'ఎస్.సరస్వతి' మూవీ రివ్యూ
తమిళ.. తెలుగు భాషల్లో మంచి నటిగా పేరు స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా - నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం.. ఎస్.సరస్వతి.;
'ఎస్.సరస్వతి' మూవీ రివ్యూ
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్ - ప్రకాష్ రాజ్ - ప్రియమణి - జీవా - కిషోర్ - రావు రమేష్ - రాధిక శరత్ కుమార్ - నాజర్ - సప్తగిరి - మురళి శర్మ - తులసి తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: ఎడ్విన్ సాకే
కథ - మాటలు: సాయిమాధవ్ బుర్రా
నిర్మాతలు: పూజ - వరలక్ష్మి
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: వరలక్ష్మి శరత్ కుమార్
తమిళ.. తెలుగు భాషల్లో మంచి నటిగా పేరు స్పందించిన వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకురాలిగా - నిర్మాతగా మారి రూపొందించిన చిత్రం.. ఎస్.సరస్వతి. ఇందులో ఆమే లీడ్ రోల్ కూడా చేసింది. ఈ రోజే తెలుగు - తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో వరలక్ష్మి ఏ మేర మెప్పించిందో తెలుసుకుందాం పదండి.
కథ: లక్ష్మి ఒక హాస్పిటల్లో నర్స్. ఆమె తన పన్నెండేళ్ళ కూతురు సరస్వతి కనిపించడం లేదంటూ.. తను చదివే స్కూల్లో గొడవకు దిగుతుంది. పోలీసులు రంగప్రవేశం చేస్తారు. కానీ ఆ స్కూల్లో ఆ పాప చదువుతున్నట్లు ఆధారాలు ఏమి దొరకవు. తర్వాత తన పాపను రేప్ చేసి చంపేశారని పోలీసులకు ఆమె పోలీసులకు చెప్తుంది. కానీ అందుకూ సాక్ష్యాలు ఉండవు. లక్ష్మి సమస్యను అర్థం చేసుకుని ఆమెకు న్యాయం చెయ్యడం కోసం.. తన కేసును వాదించడానికి సిద్ధం అవుతాడు రామానుజం (ప్రకాష్ రాజ్) అనే లాయర్. కానీ లక్ష్మి విచిత్ర ప్రవర్తన వల్ల రామానుజం ఇబ్బంది పడి.. ఆ కేసు నుంచి తప్పుకోవాలని అనుకుంటాడు. కానీ ఈ క్రమంలోనే రామానుజం కొన్ని సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఆ విషయాలు ఏంటి.. ఇంతకీ సరస్వతి ఏమైంది.. తనకు ఏం జరిగింది.. ఈ కేసు సంగతి చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ: చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల వార్తలు నిత్య కృత్యం అయిపోయాయి ఈ రోజుల్లో. అలాంటి అంశాల మీద జనాలను కదిలించాలో.. మంచి సందేశం ఇవ్వాలనో ఫిలిం మేకర్స్ ప్రయత్నించడంలో తప్పేమీ లేదు. కానీ కేవలం వార్తల్లో ఏం జరుగుతోందో అదే చూపించి గుండెల్ని మెలిపెట్టేస్తాం అంటే.. ఒక రివెంజ్ డ్రామాను నడిపించేసి నేరము-శిక్ష స్టయిల్లో కథను ముగిస్తాం అంటే థియేటర్లకు వచ్చి ఆ బాధను అనుభవించడానికి.. ఆ పరిష్కారంతో సంతృప్తి పడిపోవడానికి ప్రేక్షకులు సిద్ధంగా లేరన్నది పలుమార్లు రుజువవుతూనే ఉంది.. కొన్నేళ్ల ముందు.సాయిపల్లవి ప్రధాన పాత్రలో ఇలాంటి కథతోనే గార్గి అనే మంచి సినిమా తీసింది చిత్ర బృందం. సాయిపల్లవికి అవార్డులైతే వచ్చాయి కానీ.. ఆ సినిమాతో నిర్మాతలకు ఒనగూరిన ఆర్థిక ప్రయోజనం పెద్ద ఏమీ లేదు. సమాజానికి అవసరమైన విషయాలే అయినా సరే.. విపరీతమైన వేదనకు గురి చేసే ఇలాంటి అంశాల మీద ప్రేక్షకులు సినిమాలు చూడడానికి ప్రేక్షకులు అంతగా ఇష్టపడరన్నది కఠిన వాస్తవం. పైగా ఈ కథల్లో ఏదైనా కొత్తదనం చూపించి.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలైనా ఉంటే ఓకే కానీ.. స్టీరియో టైపులో కథను నడిపిస్తే మరీ కష్టం. ఎస్.వరలక్ష్మి ఆ కోవకు చెందిన చిత్రమే.
దర్శకురాలిగా తొలిసారి సినిమా తీస్తూ.. అమ్మాయిలపై జరిగే అఘాయిత్యాల చుట్టూ తిరిగే కథను ఎంచుకుంది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె ఉద్దేశాలు మంచివే. ఇందులో కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అక్కడక్కడా గుండె తడి అవుతుంది. ఇవన్నీ ఓకే కానీ.. రెండు గంటల పాటు ప్రేక్షకులను వేదనకు గురి చేస్తూ సీరియస్ గా.. చాలా వరకు రొటీన్ గా నడిచే ఈ సినిమాను తట్టుకోవడం ఒకింత కష్టమే అవుతుంది. కథను ఆరంభించిన తీరు కొంచెం బిన్నంగానే ఉన్నా.. కొన్ని సన్నివేశాలు ఆసక్తి రేకెత్తించినా.. వరలక్ష్మి చేసిన లక్ష్మి పాత్ర మీద ప్రేక్షకులకు ఒక అంచనా రాగానే.. కథ మీద కూడా ఒక ఐడియా రాగానే.. అది ఎలా ముందుకు సాగబోతోందో.. ఎలా ముగియబోతోందో తెలిసిపోతుంది. కథలో వచ్చే మలుపు.. మిడిల్ పోర్షన్స్ వరకు ఎస్.వరలక్ష్మి మెప్పిస్తుంది. కానీ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాక్.. ఆపై రివెంజ్ డ్రామా.. ముగింపు.. ఇవన్నీ సాధారణంగా అనిపిస్తాయి. ముందే అన్నట్లు చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల అంశాలను తెర మీద మరీ సుదీర్ఘంగా చర్చిస్తే.. తట్టుకోవడం మెజారిటీ ప్రేక్షకులకు కష్టమే. దాని వల్ల కూడా సినిమా చాలా భారంగా అనిపిస్తుంది.
ఈ కథకు సైకలాజికల్ కోణాన్ని ఆపాదించడం కొంత ఆసక్తి రేకెత్తిస్తుంది. సినిమాలో కొత్తదనం అని చెప్పుకోదగ్గది ఆ పాయింటే. కానీ అందులో మర్మం విడిపోయాక ఎస్.సరస్వతిలో ఏ ప్రత్యేకతా కనిపించదు. రెండు గంటల తక్కువ నిడివే అయినా సరే.. పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుందంటే.. ఆసక్తి రేకెత్తించని కథనమే కారణం. ద్వితీయార్ధం పూర్తిగా ఒక టెంప్లేట్లో సాగిపోవడం.. చెప్పుకోదగ్గ మలుపులేవీ లేకపోవడం.. ఫ్లాష్ బ్యాక్.. కోర్టు రూం డ్రామా.. ఇవన్నీ కూడా సాధారణంగా సాగడంతో ఎస్.సరస్వతి చివరికి ప్రేక్షకులపై ఎలాంటి ప్రత్యేకమైన ముద్రా వేయదు. ఐతే కోర్టు నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో కొన్ని మంచి డైలాగులు మాత్రం పడ్డాయి. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రకాష్ రాజ్ పెర్ఫామెన్స్ కూడా ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేస్తుంది. వరలక్ష్మి అండ్ కో ప్రయత్నం మంచిదే కానీ.. అది ప్రేక్షకులకు రీచ్ అయ్యేంత ఆసక్తికరంగా అయితే లేదు. పింక్ తరహాలో బలంగా.. కొంచెం భిన్నంగా చెబితేనే ఇలాంటి కథల ప్రయోజనం నెరవేరుతుంది. అంతే తప్ప మంచి ఉద్దేశాలు మాత్రమే ఉంటే సరిపోదు.
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్ మంచి పెర్ఫామర్ అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు.దర్శకురాలిగా తన తొలి చిత్రంలో మొత్తం భారాన్ని భుజాల మీద మోసే లీడ్ క్యారెక్టర్ చేసిందామె. కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ పెర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించింది వరలక్ష్మి. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన కన్నీళ్లు తెప్పిస్తుంది. ఐతే నడి వయస్కురాలిగా ఆమె లుక్ అదీ బాగానే కుదిరింది కానీ.. పెళ్లి కాని యువతిగా కనిపించినపుడు మాత్రం తన అప్పీయరెన్స్ అంత బాగా లేదు. వరలక్ష్మి మంచి ఎఫర్టే పెట్టినప్పటికీ.. తన తెలుగు డబ్బింగ్ కూడా అంత బాగా లేదు. చాలా పదాలను తమిళ స్టయిల్లోనే పలికింది. ప్రకాష్ రాజ్.. వరలక్ష్మికి దీటైన పాత్రలో నటించి మెప్పించారు. చాన్నాళ్ల తర్వాత ఆయనకు మంచి పాత్ర పడిందని చెప్పొచ్చు. జీవా క్యామియోలో ఓకే అనిపించాడు. ప్రియమణి.. కిషోర్ ఉన్న కాసేపు ఆకట్టుకున్నారు. జడ్జి పాత్రలో రావు రమేష్ ఓకే. నాజర్.. రాధిక శరత్ కుమార్. మురళీ శర్మ... ఇలా చాలామంది పేరున్న నటులే ఉన్నప్పటికీ.. వారి స్థాయికి తగ్గ పాత్రలు దక్కలేదు.
సాంకేతిక వర్గం: ఎస్.వరలక్ష్మిలో సాంకేతిక నిపుణుల పనితనం ఆకట్టుకుంటుంది. తమన్ సినిమాలో ఉన్న భావోద్వేగాలకు తగ్గట్లు హృద్యమైన బీజీఎం అందించాడు. కొన్ని సీన్లలో స్కోర్ గుండెల్ని మెలిపెడుతుంది. అతను కంపోజ్ చేసిన పాట కూడా బాగుంది. మెడ్విన్ సాకే ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. మిగతా సాంకేతిక నిపుణుల పనితనం కూడా బాగుంది. సినిమాను మంచి క్వాలిటీతో తీశారు. సాయిమాధవ్ బుర్రా ఆలోచనే రేకెత్తించే కథే రాసినా.. అందులో కొత్తదనం లేదు. దర్శకురాలిగా వరలక్ష్మి టేకింగ్ ఓకే కానీ.. ఈ కథను ఎలివేట్ చేసే కథనాన్ని ఆమె జోడించలేకపోయింది. ఆమెకు క్రాఫ్ట్ మీద ఉన్న పట్టు కొన్ని చోట్ల కనిపిస్తుంది కానీ... ద్వితీయార్ధంలో రొటీన్ రివెంజ్ డ్రామాను దాటి ఆమె ఏమీ చేయలేకపోయింది. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలన్న ప్రయత్నం వరకు మెచ్చుకోవచ్చు కానీ.. మెప్పించే సినిమా మాత్రం తీయలేకపోయింది వరలక్ష్మి.
చివరగా: ఎస్.సరస్వతి... బరువు ఎక్కువైంది
రేటింగ్ - 2.25/5