కూలీ.. లోకేష్ తరహా జైలర్?
వారి ఎగ్జైట్‌మెంట్ కు తగ్గట్టుగానే ఇప్పటివరకు కూలీ నుంచి వచ్చిన పోస్టర్లు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి.;
కూలీ. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా. ప్రస్తుతం యావత్ భారతదేశం ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. లోకేష్- రజినీ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. అటు రజినీకాంత్‌కు, ఇటు లోకేష్ కు ఇద్దరికీ మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటి ఇద్దరూ కలిసి సినిమా చేస్తుండటం ఆడియన్స్ ను ఎంతగానో ఎగ్జైట్ చేస్తోంది.
వారి ఎగ్జైట్‌మెంట్ కు తగ్గట్టుగానే ఇప్పటివరకు కూలీ నుంచి వచ్చిన పోస్టర్లు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆగస్ట్ 14న కూలీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే రిలీజ్ కు మరో 20 రోజులు మాత్రమే ఉంది. ఆల్రెడీ బజ్ విపరీతంగా ఉంది. అయినప్పటికీ కూలీ నుంచి ఇప్పటివరకు కనీసం టీజర్ కూడా రాకపోవడం ఆశ్చర్యకరం.
కేవలం పోస్టర్లు, ఒక వీడియో గ్లింప్స్ మరియు పాటలతోనే కూలీని ఇంతలా ఆడియన్స్ లోకి తీసుకెళ్లి, దానికి ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేయడం ఒక్క లోకేష్ కనగరాజ్ కే చెల్లింది. దీంతో ఎప్పుడెప్పుడు కూలీ ట్రైలర్ వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తుండగా కూలీ గురించి కోలీవుడ్ సినీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కూలీ సినిమా కూడా జైలర్ ఫార్మాట్ లోనే ఉండబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
జైలర్ తరహా లైన్ లో లోకేష్ తనదైన స్క్రీన్ ప్లే వాడి తెరకెక్కించారని తెలుస్తోంది. ఒకప్పుడు హార్బర్ ను తన కంట్రోల్ లో ఉంచుకుని గోల్డ్ స్మగ్లింగ్ చేసిన ఓ డాన్ కు రిటైరయ్యాక అతని గతం వెంటాడటం, ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి తన పాత గ్యాంగ్ పరిచయాలను బయటకు తీసుకురావడం, ఈ క్రమంలో జరిగే పరిణామలను లోకేష్ చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో రాసుకున్నారని అంటున్నారు.
జైలర్ లో తన వాళ్లను సేవ్ చేయడానికి ఎలాగైతే తన పరిచయస్తుల హెల్ప్ తీసుకున్నారో ఇప్పుడు కూలీలో కూడా అలానే చేస్తారని, కాకపోతే ట్రీట్‌మెంట్ మాత్రం జైలర్ తరహాలో ఉండదని, ఆ విధానాన్ని లోకేష్ చాలా కొత్తగా చూపించారని టాక్. ఇక క్లైమాక్స్ లో వచ్చే ఆమిర్ ఖాన్ ఎంట్రీ చాలా షాకింగ్ గా ఉంటుందని, విక్రమ్ సినిమాలోని రోలెక్స్ ను మించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. కూలీ సినిమా కోలీవుడ్ లో మొదటి రూ.1000 కోట్ల గ్రాసర్ గా నిలుస్తుందని అందరూ దానిపై చాలానే ఆశలు పెట్టుకున్నారు.