నా జుట్టు ఊడిపోయింది.. కానీ నాగ్ మాత్రం అలానే ఉన్నాడు
ఈ ఈవెంట్ కు రజినీకాంత్ హాజరవక పోయినా తన సందేశాన్ని వీడియో రూపంలో పంపారు.;
రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ. భారీ అంచనాలతో ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించగా, ఈ ఈవెంట్ లో నాగార్జునతో పాటూ సత్యరాజ్, శృతి హాసన్, లోకేష్ కనగరాజ్ పాల్గొన్నారు.
లోకేష్ కోలీవుడ్ రాజమౌళి
ఈ ఈవెంట్ కు రజినీకాంత్ హాజరవక పోయినా తన సందేశాన్ని వీడియో రూపంలో పంపారు. ఈ వీడియోలో రజినీకాంత్ మాట్లాడుతూ, టాలీవుడ్ కు రాజమౌళి ఎలానో, కోలీవుడ్ కు లోకేష్ కనగరాజ్ అలా అని, లోకేష్ చేసిన సినిమాలన్నీ హిట్టేనని, ఈ సినిమాలో ఎంతో మంది స్టార్లు నటీనటులు నటించారని, అదంతా లోకేష్ వల్లే సాధ్యమైందని రజినీ అన్నారు.
నాగ్ విలన్ గా చేస్తున్నారంటే నమ్మలేదు
కూలీలో సైమన్ పాత్రను నాగార్జున చేస్తున్నారని లోకేష్ చెప్పగానే తాను నమ్మలేదని, కొత్తదనం కోసం ట్రై చేస్తూ నాగ్ ఈ సినిమా చేస్తున్నారేమో అని తర్వాత అనుకున్నానని, సైమన్ క్యారెక్టర్ గురించి విన్నప్పుడు ఆ క్యారెక్టర్ ను తానెంతో ఇష్టపడ్డానని, తానే ఆ పాత్ర చేయాలనేంతగా తనకు అది నచ్చిందని చెప్పిన రజినీ, నాగార్జున ఆ క్యారెక్టర్ లో చాలా స్టైలిష్ గా కనిపించడం చూసి ఆశ్చర్యపోయానన్నారు.
ఏమీ మారలేదు
30 ఏళ్ల కిందట తాను నాగార్జునతో కలిసి ఓ సినిమా చేశానని, నాగార్జున అప్పుడెలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడని, ఏం మారలేదని, తనకు మాత్రం తన మీద జుట్టు మొత్తం ఊడిపోయిందని, నాగ్ మాత్రం ఒరిజినల్ జుట్టుతో అప్పుడెలా ఉన్నాడో ఇప్పుడూ అంతే యంగ్ గా కనిపిస్తున్నాడని, దానికి సీక్రెట్ ఏంటని అడిగితే తాను రెగ్యులర్ గా జిమ్ చేస్తూ స్విమ్మింగ్ చేస్తుంటానని, స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతానని, వాటితో పాటూ తన తండ్రి నుంచి వచ్చిన జీన్స్ వల్ల కూడా తాను యంగ్ గా కనిపిస్తుంటానని నాగ్ తనతో చెప్పినట్టు రజినీ వెల్లడించారు.