'వార‌ణాసి' రిలీజ్‌లోపు హైద‌రాబాద్‌లో ఐమ్యాక్స్ వ‌స్తుందా?

కొన్నేళ్ల క్రితం ప్ర‌సాద్స్ నుంచి ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌ ను తొల‌గించ‌డ‌మే దీనికి కార‌ణం. అప్ప‌టి నుంచి ఐమ్యాక్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రాలేదు.;

Update: 2025-11-19 05:32 GMT

క‌నీసం ఒక్క‌సారైనా హైద‌రాబాద్ ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ లో సినిమా వీక్ష‌ణ అనుభ‌వం కావాల‌ని వినోద‌ప్రియులు కోరుకునేవారు. ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ ప్ర‌సాద్స్ లోనే అందుబాటులో ఉంద‌నే ప్ర‌చారం ఉండేది. అవ‌తార్ స‌హా చాలా హాలీవుడ్ సినిమాలను ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ లో చూసి సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌య్యారు ప్ర‌జ‌లు. అయితే అవ‌తార్ 2 కానీ, అంత‌కుముందు వ‌చ్చిన‌ చాలా విజువ‌ల్ రిచ్ సినిమాల‌ను ప్ర‌సాద్స్ ఐమ్యాక్స్ లో వీక్షించేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. కొన్నేళ్ల క్రితం ప్ర‌సాద్స్ నుంచి ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌ ను తొల‌గించ‌డ‌మే దీనికి కార‌ణం. అప్ప‌టి నుంచి ఐమ్యాక్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రాలేదు.

స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో దర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి త‌న `వార‌ణాసి` సినిమాని అధునాత‌న సాంకేతిక‌త‌తో రూపొందిస్తున్నామ‌ని, అసాధార‌ణ వీక్ష‌ణ అనుభ‌వం కోసం దీనిని ఐమ్యాక్స్ లేటెస్ట్ వెర్ష‌న్ లో విడుద‌ల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇటీవ‌ల రామోజీ ఫిలింసిటీలో 130 అడుగుల ఐమ్యాక్స్ ఒరిజిన‌ల్ స్క్రీన్ ని ఏర్పాటు చేసి డెమో రీల్ కూడా వేసి చూపించారు. వార‌ణాసి టైటిల్ ని ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ పై లాంచ్ చేయ‌గా అది ప్రేక్ష‌కుల‌ను సంభ్ర‌మాశ్చర్యాల‌కు గురి చేసింది.

ఇదిలా ఉంటే, ఇప్పుడు హైద‌రాబాద్‌ ప్రసాద్స్ లో ఐమ్యాక్స్ స్క్రీన్ అందుబాటులో లేదు క‌దా? అలాంట‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్ష‌కులు ఐమ్యాక్స్ లో వార‌ణాసి సినిమాని చూడ‌టం పాజిబులేనా? అనే సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో కొత్త‌గా నిర్మించిన భారీ మ‌ల్టీప్లెక్సుల్లోను ఐమ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు కోసం ఎవ‌రూ సాహ‌సం చేయ‌లేదు. దీనివ‌ల్ల తెలుగు ప్ర‌జ‌లు ఐమ్యాక్స్ లో వార‌ణాసి సినిమాని చూడ‌ట‌మెలా? అనే ప్ర‌శ్న అలానే ఉంది.

రాజమౌళి అధునాత‌న‌మైన ఐమ్యాక్స్ స్క్రీన్ లో `వార‌ణాసి` సినిమాని ప్ర‌జ‌లు వీక్షించాల‌ని కోరుకున్నారు. మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా స‌హా భారీ తారాగ‌ణం న‌టించిన ఈ సినిమా విజువ‌ల్ ట్రీట్ గా నిలుస్తుంద‌ని అన్నారు. కానీ ఐమ్యాక్స్ కోరిక‌ నెర‌వెరేదెలా? .. వార‌ణాసి చిత్రాన్ని అమెరికా స‌హా విదేశాల‌లోని ఐమ్యాక్స్ స్క్రీన్ల‌లో ఇండియ‌న్ డ‌యాస్పోరా ప్ర‌జ‌లు వీక్షించే సౌల‌భ్యం ఉంది కానీ ఇరు తెలుగు రాష్ట్రాల్లో దీనికి ఆస్కారం లేదు. మెట్రో పాలిట‌న్ సిటీ హైద‌రాబాద్ లో ఛాన్స్ లేదు. కానీ అమ‌రావ‌తి, విశాఖ‌ప‌ట్నం లాంటి చోట్ల ఐమ్యాక్స్ స్క్రీన్ ల ఉనికిని ఊహించ‌లేని ప‌రిస్థితి. కేవ‌లం ముంబై, దిల్లీ, బెంగ‌ళూరు లాంటి చోట్ల ఐమ్యాక్స్ స్క్రీన్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మ‌ల్టీప్లెక్సులు పెరుగుతున్నా కానీ ఐమ్యాక్స్ స్క్రీన్ల ఏర్పాటు కోసం ఎవ‌రూ సాహ‌సించ‌లేదు. అందువ‌ల్ల ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు `వార‌ణాసి` సినిమాని ఒరిజిన‌ల్ ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్ లో వీక్షించే అవ‌కాశం లేదు. అయితే వార‌ణాసి రిలీజ్ కావ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. 2027 వేస‌విలో ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. అంటే ఇంకా ఏడాది పైగానే ఉంది. ఈలోగా ఏదైనా మ‌ల్టీప్లెక్స్ లో ఐమ్యాక్స్ స్క్రీన్ ని ఏర్పాటు చేస్తారా? అన్న‌ది వేచి చూడాలి.

నిజానికి ప్ర‌సాద్స్ నుంచి ఐమ్యాక్స్ స్క్రీన్ ని పున‌రుద్ధ‌రించ‌క‌పోవ‌డానికి కార‌ణం యాజ‌మాన్యం లైసెన్స్ ని పున‌రుద్ధ‌రించ‌క‌పోవ‌డమేన‌ని భావిస్తున్నారు. లైసెన్సింగ్ అనేది అత్యంత ఖ‌రీదైన వ్య‌వ‌హారం. దీనికి ముంద‌స్తు ఒప్పందాలు అవ‌స‌రం. సాంకేతిక‌త అప్ డేష‌న్ తో పాటు ఐమ్యాక్స్ ని ర‌న్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మెయింటెనెన్స్ హెడేక్స్ తో ముడిప‌డిన విష‌యం. అందువ‌ల్ల థియేట‌ర్ యాజ‌మాన్యాలు ఇలాంటిది సాహ‌సించ‌డం లేదు. మ‌రోవైపు చాలా మంది ఐమ్యాక్స్ లో సినిమాని రిలీజ్ చేస్తున్నాం! అని ప్ర‌క‌టిస్తే, అది అస్స‌లు నిజం కాదు. తెలుగు రాష్ట్రాల్లో అస‌లు ఐమ్యాక్స్ స్క్రీన్ అన్న‌దే లేనప్పుడు ఐమ్యాక్స్ లో సినిమా ఎలా చూడ‌గ‌ల‌రు? ఇప్పుడున్న స్క్రీన్ ని కొంత ఎన్ లార్జ్ చేసి దానినే ఐమ్యాక్స్ అని ప్ర‌చారం చేస్తే అది స‌రికాద‌ని `వార‌ణాసి` ఈవెంట్లో రాజ‌మౌళి బ‌హిరంగంగానే చెప్పారు.

Tags:    

Similar News