అంతటి రికార్డ్ వద్దంటున్న కుర్ర హీరో..!
'లవ్ టుడే' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి యంగ్ స్టార్ హీరోల సరసన చేరిన హీరో ప్రదీప్ రంగనాథన్.;
'లవ్ టుడే' సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి యంగ్ స్టార్ హీరోల సరసన చేరిన హీరో ప్రదీప్ రంగనాథన్. 2022లో తమిళ్‌లో వచ్చిన లవ్ టుడే, తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ ఆశించిన స్థాయిలో ఆడకున్నా ఓటీటీలో మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ప్రదీప్ రంగనాథన్‌కి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ ఏడాది ఈ కుర్ర హీరో నటించిన తమిళ మూవీ డ్రాగన్ కూడా తెలుగులో సెన్షేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. యూత్‌లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. తమిళ ఆడియన్స్ మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు, ముఖ్యంగా తెలుగు యూత్ ఆడియన్స్ ఎక్కువగా ప్రదీప్ రంగనాథన్ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదిలో ఆయన నుంచి రెండు సినిమాలు రావాల్సి ఉంది.
ప్రదీప్ రంగనాథన్ ఎల్‌ఐకే రిలీజ్ డేట్
నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'ఎల్‌ఐకే' సినిమా రూపొందుతోంది. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడంతో ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటి ఈ ఎల్‌ఐకే సినిమాను 2025 దీపావళికి విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. దీపావళి కోసం ప్రదీప్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే ప్రదీప్ నటిస్తున్న మరో సినిమా డూడ్ ను సైతం 2025 దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఊరికే ప్రకటించడం కాకుండా ఏకంగా డేట్ తో పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. దాంతో ఎల్‌ఐకే, డూడ్ సినిమాలు ఒకే సారి విడుదల కాబోతున్నాయని, ప్రదీప్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకోబోతున్నాడని తెగ ప్రచారం జరిగింది.
ఎల్‌ఐకే, డూడ్ ఒకే సారి రిలీజ్
ఈ మధ్య కాలంలో ఒకే ఏడాది ఒక హీరో సినిమాలు రెండు రావడం కష్టంగా ఉంది, ఒకే నెలలో ఒక హీరో సినిమాలు రెండు విడుదల దాదాపు అసాధ్యంగా ఉంది. అలాంటిది ఒకే రోజు ఒక హీరో నటించిన సినిమాలు రెండు రావడం అనేది ఖచ్చితంగా అత్యంత అరుదైన రికార్డ్‌గా చెప్పుకోవచ్చు. సినీ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఒక అర డజను జరిగి ఉంటాయేమో. ఇప్పుడు ఆ అరుదైన రికార్డ్‌ను ప్రదీప్ రంగనాథన్ దక్కించుకోబోతున్నాడు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు మాత్రం ఈ సినిమాలు రెండు ఒకే సారి విడుదల అయితే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి సమయంలో హీరో ప్రదీప్ స్వయంగా మాట్లాడుతూ బాబోయ్ నాకు అంతటి అరుదైన రికార్డ్ వద్దులే అన్నట్లుగా కామెంట్స్ చేశాడు.
2025 దీపావళి బరిలో ఒకే సినిమా
ప్రదీప్ మాట్లాడుతూ... నేను నటిస్తున్న సినిమా ఒకటి 2025 దీపావళికి రాబోతున్న మాట వాస్తవం. కానీ మరో సినిమా ఎప్పుడు అనేది ఇంకా ఫిక్స్ కాలేదు అన్నాడు. దీపావళికి ఒకే సినిమాను విడుదల చేస్తామని క్లారిటీ ఇవ్వడం ద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు తెరదించినట్లు అయింది. అయితే దీపావళికి వచ్చే సినిమా ఏది, ఆగే సినిమా ఏది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రెండు సినిమాలకు సంబంధించిన దర్శకులు, నిర్మాతలు తమ సినిమాను దీపావళికే విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రదీప్ వారిని ఏదో విధంగా ఒప్పించి, తగ్గించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరిని ప్రదీప్ ఒప్పించి, దీపావళి బరి నుంచి తప్పిస్తాడు అనేది చూడాలి. తమిళ సినీ వర్గాల్లో మాత్రం దీపావళికి ఎల్‌ఐకే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. డూడ్ కాస్త ఆలస్యంగా క్రిస్మస్‌కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.