పాన్ ఇండియా స్టార్ నేల విడిచి సాము?

తాజాగా తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం అనంత‌రం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క‌ల్కి 2898ఏడి సీక్వెల్ గురించి వ్యాఖ్యానించారు.;

Update: 2025-04-06 07:29 GMT

డార్లింగ్ ప్ర‌భాస్ నెక్ట్స్ ఏంటి? అనేది సందిగ్ధంలో ఉంది. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'రాజా సాబ్' త్వ‌ర‌లో విడుద‌ల‌కు రావాల్సి ఉన్నా ఆల‌స్య‌మైంది. ఈ సినిమాకి సంబంధించిన త‌దుప‌రి అప్ డేట్ ఎప్పుడొస్తుందో స‌రైన‌ స్ప‌ష్ఠ‌త లేదు. ఈ సినిమాతో పాటు హ‌ను రాఘ‌వ‌పూడితో ఫౌజీ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. అలాగే 'సలార్ 2' పైనా ప్ర‌భాస్ ఫోక‌స్ చేసాడు. 'స‌లార్ 2'ని హోంబ‌లే సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించినా, ఆ త‌ర్వాత యాక్ష‌న్ సీక్వెన్సులు తెర‌కెక్కించార‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ లేటెస్ట్ అప్ డేట్ లేక అభిమానులు నిరాశ‌గా ఉన్నారు.

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో 'స‌లార్' సీక్వెల్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్క‌నుంద‌ని హోంబ‌లే సంస్థ వెల్ల‌డించింది. ఇప్పుడు ఈ రెండు సినిమాల రిలీజ్ తేదీల‌పై మ‌రింత స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. ఈ ఏప్రిల్ లో రావాల్సిన 'రాజాసాబ్' అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వ్వ‌డంపై అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.

సందీప్ వంగాతో 'స్పిరిట్' ఈ ఏడాది చివ‌రిలో ప్రారంభ‌మ‌వుతుంద‌ని ఇంత‌కుముందే క‌థ‌నాలొచ్చాయి. అయితే ఇది 'క‌ల్కి 2' కంటే ముందే సెట్స్ పైకి వెళుతుందా? లేదా! అన్న‌ది ఇప్ప‌టికి సస్పెన్స్. తాజాగా తిరుమ‌లేశుని ద‌ర్శ‌నం అనంత‌రం ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క‌ల్కి 2898ఏడి సీక్వెల్ గురించి వ్యాఖ్యానించారు. క‌ల్కి 2 ఇప్పుడే ప్రారంభం కాదు. ప్ర‌స్తుతం స్క్రిప్టు ప‌నులు సాగుతున్నాయి. బౌండ్ స్క్రిప్ట్ సిద్ధ‌మ‌వ్వ‌డానికి ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అనేదానిని బ‌ట్టి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంద‌ని తెలిపారు. ఏడాది చివ‌రి నాటికి ప్రారంభించే ఆలోచ‌న ఉంద‌ని అన్నారు. అయితే సందీప్ వంగా స్పిరిట్ బౌండ్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడా లేదా? అత‌డి త‌దుప‌రి ప్రాజెక్ట్ కి సంబంధించిన పని ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చింది? అనేదానిపైనా స‌రైన స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది. రేసులో సందీప్ వంగా ముందున్నాడా? నాగ్ అశ్విన్ ముందున్నాడా? అన్న‌ది తేలాల్సి ఉంది. ఈ మ‌ధ్య‌లో ఫౌజీ చిత్రీక‌ర‌ణ‌ను వేగంగా పూర్తి చేసేందుకు హ‌ను రాఘ‌వ‌పూడి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత కూడా ప్ర‌భాస్ ని లాక్ చేయాల‌ని అత‌డు గ‌ట్టి ప్లాన్ తో ఉన్నాడ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

రాజాసాబ్, ఫౌజీ, స‌లార్ 2, క‌ల్కి 2898 ఏడి, స్పిరిట్, క‌న్న‌ప్ప‌లో అతిథి పాత్ర‌, హ‌నుతో మ‌రో మూవీ.. ఈ లైనప్ చూస్తుంటే ప్ర‌భాస్ ఐదేళ్లు బ్లాక్ అయిపోయాడ‌ని అర్థ‌మ‌వుతోంది. కానీ అత‌డి నుంచి ఒక్కో సినిమా రిలీజ్ కావ‌డానికి ఏళ్ల త‌ర‌బ‌డి స‌మ‌యం ప‌డుతోంది. దీంతో అభిమానులు చాలా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భాస్ ఒకేసారి అర‌డ‌జ‌ను పాన్ ఇండియ‌న్ ప్రాజెక్టుల‌ను డీల్ చేస్తూ ఒత్తిడిని అనుభ‌విస్తున్నాడా? అత‌డు నేల విడిచి సాము చేస్తున్నాడా? అనే సందిగ్ధ‌త‌ను అభిమానులు వ్య‌క్తం చేస్తున్నారు.

Tags:    

Similar News