పర్సంటేజీల సమస్య.. వీరమల్లుకు ఏం సంబంధం?: ఆర్.నారాయణమూర్తి
టాలీవుడ్ లో కొద్దిరోజులుగా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటిపై నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి స్పందించారు.;
టాలీవుడ్ లో కొద్దిరోజులుగా ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటిపై నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి స్పందించారు. పర్సంటేజీల విషయం ఒక కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లు మూవీకి లింక్ పెట్టడం సరికాదని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేస్తారని ఆయన ప్రశ్నించారు.
"పర్సంటేజీల సమస్య ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. అది ఖరారు అయితే ఎంతో మేలు జరుగుతుంది. అప్పట్లో ఛాంబర్ ముందు ఆందోళనలు చేశాం. కానీ పరిష్కారం లభించలేదు. ఆ తర్వాత ఇండస్ట్రీ పెద్దలను కలిశాం. కానీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఎంతో మందికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాం" అని తెలిపారు.
"ఇప్పుడు పర్సంటేజీ విషయం కొలిక్కి వచ్చే దశలో హరిహర వీరమల్లు మూవీకి లింక్ పెట్టడం సరికాదు. అసలు సమస్యకు మూవీకి ఏం సంబంధం ఉంది? సమస్యను పక్కదోవ పట్టించారు. పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి అలాంటి ప్రకటన రావడం సమంజసంగా లేదు. చర్చలకు పిలిస్తే పవన్ పై గౌరవం మరింత పెరిగేది" అని అన్నారు.
"పరిశ్రమ పెద్దలను సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలవాలని చెప్పడంలో తప్పులేదు. కానీ అసలు సమస్యను పక్కదారి పట్టించవద్దు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది పూర్తిగా అబద్ధం. పర్సంటేజ్ ఫిక్స్ అయితే అందరికీ మేలు. నా లాంటి నిర్మాతలకు కూడా మేలే" అని తెలిపారు.
"కార్పొరేట్ పద్ధతులకు వంత పాడితే సింగిల్ స్క్రీన్లు ఏమవ్వాలి? ఆలయాల్లాంటి థియేటర్స్ ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్ హాళ్లు గా మారుతున్నాయి. కాబట్టి పర్సంటేజీని బతికించి నా లాంటి నిర్మాతలను కాపాడాలి" అని కోరారు. ఆ తర్వాత సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంపై మాట్లాడారు. వినోదం ఖరీదుగా మారిందని అన్నారు.
"రేట్ల పెంపు విషయంలో ప్రేక్షకులకు, ఇండస్ట్రీకి ఎక్కువ నష్టం వస్తుంది. పెద్ద బడ్జెట్ తో సినిమాలు తీయండి. కానీ దాన్ని ప్రజలపై రుద్దితే నష్టమే. హాలీవుడ్ లో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారని, కానీ ధరలు పెంచడం లేదు. ఏదేమైనా సినిమా బాగుంటే ఆడియన్స్ కచ్చితంగా వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడని పరిస్థితులు వచ్చాయి" అని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు.