మొన్నటివరకు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో.
పూరీ-సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.;
టాలీవుడ్ లో డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు ఏ రేంజ్ లో క్రేజ్, ఫాలోయింగ్ ఉందో ఆయనక్కూడా అంతే క్రేజ్ ఉంది. కానీ గత కొన్ని సినిమాలుగా పూరీ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నారు. పూరీ ఆఖరిగా హిట్ అందుకుంది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేశారు పూరీ. కానీ అది డిజాస్టర్ అయింది.
ఆ తర్వాత ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని తనకు ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ను అందించిన రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ చేశారు. కానీ డబుల్ ఇస్మార్ట్ మూవీ లైగర్ కంటే దారుణంగా ఫ్లాపైంది. దీంతో పూరీ ఖాతాలో మరో డిజాస్టర్ పడింది. పూరీకి వరుస ఫ్లాపులు ఎదురవడంతో తర్వాతి సినిమా ఛాన్స్ ఎవరిస్తారా అని అంతా అనుకున్నారు.
అందరికీ షాకిచ్చిన పూరీ
ఫ్లాపుల్లో ఉన్న పూరీ, తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతికి ఓ కథ చెప్పి ఆయన్ని మెప్పించి సినిమాకు ఒప్పించి మూవీని అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు. విజయ్ సేతుపతితో సినిమాను చేయడమే కాకుండా ఆ సినిమా కోసం టబు, దునియా విజయ్ లాంటి పెద్ద పెద్ద నటుల్ని కూడా ఈ సినిమాలో భాగం చేస్తున్నారు పూరీ. సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
రూట్ మార్చిన పూరీ
పూరీ-సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. మహతి సాగర్, మణిశర్మ కొడుకుగా పూరీకి చాలా కాలం నుంచే తెలుసు. కానీ ఎప్పుడూ వీరిద్దరూ కలిసి పని చేసింది లేదు.
మొన్నటివరకు మణిశర్మతో పని చేసిన పూరీ జగన్నాథ్ ఇప్పుడు రూట్ మార్చి అతని కొడుకు మహతి స్వర సాగర్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. మహతి సాగర్ మ్యూజిక్ తో ఈ సినిమాకు ఫ్రెష్‌నెస్ ను తీసుకురావాలని పూరీ చూస్తున్నారట. బెగ్గర్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, జెబి మోషన్స్ పిక్చర్స్ బ్యానర్లలో చార్మీ కౌర్, పూరీ జగన్నాథ్, జెబి నారాయణ్ రావు నిర్మిస్తున్నారు.