'రాముడు నచ్చడు'.. రాజమౌళి ట్వీట్ వైరల్
ఆ వివాదం చల్లారకముందే, నెటిజన్లు ఇప్పుడు జక్కన్న పాత ట్వీట్లను బయటకు తీసి, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు.;
'వారణాసి' (SSMB29) ఈవెంట్‌లో టెక్నికల్ గ్లిట్చ్ రావడంతో, రాజమౌళి దేవుడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. "నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదు", "ఇదేనా హనుమంతుడు నడిపించేది?" అంటూ ఆయన చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఆ వివాదం చల్లారకముందే, నెటిజన్లు ఇప్పుడు జక్కన్న పాత ట్వీట్లను బయటకు తీసి, ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు.
ఏకంగా 2011 నాటి ఒక ట్వీట్‌ను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. 2011 ఏప్రిల్ 12న ఒక యూజర్ రాజమౌళికి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పగా, జక్కన్న దానికి షాకింగ్ రిప్లై ఇచ్చారు. "థాంక్స్. కానీ నాకు రాముడు ఎప్పుడూ నచ్చలేదు. అవతారాలన్నింటిలో నా ఫేవరెట్ శ్రీకృష్ణుడు" అని ఆయన ట్వీట్ చేశారు. 14 ఏళ్ల క్రితం నాటి ఈ ట్వీట్, ఇప్పుడున్న పరిస్థితులకు ఆజ్యం పోసినట్లయింది.
ఈ పాత ట్వీట్‌ను, 'వారణాసి' ఈవెంట్ కామెంట్స్‌ను జత చేస్తూ నెటిజన్లు రాజమౌళిని టార్గెట్ చేస్తున్నారు. "అప్పుడు రాముడు నచ్చడు అన్నాడు, ఇప్పుడు ఆ రాముడి భక్తుడైన హనుమంతుడిని నిందించాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. 'వారణాసి' లాంటి స్పిరిచువల్ టైటిల్ పెట్టి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
"దేవుడిని నమ్మకపోవడం ఆయన వ్యక్తిగతం. కానీ, టెక్నికల్ ఫెయిల్యూర్స్‌కు హనుమంతుడిని నిందించడం ఏమిటి?", "ఒకవైపు 'RRR'లో రామ్ చరణ్ పాత్రను రాముడి తరహాలో అంత పవర్‌ఫుల్‌గా చూపించారు, కానీ అంతకుముందు రాముడు నచ్చడని చెప్పడం ఏంటి?" అంటూ నెటిజన్లు జక్కన్నను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ పాత ట్వీట్ ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.
సింహాద్రి, యమదొంగ, మగధీర, బాహుబలి, RRR ఇలా తన సినిమాల్లో దేవుళ్ళకు సంబంధించిన అంశాలను బలంగానే చూపిస్తూ వచ్చిన రాజమౌళి ఇప్పుడు 1000 కోట్ల ప్రాజెక్టులో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో ఒక రామాయణ ఘట్టాన్ని హైలెట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంత పెద్ద స్టేజ్ పై అలా తేలికగా మాట్లాడడం కరెక్ట్ కాదని, సినిమాల కోసం దేవుడిని హైలెట్ చేస్తూ వ్యక్తిగతంగా ఇలా మాట్లాడడంపై రాజమౌళి మరోసారి ఆలోచించుకోవాలని అంటున్నారు. దీనిపై రాజమౌళి వీలైనంత త్వరగా వివరణ ఇస్తే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి.