ఏపీ సీఎంకు సూపర్‌స్టార్ స్పెషల్ థ్యాంక్స్
కోలీవుడ్ సూపర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కేవలం స్క్రీన్ పై నడుచుకుంటూ వెళ్తే చాలు చూద్దామనుకునే తరహా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు.;
కోలీవుడ్ సూపర్ స్టార్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన కేవలం స్క్రీన్ పై నడుచుకుంటూ వెళ్తే చాలు చూద్దామనుకునే తరహా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకు. ఫ్యాన్స్ ముద్దుగా తలైవార్ అని పిలుచుకునే ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 5 దశాబ్దాలు పూర్తైంది. అపూర్వ రాగంగల్ సినిమాతో రజినీ సినీ కెరీర్ మొదలైంది. మొదటి సినిమాతోనే తన మార్క్ ను చూపించి ఎంతోమందిని ఆకట్టుకున్నారు రజినీ.
కేవలం ఇండియాలోనే కాకుండా రజినీకి దేశవిదేశాల్లో కూడా ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. గత 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్న రజినీకాంత్ కు ఈ సందర్భంగా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తూ పోస్టులు చేస్తున్నారు. అందులో భాగంగానే భారత ప్రధాని, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా రజినీకి విష్ చేశారు.
ఈ అభినందనలే నిజమైన గౌరవం
మూవీ ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న రజనీకాంత్ కు హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తూ, ప్రతిష్టాత్మకంగా సాగిన ఆయన సినీ ప్రయాణం కొన్ని కోట్ల మంది ఆడియన్స్ మనసుల్లో చెరగని ముద్ర వేసిందని, ఆయన చేసిన విభిన్న పాత్రలు అందరికీ చేరువయ్యాయని, రానున్న రోజుల్లో కూడా ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ మరిన్ని సక్సెస్‌లు అందుకోవాలని కోరుకుంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా, దానికి రజినీ రిప్లై ఇచ్చారు. తాను ఎంతో గౌరవించే నాయకుడి నుంచి ఈ విషెస్ రావడం తనకు నిజమైన గౌరవమని, మీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలను చెప్తున్నానంటూ రజినీ రాసుకొచ్చారు.
మరిన్ని సాధిస్తా..
సినీ రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజినీకి ఏపీ సీఎం చంద్రబాబు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రజినీ తన సినీ జర్నీలో ఎన్నో కోట్ మందిని తన యాక్టింగ్ తో అలరించడమే కాకుండా, తన సినిమాలతో సామాజిక అవగాహన కల్పించారని, సమాజంలో ఉన్న ముఖ్యమైన సమస్యలపై ఆలోచన చేసేలా ఆయన సినిమాలు చేశారని, సమాజానికి ఆయన చేసిన కృషి నిజంగా గర్వ కారణమని చంద్రబాబు ట్వీట్ చేయగా, దానికి రజినీ స్పందిస్తూ, మీ మాటలు, శుభాకాంక్షలు నా మనసుని తాకాయని, మీ విషెస్ నాకెంతో విలువైనవని, మీలాంటి ప్రేమ కలిగిన ఫ్రెండ్స్ ఎంకరేజ్‌మెంట్‌తో సినీ రంగంలో మరింత మెరుగ్గా రాణించడానికి ప్రయత్నిస్తానని రజినీ అన్నారు.