'ధురంధ‌ర్‌' టీమ్‌కు షాక్‌..శాశ్వ‌తంగా బ్లాక్ లిస్ట్‌లోకి!

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ భీభ‌త్సాన్ని సృష్టించ‌డంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో మేక‌ర్ష్ ఈ మూవీ షూటింగ్‌ని ప‌రుగులు పెట్టిస్తోంది.;

Update: 2026-02-17 06:38 GMT

ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించి స్పై థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ డ్రామా 'ధురంధ‌ర్‌'. ర‌ణ్‌వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ మూవీని ద డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ ఆదిత్య‌ధ‌ర్ అత్యంత భారీ స్థాయితో తెర‌కెక్కించాడు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో విడుద‌లై సంచ‌లన విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ చ‌ర్చ‌కు తెర‌లేపింది. సీమాంత‌ర తీవ్ర‌వాదాన్ని ఉసిగొల్పుతూ భార‌త్‌పై పాక్ ప‌న్నుతున్న కుట్ర‌ల‌ని, దాని కుయుక్తుల్ని రా అండ్ ర‌స్టిక్ కంటెంట్‌తో ప్ర‌పంచానికి చాటిన మూవీ 'ధురంధ‌ర్‌'.

'ధురంధ‌ర్‌' సంచ‌ల‌న విజ‌యం సాధించి ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మార‌డంతో దీనికి సీక్వెల్‌గా రానున్న 'ధురంధ‌ర్ 2: ది రివేంజ్‌'పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ మూవీని మార్చి 19న అత్యంత భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైల‌ర్ భీభ‌త్సాన్ని సృష్టించ‌డంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో మేక‌ర్ష్ ఈ మూవీ షూటింగ్‌ని ప‌రుగులు పెట్టిస్తోంది.

ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది. ఈ మూవీ యూనిట్‌పై ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమా మేక‌ర్స్‌ల‌లో ఒక‌రైన B62 స్టూడియోస్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల‌ని కార్పొరేష‌న్ అధికారులు నిర్ణ‌యించుకోవ‌డం బాలీవుడ్‌లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అనుమ‌తులు లేకుండా చారిత్ర‌క క‌ట్ట‌డాల్లో షూటింగ్ చేస్తూ నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌ని స‌ద‌రు కార్పొరేష‌న్ అధికారులు చిత్ర బృందంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర్మాణ సంస్థ‌ని బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చారు. అలా చేయ‌డం వ‌ల్ల ఇక‌పై స‌ద‌రు నిర్మాణ సంస్థ ముంబై న‌గ‌రంలో ఎలాంటి షూటింగ్‌లు చేయ‌లేదు. స‌ద‌రు సంస్థ‌కు అనుమ‌తులు కూడా ల‌భించ‌వు.

ద‌క్షిణ ముంబైలోని చారిత్రాత్మ‌క‌మైన ఫోర్ట్ ప్రాంతంలో గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అయితే పురాత‌న క‌ట్ట‌డాలు, అక్క‌డి వ‌చ్చే టూరిస్ట్‌లు, జ‌నాల‌ని దృష్టిలో పెట్టుకుని అక్క‌డ నిప్పు, ట‌పాసులు పేల్చ‌డాన్ని నిషేధించారు. కానీ చిత్ర బృందం మాత్రం ఈ నిబంధ‌న‌లు పాటించ‌కుండా అక్క‌డ మంటులు రాజేసి య‌ధేశ్చ‌గా షూటింగ్ చేసింద‌ట‌. కొన్ని రోజుల క్రితం నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా షూటింట్ చేస్తున్నార‌ని ముంబై కార్పొరేష‌న్ అధికారులు గ‌మ‌నించి జ‌రిమానా విధించినా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ అర్ద్ర‌రాత్రి మ‌ళ్లీ కాగ‌డాలు వెలిగించి షూటింగ్ చేస్తూ టీమ్ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది.

'ధురంధ‌ర్ 2' టీమ్ వ‌రుస ఉల్ల‌ఘ‌న‌ల‌కు పాల్ప‌డుతుండ‌టంతో తీవ్ర హాగ్ర‌హానికి లోనైన ముంబై కార్పొరేష‌న్ అధికారులు B62 స్టూడియోస్‌ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల‌ని నిర్ణ‌యించారు. అంతే కాకుండా ముంబై లాంటి మ‌హాన‌గ‌రాల్లో షూటింగ్‌ల పేరుతో ఎంత‌టి పెద్ద నిర్మాణ సంస్థ అయినా స‌రే నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే ప‌రిణామాలు క‌ఠ‌నంగా ఉంటాయని ఈ సంద‌ర్భంగా అధికారులు స్ప‌ష్టం చేశారు. ఈ నేఫ‌థ్యంలో షూటింగ్‌కు అంత‌రాయం ఏర్ప‌డ‌టంతో `ధురంధ‌ర్ 2` రిలీజ్ వాయిదా ప‌డే అవ‌కాశం ఉంద‌ని ముంబై వ‌ర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి.

Tags:    

Similar News