సెట్‌లోకి పవన్ ఓకే..మరి సినిమా ఎప్పుడొస్తుంది?
ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు.;
ఏపీ డిప్యూటీ సీఎం, హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు అంగీకరించిన ప్రాజెక్ట్‌లను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. గత కొంత కాలంగా ప్రారంభించి మధ్యలో ఆగిపోయిన సినిమాల షూటింగ్‌లని చకచక పూర్తి చేస్తున్నారు. ఇటీవల `హరి హర వీరమల్లు` మూవీ షూటింగ్‌ని మొదలు పెట్టి పూర్తి చేశారు. ఆయన నటించిన తొలి పీరియాడిక్ అండ్ పాన్ ఇండియా మూవీ ఇది. క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ ఈ మూవీని తెరకెక్కించారు. ఏ.ఎం.రత్నం నిర్మించిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.
ఇక ఈ ప్రాజెక్ట్‌తో పాటు సుజిత్ డైరెక్ట్ చేస్తున్న `ఓజీ` మూవీ షూటింగ్ కూడా గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌ని తిరిగి మొదలు పెట్టిన పవన్ కల్యాణ్ ఎట్టకేలకు పూర్తి చేశారు. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ మరో సినిమాని కూడా ఆ మధ్య పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. అదే `ఉస్తాద్ భగత్‌సింగ్`. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్నాళ్లుగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్‌ని ఇటీవలే పవన్ కల్యాణ్ తిరిగి సెట్‌లోకి అడుగు పెట్టడంతో ప్రారంభించారు.
హైదరాబాద్‌లో ప్రారంభమైన కొత్త షెడ్యూల్‌లో మంగళవారం నుంచి పవన్ కల్యాణ్ పాల్గొంటున్నారు. పవన్ రాకతో సెట్‌లో సందడి మొదలైంది. ఇతర కీలక నటీనటులు కూడా సెట్‌లోకి ప్రవేశించారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న `హరి హర వీరమల్లు` సినిమా జూన్ 12న విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ ఎక్స్ కారణంగా మళ్లీ వాయిదా పడింది. మళ్లీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. దీని పరిస్థితే ఇలా ఉంటే షూటింగ్ పూర్తి చేసుకున్న ఓజీ, షూటింగ్ దశలో ఉన్న `ఉస్తాద్ భగత్‌సింగ్` పరిస్థితేంటీ?
అనే చర్చ జరుగుతోంది. పవన్ సెట్‌లోకి అడుగుపెట్టి షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఓకే కానీ మరి రిలీజ్ ఎప్పుడు? అని అభిమానులు, సినీ లవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఏళ్ల తరబడి డిలే అయిన ఈ ప్రాజెక్ట్‌లు ఇప్పటికైనా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావాలని, అలా రాలేకపోతే సినిమాకు, నిర్మాతలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని, ఈ విషయంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుని సరైన సమయంలో సినిమాలు రిలీజ్ అయ్యేలా చూడాలని మూవీ లవర్స్, పవన్ అభిమాన వర్గాలు కోరుకుంటున్నాయి.