జక్కన్న కాంపౌండ్ లో డైలాగ్ రైటర్!
సృజనాత్మకతకు పెద్ద పీఠ వేస్తూ ప్రతీ సినిమాకు కొత్త ఆలోచనలను ఆహ్వానించే దర్శకధీరుడు రాజమౌళి కాంపౌండ్‌లో ప్రతిభే ప్రామాణికంగా పనిచేస్తుంది.
సృజనాత్మకతకు పెద్ద పీఠ వేస్తూ ప్రతీ సినిమాకు కొత్త ఆలోచనలను ఆహ్వానించే దర్శకధీరుడు రాజమౌళి కాంపౌండ్‌లో ప్రతిభే ప్రామాణికంగా పనిచేస్తుంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి వరకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జక్కన్న సినిమాల్లో డైలాగ్ రైటర్ల ఎంపిక ప్రక్రియ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. సాధారణంగా స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల కోసం ఒకే రైటర్‌తో ప్రయాణించడానికి ఇష్టపడతారు. కానీ రాజమౌళి మాత్రం ప్రతి ప్రాజెక్ట్‌కు తగ్గట్టుగా సరికొత్త రచయితలను ఎంచుకుని ఆశ్చర్యపరుస్తుంటారు.
ఈ ట్రెండ్ వెనుక రాజమౌళి అనుసరించే పక్కా వ్యూహం ఉంటుంది. ఆయన ప్రతి సినిమా కథాంశం, దాని మూల వేర్లు, భావోద్వేగాల తీవ్రత పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అందుకే ఆయా కథల నేపథ్యానికి తగినట్లుగా పదాలను కూర్చగల దిట్టలైన రచయితల కోసం అన్వేషిస్తారు. కేవలం మాస్ అప్పీల్ డైలాగ్స్ రాయడమే కాకుండా సన్నివేశాల్లోని లోతును, పాత్రల మనస్తత్వాన్ని అక్షర రూపంలోకి బలంగా తీసుకొచ్చే రచయితలనే రాజమౌళి సినిమాల కోసం ఎంపిక చేసుకుంటారు.
ఈ విలక్షణ పద్ధతికి ఆయన గత చిత్రాల ప్రయాణమే నిదర్శనం. సంచలన చిత్రం `బాహుబలి: ది బిగినింగ్` మొదటి భాగానికి తెలుగులో సి.హెచ్. విజయ్ కుమార్ మాటలు అందించగా, తమిళ వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత మదన్ కార్కి పనిచేశారు. అయితే `బాహుబలి రెండో భాగం ది కన్ క్లూజన్` సమయానికి వచ్చేసరికి సంభాషణల బాధ్యతను పూర్తిగా విజయ్ కుమార్ ఒక్కరికే అప్పగించారు. ఇలా సినిమా అవసరాలను బట్టి రచయితల బృందాన్ని ఎప్పటికప్పుడు మార్చడం జక్కన్న శైలి.
ఇక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `ఆర్ఆర్ఆర్` విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రల మధ్య వచ్చే శక్తివంతమైన సంభాషణలను తెలుగులో సాయి మాధవ్ బుర్రా రాశారు. ఆ చిత్రంలో జాతీయ భావాలు, స్వాతంత్ర్య పోరాట తపనను ప్రతిబింబించేలా బుర్రా రాసిన డైలాగులు సినిమా స్థాయిని మరింత పెంచాయి. ప్రతి పాత్రకు సరిగ్గా సరిపోయే పదబంధాలను వెతికి పట్టుకోవడంలో రాజమౌళి విజన్‌కు సాయి మాధవ్ కలం చక్కగా సరిపోయింది.
ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ `వారణాసి` (మహేష్ సినిమా) సెట్స్‌పై ఉంది. ఈ సినిమా కోసం రాజమౌళి మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మాటల రచయితగా ప్రముఖ దర్శక, రచయిత దేవ కట్టా ఒంటరిగానే వ్యవహరిస్తున్నారు. విలక్షణమైన ఆలోచనలు, లోతైన సామాజిక-దార్శనిక భావాలున్న దేవా కట్టా కలం నుంచి జాలువారే మాటలు అడ్వెంచర్ డ్రామాకు ఏ స్థాయిలో ప్రాణం పోస్తాయన్నది0 సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇలా రాజమౌళి ప్రతీ చిత్రానికి రచయితలను మార్చడం వల్ల ప్రతీ సినిమాకు సరికొత్త భాషా సౌందర్యం, ప్రత్యేకమైన సంభాషణల శైలి అందుతున్నాయి. ఒకే రచయితపై ఆధారపడకుండా కథ డిమాండ్ చేసిన మేధావిని వెతికి పట్టుకోవడం వల్లనే ఆయన చిత్రాలు భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే మాస్టర్‌పీస్‌లుగా మారుతున్నాయి. `వారణాసి`తో దేవా కట్టా కలం ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.