గ్లోబల్ స్టార్.. ఎందుకు కట్ చేశారు?

RRR సృష్టించిన ప్రభంజనం తర్వాత, రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం చరణ్ నటనను మెచ్చుకోవడంతో, అభిమానులు, మీడియా ఆయన్ను 'గ్లోబల్ స్టార్' అని పిలవడం మొదలుపెట్టారు.;

Update: 2025-11-01 17:23 GMT

RRR సృష్టించిన ప్రభంజనం తర్వాత, రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం చరణ్ నటనను మెచ్చుకోవడంతో, అభిమానులు, మీడియా ఆయన్ను 'గ్లోబల్ స్టార్' అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ట్యాగ్ వినడానికి చాలా గొప్పగా, ఒక పెద్ద అచీవ్‌మెంట్‌లా అనిపించినా, ఎక్కడో మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఒక వెలితిగానే ఉండిపోయింది.

'గ్లోబల్ స్టార్' అనేది ఆయన సంపాదించుకున్న ప్రొఫెషనల్ ట్యాగ్. కానీ 'మెగా పవర్ స్టార్' అనేది ఆయన వారసత్వంగా, అభిమానుల ప్రేమతో పొందిన ఎమోషనల్ ట్యాగ్. ఆ బిరుదులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరి బలం, ఆశీస్సులు ఉన్నాయనేది ఫ్యాన్స్ నమ్మకం. అందుకే, ఆ ట్యాగ్ ఫ్యాన్స్‌కు చాలా ప్రత్యేకం.

అయితే, ఈ 'గ్లోబల్ స్టార్' ట్యాగ్ చరణ్‌కు హెల్ప్ అవ్వడం కంటే, ఒక పెద్ద బరువుగా మారిందనే విమర్శలు వచ్చాయి. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి లెజెండ్స్ కూడా ఎప్పుడూ ఇలాంటి బిరుదులు వాడుకోలేదని, ఈ ట్యాగ్ అనవసరమైన ఒత్తిడిని పెంచుతోందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

ఈ విమర్శలకు 'గేమ్ ఛేంజర్' డిజాస్టర్ మరింత బలాన్నిచ్చింది.

'గ్లోబల్ స్టార్' సినిమాకు ఈ రిజల్ట్ ఏంటి అంటూ ట్రోలర్స్ ఈ ట్యాగ్‌నే విమర్శలకు ఆయుధంగా వాడుకున్నారు. ఈ తరహా ఒత్తిడి నచ్చకపోవడంతో, స్వయంగా రామ్ చరణే ఈ ట్యాగ్‌ను వదిలించుకోవాలని అనుకున్నట్లు అప్పట్లో గట్టిగా టాక్ నడిచింది. ఇప్పుడు ఆ టాక్‌ను నిజం చేస్తూ, 'పెద్ది' టీమ్ చాలా తెలివైన నిర్ణయం తీసుకుంది.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లపై, ఎక్కడా 'గ్లోబల్ స్టార్' అని మెన్షన్ చేయకుండా, తిరిగి 'మెగా పవర్ స్టార్' అనే ట్యాగ్‌నే వాడారు. బుచ్చిబాబు, ఆయన టీమ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 'పెద్ది' అనేది ఒక పక్కా పల్లెటూరి, రస్టిక్ యాక్షన్ డ్రామా. ఇలాంటి మట్టి కథకు, గ్లోబల్ అనే ట్యాగ్ కంటే, తమ ఫ్యాన్స్‌కు కనెక్ట్ అయ్యే మెగా పవర్ స్టార్ అనే ట్యాగే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అంటున్నారు. మరి ఈసారి మెగా పవర్ స్టార్ లక్కు ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News