బన్నీని కలవాలంటే 42 రూల్స్.. క్షమాపణలు చెప్పిన కావేరి!
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ తమ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలతో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు.;
ఈమధ్య కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లు యెన్సర్ తమ ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలతో ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సామాన్య విషయాలతో పాపులారిటీ దక్కించుకోవడం సాధ్యం కాదని భావించిన ఒక బ్రాండ్ స్ట్రాటజర్ ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి దాంతో బ్రాండ్ స్ట్రాటజర్ కావేరి బారువా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.
బన్నీని కలవాలంటే 42 రూల్స్..
అసలు విషయంలోకి వెళ్తే.. బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. "బన్నీతో షూటింగ్ చేయడం గురించి ఆసక్తికర కామెంట్లు చేసింది. ఆయనతో యాడ్ షూట్ చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా" ఏం చేయాలి.. ఏం చేయకూడదు" అని 42 నిబంధనలు ఉంటాయి. ఆ విషయంలో మేనేజర్లు కూడా చాలా కఠినంగా ఉంటారు. ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడకూడదు. ముఖ్యంగా ఆయనతో కరచాలనం చేయకూడదు.. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి" అంటూ అల్లు అర్జున్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది కావేరి.
కఠిన చర్యలు తప్పవన్న బన్నీ టీమ్..
అందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ టీం స్పందించింది."ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న ఒక వీడియోలో చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యం.. ఆధారాలు లేని ఇలాంటి తప్పుడు కథనాల ప్రచారాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అంటూ అల్లు అర్జున్ టీం ఒక నోట్ విడుదల చేసింది.
దిగివచ్చిన కావేరి.. బన్నీకి క్షమాపణలు..
అయితే దీనిపై స్పందించిన కావేరి బారువా ఒక సుదీర్ఘ నోట్ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకుంది. "గత కొన్ని రోజులుగా నా ఇటీవల పాడ్ కాస్ట్ వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా నటుడు అల్లు అర్జున్ తో యాడ్ షూట్ చేయాలి అంటే 42 కఠిన నిబంధనల గురించి నేను ప్రకటన చేశాను. అయితే ఆ వీడియో క్లిప్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నేను చేసిన కామెంట్లు పూర్తిగా అవాస్తవాలు. స్పష్టంగా చెప్పాలి అంటే 42 కఠిన నిర్ణయాలతో ఉన్న ఒక పత్రాన్ని అల్లు అర్జున్ లేదా ఆయన తరఫున పని చేసే ఎవరూ కూడా నాకు జారీ చేయలేదు. నేను మాట్లాడుతున్న సమయంలో ఆ మాటలు వదలడం పూర్తిగా నా తప్పే. ఇలాంటి ప్రకటనలు చేసినందుకు వాటి వల్ల ఏదైనా అపార్థం జరిగినా.. లేదా మీ ప్రతిష్టకు హాని కలిగి ఉంటే నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను. నావల్ల ఆయన గౌరవానికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను" అంటూ కావేరీ బారువా ఒక నోట్ విడుదల చేసింది.
ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ పై తప్పుడు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన కావేరి నేడు దిగివచ్చి తాను చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అంటూ క్షమాపణలు చెప్పింది.. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.