వారణాసిలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అదే.. జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేశాడుగా
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా వారణాసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.;
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పౌరాణిక యాక్షన్ డ్రామా వారణాసి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో భాగంగా ప్రకాష్ రాజ్, వారణాసిలో తన క్యారెక్టర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
రజత్ కపూర్ ప్లేస్ లో ప్రకాష్ రాజ్
వారణాసి సినిమాలో ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేస్తున్న క్యారెక్టర్ కోసం మొదట్లో బాలీవుడ్ యాక్టర్ రజత్ కపూర్ ఎంపికైనప్పటికీ, తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఆయన వారణాసి ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. తర్వాత ఆ పాత్రకు ప్రకాశ్ రాజ్‌ను తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ ఇప్పటికే వారణాసికి సంబంధించిన పలు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ ఓ ఈవెంట్ లో భాగంగా తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు.
మహా శివభక్తుడిగా ప్రకాష్ రాజ్
తాను వారణాసి సినిమాలో పని చేస్తున్నానని, ఈ మూవీలో తాను మహా శివ భక్తుడిగా కనిపిస్తానని చెప్పి సినిమాపై ఉన్న ఆసక్తిని మరింత పెంచారు. సినీ వర్గాల సమాచారం ప్రకారం, వారణాసిలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కీలక మలుపుకు కారణమవుతుందని తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం ప్రకాష్ రాజ్ ఈ మూవీలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో కనిపించనున్నారని అంటున్నారు, కానీ దీనిపై ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే వెల్లడి కాలేదు.
ఏప్రిల్7, 2027న వారణాసి రిలీజ్
రాజమౌళి సినిమాల్లో క్యారెక్టర్లు, వాటి బలం, ఎమోషన్స్ కు ఉండే ప్రాధాన్యత తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా హీరో జర్నీలో ఆధ్యాత్మిక, భావోద్వేగపరమైన ప్రభావాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే వారణాసి షూటింగ్ సగానికి పైగా పూర్తైందని జక్కన్న వెల్లడించిన విషయం తెలిసిందే. ఆగస్టు నాటికి మొత్తం షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్ గా పెట్టుకుంది. 2027, ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేయగా, ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీ..
ఇక ప్రకాష్ రాజ్ విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ఓ వైపు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తూనే మరోవైపు దృశ్యం3, వారణాసి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే వారణాసి లో అతని క్యారెక్టర్ ను జక్కన్న చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనిపిస్తోంది. వారణాసి తర్వాత ప్రకాష్ రాజ్ కు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కడం ఖాయంగానే అనిపిస్తోంది.