బాలయ్య 'అఖండ 2'.. దిల్ రాజు ఎంట్రీతో అంతా సెట్!
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా విడుదల అయిన విషయం తెలిసిందే.;
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో నటించిన అఖండ 2 తాండవం మూవీ రీసెంట్ గా విడుదల అయిన విషయం తెలిసిందే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఎట్టకేలకు నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముందు రోజు నైట్ పెయిడ్ ప్రీమియర్స్ తోనే అఖండ 2 సందడి మొదలైంది.
అయితే దసరా పండుగ కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ కావాల్సిన అఖండ 2ను మేకర్స్ అప్పట్లో డిసెంబర్ 5కు వాయిదా వేశారు. అందుకు తగ్గట్టు షూటింగ్ ను కంప్లీట్ చేసి ప్రమోషన్స్ చేపట్టారు. అదిరిపోయే రీతిలో ఉన్న ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేసి సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేశారు. అందరి దృష్టి తమవైపు తిప్పుకున్నారు.
దీంతో మూవీ కోసం అటు అభిమానులు.. ఇటు సినీ ప్రియులు ఈగర్ గా వెయిట్ చేశారు. టికెట్స్ కూడా బుక్ చేసుకున్నారు. కానీ అప్పుడు ఏం జరిగిందో తెలిసిందే. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఎంటర్టైన్మెంట్స్.. అఖండ 2 విడుదలపై స్టే విధించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమకు ఆ మూవీ బ్యానర్ 14 రీల్స్ ప్లస్ బకాయి ఉన్నట్టు తెలిపింది.
ఈరోస్ పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. మొత్తం డబ్బులు చెల్లించాక సినిమా విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో ప్రీమియర్స్ కు కొన్ని గంటల ముందు ఊహించని ఆటంకం ఎదురైంది. అయితే వెంటనే రంగంలోకి మేకర్స్ దిగారు. కానీ చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. బాలయ్య అభిమానుల్లో కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటే ఇలా చేస్తారా అంటూ మండిపడ్డారు. అంతే కాదు.. ఏకంగా దిల్ రాజు, చిరంజీవి వల్ల సినిమా ఆగిపోయిందని ఆరోపణలు చేశారు. వారికి ఎలాంటి సంబంధం లేకపోయినా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు దిల్ రాజు.. సినిమా రిలీజ్ అయ్యే విషయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆ విషయాన్ని నిర్మాతలే తాజాగా వెల్లడించారు.
అఖండ 2కు వస్తున్న సూపర్ రెస్పాన్స్ కు నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట రీసెంట్ గా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల, అనుకోని ఘటనల వల్ల ఒక వారంపాటు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపారు. అందుకు బాలయ్యకు, ఆయన అభిమానులకు, డైరెక్టర్ బోయపాటికి సారీ చెప్పారు.
ఇలా జరుగుతుందని ఊహించలేదని, వచ్చిన సమస్యను పరిష్కరించుకునేందుకు దిల్ రాజు సపోర్ట్ చేశారని తెలిపారు. మ్యాంగో మీడియా రామ్ కూడా హెల్ప్ చేశారని చెప్పారు. వాళ్లకు చాలా థ్యాంక్స్ చెబుతున్నామని, ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసిందని పేర్కొన్నారు. దీంతో అప్పుడు దిల్ రాజుపై తప్పుడు విమర్శలు చేసిన వారికి ఇది గట్టి సమాధానమనే చెప్పాలి.