తెలుగు సినిమా పుట్టిన రోజు!
తెలుగు సినిమా పితామహుడు రఘపతి వెంకయ్య నాయుడు అప్పటి నుంచే తెలుగులో సినిమాలు నిర్మించాలని, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు.;
తెలుగు సినిమా మూకీ నుంచి టాకీ వరకు..బ్లాక్ అండ్ వైట్ నుంచి ఈస్ట్‌మన్ కలర్ వరకు..35 ఎం ఎం నుంచి 70 ఎం ఎం సినిమా స్కోప్ వరకు.. మన స్టేట్ స్థాయి నుంచి పాన్ ఇండియా..పాన్ వరల్డ్ వరకు సాగిన ప్రయాణంలో ఎంతో మంది కృషి, అకుంఠిత శ్రమ ఉంది. ఎంతో మంది ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించడంతో ప్రముఖ పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో మన సినిమాకు జేజేలు పలికేలా చేశారు.
1909లోనే తెలుగు సినిమాల నిర్మాణానికి బీజం పడింది. తెలుగు సినిమా పితామహుడు రఘపతి వెంకయ్య నాయుడు అప్పటి నుంచే తెలుగులో సినిమాలు నిర్మించాలని, ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి 1921లో `భీష్మ ప్రతిజ్ఞ` పేరుతో తొలి మూకీ చిత్రాన్ని నిర్మించారు. దీనికి రఘుపతి వెంకయ్య నాయుడు నిర్మాతగా వ్యవహరించగా, ఆయన తనయుడు ఆర్,ఎస్, ప్రకాష్ నటించి రూపొందించారు.
1932లో హెచ్.ఎం.రెడ్డి డైరెక్ట్ చేసిన `భక్త ప్రహ్లాద`తో టాకీ సినిమాల యుగంమొదలైంది. అక్కడి నుంచి తెలుగు సినిమా ఎన్నో మార్పులు చెందుతూ వచ్చింది. సెకండ్ వరల్డ్ వార్ తరువాత 1950 నుంచి తెలుగు సినిమాకు స్వర్ణయుగం మొదలైంది. 1940 నుంచి 1950 మధ్య క్లాసిక్స్ నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు విజయా ప్రొడక్షన్స్, వాహిని స్టూడియోస్, భరణి పిక్చర్స్, ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, అన్నపూర్ణ పిక్చర్స్ ఏర్పడ్డాయి. ఆ తరువాతే మరపురాని మర్చిపోలేని క్లాసిక్స్ రూపొందాయి.
ఇదే సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ ప్రొడ్యూసర్‌లకు, డైరెక్టర్లకు నెలవుగా మారింది. కె.వి.రెడ్డి, బి.విఠాలాచార్య, కమలాకర కామేశ్వరరావు, వేదాంతం రాఘవయ్య, పి. పుల్లయ్య, బి.ఎన్.రెడ్డి తదితర గొప్ప గొప్ప దర్శకులు ఫోక్లోర్(జానపద), ఫాంటసీ, మైథలాజికల్ మూవీస్‌ని భారీ స్థాయిలో రూపొందించారు. ఆ సమయంలో వచ్చిన అపురూపప కళాఖండాలే పాతాళ భైరవి, మాయాబజార్, పాండురంగమహత్యం, సువర్ణసుందరి, భూకైలాస్, జయభేరి, శ్రీవెంకటేశ్వర మహత్యం, రాజమకుటం, దేవదాసు, మస్సమ్మ వంటి మరపురాని ఎవర్ గ్రీన్ క్లాసిక్స్.
`బాహుబలి`తో తెలుగు సినిమాకు కొత్త చాప్టర్ మొదలైంది. బాహుబలికి ముందు ఒక లెక్క..బాహుబలి తరువాత మరో లెక్క అన్నట్టుగా తెలుగు సినిమా పరిస్థితి మారింది. మూకీ నుంచి పాన్ ఇండియా..ఇప్పుడు `వారణాసి`తో పాన్ వరల్డ్ సినిమాలని అందిస్తూ ప్రపంచ స్థాయిలో మన సత్తాను చాటుతూ తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా విశ్వవ్యాప్తం చేస్తున్నాం. వందేళ్లకు పైగా ప్రేక్షకుల్ని నవ్వించి, ఏడిపించి, ఆలోచింపజేస్తూ సాగుతున్న తెలుగు సినిమా పుట్టిన రోజు నేడు (ఫిబ్రవరి 6). ప్రపంచ సినిమా తెలుగు సినిమా వైపు తలెత్తి చూస్తున్న నేపథ్యంలో తెలుగు ప్రేక్షకుడు ఎంతో గర్వపడుతున్న క్షణాలివి. హ్యాపీ బర్త్‌డే టాలీవుడ్.. మన కథలు, మన గర్వం..మన సినిమా..