రాజమౌళి 'శాపం'.. ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు, మరి మహేష్ పరిస్థితి ఏంటి?
రాజమౌళితో సినిమా చేస్తే రికార్డుల మోత మోగుతుంది. అందుకే ప్రతీ హీరో కూడా ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు.;
రాజమౌళితో సినిమా చేస్తే రికార్డుల మోత మోగుతుంది. అందుకే ప్రతీ హీరో కూడా ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. అయితే జక్కన్నతో సినిమా చేస్తే.. ఆ వెంటనే హీరో నుంచి వచ్చే సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుందనే ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఇండస్ట్రీలో బలంగా ఉంది. దీన్నే కొందరు రాజమౌళి శాపం అని పిలుచుకుంటారు. అయితే, ఈ శాపంలో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి సినిమా ఫలితానికి సంబంధించింది కాగా, రెండోది హీరోల ఆరోగ్యానికి సంబంధించింది. ఇప్పుడు అందరి దృష్టీ ఆ రెండో దానిపైనే పడింది.
మొన్నటి వరకు రాజమౌళి హీరోలకు తర్వాతి సినిమా ప్లాప్ అనే సెంటిమెంట్ ను ఎన్టీఆర్ 'దేవర'తో బద్దలు కొట్టేశాడు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి ఆ భయాన్ని పోగొట్టాడు. దీంతో మొదటి శాపం తొలగిపోయింది. కానీ ఇప్పుడు మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్ అది కాదు. జక్కన్న హీరోలకు ఉండే "ఫిజికల్ కర్జ్" ను మహేష్ ఎలా దాటుతాడన్నదే ఇప్పుడు అసలు చర్చ.
రాజమౌళి సినిమా అంటే ఏళ్ల తరబడి షూటింగ్ ఉంటుంది. ఆ సమయంలో హీరోల శరీరంపై పడే ఒత్తిడి మామూలుగా ఉండదు. 'బాహుబలి' కోసం ప్రభాస్ తన బాడీని విపరీతంగా మార్చుకుని, ఆ తర్వాత మోకాలి నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఎన్నాళ్లు ఇబ్బంది పడ్డాడో అందరికీ తెలిసిందే. అలాగే 'ఆర్ఆర్ఆర్' సమయంలో ఎన్టీఆర్, చరణ్ కూడా గాయాల పాలయ్యారు. జక్కన్న పర్ఫెక్షన్ కోసం హీరోలను శారీరకంగా పిండేస్తాడన్నది బహిరంగ రహస్యమే.
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసి' (SSMB29) కోసం జక్కన్న ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. మహేష్ తన కెరీర్ లో ఇప్పటివరకు ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా, స్మార్ట్ గా ఉన్నారు. కానీ రాజమౌళి సినిమా అంటే సాహసాలు చేయాల్సిందే. అడవులు, కొండలు, గుహలు అంటూ గ్లోబల్ అడ్వెంచర్ ప్లాన్ చేశారు కాబట్టి, ఇది మహేష్ శారీరక శ్రమకు నిజమైన అగ్నిపరీక్ష కానుంది.
అయితే ఇక్కడ మహేష్ కు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉంది. ప్రభాస్, రానాలాగ ఇందులో మహేష్ భారీగా బరువు పెరిగి, బాడీని మార్చుకోవాల్సిన అవసరం లేదని టాక్. కేవలం అథ్లెటిక్ గా, స్టైలిష్ గా కనిపిస్తాడని అంటున్నారు. దీనివల్ల శరీరంపై అదనపు భారం తగ్గుతుంది. కానీ దాదాపు రెండు, మూడేళ్ల పాటు, కఠినమైన షెడ్యూల్స్ లో, భారీ యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొనడం అంటే ఆషామాషీ విషయం కాదు. ఆ 'లాంగ్ రన్' ఒత్తిడిని తట్టుకోవడమే అసలైన టాస్క్.
ఎన్టీఆర్ 'ఫ్లాప్ సెంటిమెంట్' ను బ్రేక్ చేసినట్లుగానే, మహేష్ బాబు ఈ 'ఫిజికల్ స్ట్రెస్' ను కూడా జయించి ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాజమౌళి విజన్, మహేష్ డెడికేషన్ కలిస్తే వచ్చే అవుట్ పుట్ అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ ప్రయాణంలో మహేష్ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని అభిమానుల ఆందోళన. మరి జక్కన్న ఫైనల్ అవుట్ పుట్ వచ్చే సమయానికి ఏం జరుగుతుందో చూడాలి.