్యవహారంలో కొత్త పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

ముఖ్యంగా టికెట్ ధరల పెంపు కోసం 90 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధనపై స్టే ఇచ్చింది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత ఊరట లభించినట్లయింది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సినీ పరిశ్రమకు మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తోంది. వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా టాలీవుడ్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని ప్రకటిస్తున్నారు.

దీంతో నైజాం మార్కెట్‌ పై మళ్లీ ఆశలు పెరుగుతున్నాయి. పెద్ద సినిమాల విడుదల సమయంలో సరైన విధానాలు అమలు చేస్తే వసూళ్లు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. టికెట్ ధరల విషయంలో స్పష్టమైన విధానం ఉంటే నిర్మాతలు ముందుగానే ప్రణాళిక రూపొందించుకునే అవకాశం ఉంటుంది. ఏదేమైనా రాబోయే రోజుల్లో నైజాం మార్కెట్‌ లో మళ్లీ జోష్ పెరుగుతుందని, టాలీవుడ్ బాక్సాఫీస్‌ కు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

Tags:    

Similar News