'దండోరా' డేరింగ్ స్టెప్.. ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
అయితే ఇదివరకే దర్శకుడు మురళీకాంత్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం 'బలగం' తరహా సినిమా ఉండదట.;
తెలంగాణ గ్రామీణ నేపథ్యం, కులం వంటి సున్నితమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం 'దండోరా'. శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. అయితే మేకర్స్ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల ముందే, అంటే డిసెంబర్ 23 నుంచే ఎర్లీ ప్రీమియర్స్ వేయడానికి ప్లాన్ చేశారు. అది కూడా కేవలం 99 రూపాయల టికెట్ ధరతోనే సినిమాను ప్రదర్శించనున్నారు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు ఇదొక సక్సెస్ ఫార్ములాగా మారింది. రీసెంట్ గా వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' సినిమా కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యింది. పెయిడ్ ప్రీమియర్స్ వేసి, టికెట్ రేట్లు తగ్గించడం వల్ల జనాలు థియేటర్లకు వచ్చారు. కంటెంట్ బాగుండటంతో మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి సినిమా కమర్షియల్ గా సేఫ్ అయ్యింది. ఇప్పుడు 'దండోరా' టీమ్ కూడా అదే నమ్మకంతో ముందడుగు వేస్తోంది. తమ కంటెంట్ జనాలకు నచ్చుతుందనే కాన్ఫిడెన్స్ వారిలో కనిపిస్తోంది.
ఇక సినిమా జానర్ విషయానికి వస్తే, ఇది 'బలగం' సినిమాను గుర్తుచేస్తోందనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణ నేటివిటీ, చావు, ఎమోషన్స్ అనేవి 'బలగం'లో బాగా వర్కవుట్ అయ్యాయి. ఆ సినిమా సక్సెస్ తర్వాత అలాంటి రూటెడ్ స్టోరీలకు ఆదరణ పెరిగింది. అయితే 'దండోరా' కూడా అదే కోవలోకి వస్తుందా? ఆ రేంజ్ ఎమోషనల్ కనెక్షన్ ఇందులో ఉంటుందా? అనే క్యూరియాసిటీ క్రియేట్ అయ్యింది.
అయితే ఇదివరకే దర్శకుడు మురళీకాంత్ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇది కేవలం 'బలగం' తరహా సినిమా ఉండదట. అన్ని రకాల ఎమోషన్స్ తో కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. కాబట్టి దీన్ని మరో బలగంలా కాకుండా, ఒక కొత్త కథగా చూడాలని ఇంటర్వ్యూలో తెలిపారు. కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా, ఆలోచింపజేసే డైలాగ్స్ కూడా ఇందులో హైలైట్ కావున్నాయట.
ఏదేమైనా ప్రీమియర్స్ వేయడం అనేది రిస్క్ తో కూడుకున్న స్టెప్. టాక్ పాజిటివ్ గా వస్తే సినిమా రేంజ్ మారిపోతుంది, కలెక్షన్స్ పెరుగుతాయి. కానీ ఏమాత్రం తేడా కొట్టినా మెయిన్ రిలీజ్ పై ఆ ప్రభావం పడుతుంది. 99 రూపాయల టికెట్ అనేది ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించడానికి మంచి ప్లాన్. కానీ వాళ్ళను కూర్చోబెట్టి మెప్పించేది మాత్రం కంటెంటే.ఇక డిసెంబర్ 23న పడే ప్రీమియర్స్ ఈ సినిమా భవిష్యత్తును నిర్ణయిస్తాయి. తక్కువ టికెట్ రేటు, తెలంగాణ నేటివిటీ అనేవి ప్లస్ పాయింట్స్. మరి ఈ 'దండోరా' నిజంగానే బాక్సాఫీస్ దగ్గర మోగుతుందా అనేది చూడాలి.