కీరవాణి మ్యాజిక్.. పవన్ ఫిదా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మళ్లీ అంచనాలు పెరుగుతున్నాయి.;

Update: 2025-05-20 09:53 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై మళ్లీ అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల షూటింగ్ పూర్తి చేసిన పవన్ మేకర్స్ తో మరింత క్లోజ్ గా సినిమా అవుట్ ఫుట్ పై చర్చలు జరపడం విశేషం. ఇక నెక్స్ట్ కొత్త సాంగ్ ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ మే 21న రిలీజ్ కానుంది. ఈ గీతాన్ని ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణి స్వరపరిచి, సాహిత్యం అందించారు. “మనలోని పౌరుషం, వీరత్వం ఎన్నటికీ చల్లబడకూడదు” అనే భావనతో ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రగిల్చేలా ఈ పాట రూపొందింది.


కీరవాణి చరణాకోలతో వీరత్వాన్ని తట్టిలేపే ఈ గీతం, నేటి పరిస్థితుల్లో మనలో చేవ జారకూడదనే సందేశాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. హరిహర వీరమల్లు సినిమాకు కీరవాణి అందించిన సంగీతం, నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకెళ్తాయని పవన్ కొనియాడారు. కీరవాణి గారు ఈ సినిమాకు నిజంగా ప్రాణం పోశారు. ఆయన తపన, అంకిత భావంతో స్వరాలు అందించడం చూశాను. ‘మొదటిసారి మీతో చేస్తున్నాను, అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు కదా, అందుకు తగ్గట్లు ఉండాలి’ అని ఆయన చెప్పడం ఆయనలోని నిబద్ధతను చూపిస్తుంది” అని పవన్ అన్నారు.


కీరవాణి తన సంగీత ప్రస్థానంలో అనేక మైలురాళ్లను అందుకున్నారు. చక్రవర్తి వద్ద శిష్యరికం నుంచి వేటూరి, సిరివెన్నెల లాంటి గొప్ప రచయితలతో అనుబంధం వరకు ఆయన ప్రయాణం అద్భుతం. తెలుగు కథలను ఇష్టపడే కీరవాణి, 32 కథల సంకలనాన్ని సిద్ధం చేసుకున్నారు, అందులో ఆయన రాసిన రెండు కథలు కూడా ఉన్నాయి. ఈ సంకలనం ఆయన సాహిత్య ప్రేమను, సృజనాత్మకతను చూపిస్తుంది.

కీరవాణి సంగీత దర్శకుడిగా మాత్రమే కాక, చక్కటి సాహిత్య రచయితగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన పదాలు రచయితలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పవన్ అన్నారు. “తెరపై రెండున్నర గంటల సినిమా కనిపిస్తుంది, కానీ కీరవాణి గారు నెలల తరబడి తపనపడి స్వరాలు అందిస్తారు. తెలుగు పాటను ఆస్కార్ వేదికపైకి తీసుకెళ్లిన ఆయన, వీరమల్లు తో మరోసారి అదరగొట్టనున్నారు” అని పవన్ కొనియాడారు.

హరిహర వీరమల్లు జూన్ 12, విడుదల కానుంది. కీరవాణి సంగీతం, పవన్ కళ్యాణ్ యాక్షన్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ సాంగ్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాను క్రిష్ దర్శకత్వంలో మొదలు పెట్టగా జ్యోతిక్రిష్ణ ఫీనిషింగ్ టచ్ ఇచ్చారు.

Full View
Tags:    

Similar News