ఈ న‌టుడి 1000 ఎక‌రాలు 124 ఇళ్లు బినామీల పాలు

విధి ఆడే వింత నాట‌కంలో ఎవ‌రైనా పావుగా మారాల్సిందే. విధిని త‌ప్పించుకోవ‌డం సులువు కాదు.;

Update: 2025-11-23 14:30 GMT

విధి ఆడే వింత నాట‌కంలో ఎవ‌రైనా పావుగా మారాల్సిందే. విధిని త‌ప్పించుకోవ‌డం సులువు కాదు. గొప్ప గొప్ప సంస్థానాలు, ఆస్తులు, అంత‌స్తులు ఉన్న‌వారే దివాళా అంచుల‌కు జారిపోయారు. ప్ర‌పంచ కుభేరుల‌లో ఒక‌డిగా ఉన్న అనీల్ అంబానీ ప‌రిస్థితి దీనికి ఒక ఉదాహ‌ర‌ణ‌. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అయితే త‌మిళ సినీప‌రిశ్ర‌మ‌లో దిగ్గజ నటుడు పి.యు. చిన్నప్ప కుటుంబం పరిస్థితి కోలీవుడ్ లో ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే.

త‌మిళ చిత్ర‌సీమ ఆరంభ ద‌శ‌లో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి, దిగ్గ‌జ న‌టుడు చిన్న‌ప్ప చాలా ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టారు. పుదుక్కోట్టైలో 1000 ఎకరాల భూమి .. 124 ఇళ్లు ఆయ‌న సొంతం. కానీ నేడు అతడి కుటుంబం తమది అని చెప్పుకోవడానికి ఎటువంటి ఆస్తిని కలిగి లేదు. మొత్తం ఆస్తుల‌న్నీ ఇత‌రుల‌ ప‌రం అయ్యాయి. ఉలగ నాథపిళ్లై - మీనాక్షి అమ్మాళ్ దంపతులకు జన్మించిన పుదుక్కోట్టై ఉలగనాథన్ చిన్నప్ప, తన తండ్రి రంగస్థల జీవితం నుండి ప్రేరణ పొంది ఐదేళ్ల‌ వయస్సులో నాటక ప్రపంచంలోకి ప్రవేశించాడు. సతారం నాటకంలో అతని ప్రారంభ ప్రదర్శన అత‌డికి గుర్తింపును తెచ్చిపెట్టింది. త‌ర్వాత‌ సిలంబం, కుస్తీలో ప్రావీణ్యం సంపాదించాడు. బ‌లాడ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

12 సంవత్సరాల వయసులో అత‌డు మధురై ఒరిజినల్ బాయ్స్ కంపెనీలో రూ. 15 జీతంతో ఉద్యోగంలో చేరాడు. కంపెనీ యజమాని సచ్చిదానంద పిళ్లై ఒక నాటకంలో పాడుతున్న‌ప్పుడు అది విని అతడి అసాధారణ ప్రతిభను గుర్తించి వెంటనే తన జీతాన్ని రూ. 75 కి పెంచాడు. చిన్నప్ప వేగంగానే ఎద‌గ‌డం ప్రారంభించాడు. అత‌డు సినిమా రంగానికి మారే ముందు రంగస్థల నాటకంలో గొప్ప ప్ర‌తిభావంతుడిగా ఎదిగాడు. రంగ‌స్థ‌ల డ్రామా చంద్ర‌కాంత‌ను సినిమాగా తెర‌కెక్కించిన‌ప్పుడు అందులో చిన్న‌ప్ప సుంద‌ర్ ప్రిన్స్ అనే పాత్ర‌లో క‌నిపించాడు. కోలీవుడ్ లో ఇది తొలి అడుగు. పాడటం, నటించడం, స్టంట్‌లు చేయడంలో ప్ర‌తిభ‌ కారణంగా `సగల కళా కథానాయకన్` అనే బిరుదును సంపాదించాడు. ఉత్తమపుత్తిరన్, కన్నగి, జగతలప్ ప్రతాపన్ వంటి చిత్రాలు అతడి స్టార్‌డమ్‌ను బలోపేతం చేశాయి. ఎం.కె. త్యాగరాజ భాగవతార్‌తో పాటు పరిశ్రమ తొలి సూపర్‌స్టార్ లలో ఒక‌డిగా ఎదిగాడు. తరువాత భారతీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక గొప్ప వ్యక్తిగా మారిన ఎంజిఆర్, చిన్నప్పను తన గురువుగా భావించాడు.

చిన్నప్ప కెరీర్ జోరులో ఉన్న‌ప్పుడు తన స్వస్థలంలో రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెట్టాడు. అత‌డు కూడా టాలీవుడ్ స్టార్ శోభ‌న్ బాబులాగా చాలా ఆస్తిని కొనుగోలు చేశాడని, పుదుక్కోట్టై రాజు తో పోటీప‌డి ఆస్తులు ఘ‌డించాడ‌ని టాక్ వ‌చ్చింది. సహనటి ఎ. శకుంతలతో వివాహం చిన్న‌ప్ప‌ వ్యక్తిగత జీవితంలో ఒక కీల‌క‌ ఘట్టం, కానీ ఆ స‌మ‌యంలో అకస్మాత్తుగా రక్తం వాంతి చేసుకోవడంతో అతడి ప్ర‌యాణం స‌డెన్ గా 35ఏళ్ల‌కే ముగిసింది. చిన్నప్ప మరణం తరువాత, అతని భార్య వారి పేర్లలో నమోదైన ఆస్తులను అమ్మేసింది. కానీ బంధువుల పేర్లతో కొనుగోలు చేసిన చాలా ఇళ్ళు, భూములు కుటుంబానికి తిరిగి ఇవ్వలేదు. ఒకప్పుడు కోట్లలో విలువైన బినామీ ఆస్తులు వారి చేతుల్లో నుండి పూర్తిగా జారిపోయాయి.

చిన్నప్ప ఏకైక కుమారుడు రాజా బహదూర్ సినిమా కెరీర్ కోస‌ ప్రయత్నించాడు కానీ అదే విజయాన్ని పొందలేదు. ఒకప్పుడు ఎకరాల భూమిని, డజన్ల కొద్దీ ఇళ్లు క‌లిగి ఉన్న ఆ కుటుంబానికి నేడు పుదుక్కోట్టైలో ఆస్తి లేదు. చిన్నప్ప అసాధారణ జీవితంలో చివ‌రికి అత‌డి స్మార‌క చిహ్నం త‌ప్ప ఇంకేమీ మిగ‌ల‌లేదు.

Tags:    

Similar News